నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 33:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు'' ప్రకారం మీరు దేవునికి జనులై యున్నారని చెప్పబడియున్నది. ఆలాగుననే, కీర్తనలు 135:4వ వచనములో చూచినట్లయితే, "యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను'' ప్రకారం దేవుడు ఇశ్రాయేలీయులను తన కొరకు ఎంతగానో ఏర్పరచుకొనియున్నాడు. ఇశ్రాయేలు మరియు యాకోబు ఇద్దరు ఒక్కటే. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలీయులను మరియు ఇశ్రాయేలు దేశమును ప్రభువు తన కొరకు ఎంతగానో ఏర్పరచుకొనెను. ఇంకను, ఆయన వారిని,' తన కంటి పాపగా కాపాడెదను' అని వారికి వాగ్దానము చేసియున్నాడు. ఆలాగుననే, వారు ప్రభువును వెంబడించినంత కాలము వారు ఎంతగానో ప్రభువు చేత కాపాడబడ్డారు. మరియు ఇంకను ద్వితీయోపదేశకాండము 33:29వ వచనములో మనము చూచినట్లయితే, "ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు'' ప్రకారం దేవుని పోలినవారెవరు లేరు, కనుకనే ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంతగానో దీవింపబడియున్నారు కదా! ప్రభువే వారిని ఎన్నుకొని, తన కొరకు స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకొనియున్నాడు. ఆలాగుననే, ప్రభువు వారిని దీవించి ఆశీర్వదించియున్నాడు. ప్రజలు ప్రభువును ఘనపరచినప్పుడు, ఆయన వారిని దీవిస్తానని ఆయన వాగ్దానము చేసియున్నట్లుగానే, వారిని ఆశీర్వదించియున్నాడు. చివరిగా, ఇశ్రాయేలీయుల ప్రజలను పాలు తేనెలను ప్రవహించు దేశమునకు ప్రభువు నడిపించాడు.

నా ప్రియమైన వారలారా, మనము కూడా ప్రభువును వెంబడించినంత కాలము ఆయన మనలను కాపాడుచూ, మనలను దీవించుచున్నాడు. కనుకనే, బైబిల్ నుండి నిర్గమకాండము 23:25 వ వచనమును మనము చూచినట్లయితే, "నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను'' అని చెప్పబడిన ప్రకారం ప్రభువు వారిని ఆశీర్వదించి, వర్థిల్లింపజేయడము మాత్రమే కాదు, వారి మధ్య నుండి రోగమును తొలగించి, వారిని దీవించెను. ఇంకను చిన్న, చిన్న విషయములలో కూడా ప్రభువు వారిని గురించి ఎంతో జాగ్రత్త వహించెను. ఆలాగుననే, నిర్గమకాండము 23:26 వ వచనమును మనము చూచినట్లయితే, "కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను'' అని ప్రభువు వాగ్దానము చేసియున్నాడు. కాబట్టి, వారందరు సమాధానముతోను, సంతోషముతోను జీవించునట్లుగా, ప్రభువు చేసియున్నాడు. ప్రభువు వారి యొక్క వర్థిల్లత యందు ఆనందించుచున్నాడు. అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మీరు ప్రభువుకు విధేయత చూపుతూ, ఆయనను వెంబడించినప్పుడు, ఆయన మీకు కేడెముగా ఉంటూ మిమ్మును కాపాడుచూ, మిమ్మును భద్రపరుస్తాడు. బైబిల్ నుండి నిర్గమకాండము 19:5వ వచనమును చూచినట్లయితే, "కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు'' అని చెప్పబడిన ప్రకారం మీ చుట్టు ఉన్నవారందరి కంటె అత్యధికముగా ప్రభువు మిమ్మును తనకు స్వకీయ సంపాద్యముగా అంగీకరించి, కాపాడుతాడు. ప్రభువు ఏర్పరచుకున్న జనులు ఎంతో ధన్యులుగా ఉంటారు.

నా ప్రియులారా, ప్రభువు మిమ్మును ఎందుకు ఎన్నుకొనియున్నాడు? ఎందుకనగా, మొదటిగా దేశమునకు దీవెనకరముగా ఉండడాని కొరకు మరియు ప్రపంచము నలమూలలకు ఆశీర్వాదకరముగా ఉండడానికి ఆయన మిమ్మును ఎన్నుకొనియున్నాడు. ప్రభువు అందుకొరకే, అబ్రాహామును ఎన్నుకొని, దీవించియున్నాడు. బైబిల్‌లో ఆదికాండము 12:2వ వచనమును చూచినట్లయితే, అబ్రాహామును దీవించి ఈలాగున చెప్పియున్నాడు, " నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు'' ప్రకారము, మీరు దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా ఉండడము కొరకై మీరు ఏర్పరచుకొనియున్నారని గుర్తించండి. నా ప్రియులారా, నేడు మీరు మాత్రమే ఆయన యొక్క స్వకీయ సంపాద్యముగా ఉన్నారు. మీరు ప్రభువుకు చెందినవారై యున్నారు. ప్రభువు మిమ్మును అనేకులకు దీవెనకరముగా మార్చును గాక. అనేకులకు ఆశీర్వాద కారణముగా ప్రభువు మిమ్మును ఏర్పరచుకొనియున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును నీ విలువైన స్వకీయ సంపాద్యముగా ఎంచుకున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, నిన్ను అనుసరించే మరియు శ్రద్ధగా విధేయత చూపే వారికి నీవు వాగ్దానం చేసిన ప్రేమ, కాపుదల మరియు ఆశీర్వాదాలకు వందనాలు. ప్రియ తండ్రీ, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు నీవే, ఇంకను ఇశ్రాయేలీయుల దేవుడవు నీవే గనుకనే, నీవు మాకు దేవుడవుగా ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, నీవు ఎన్నడును మమ్మును విడువకుండా, ఎడబాయకుండా మా జీవితములో ప్రతి చిన్న విషయములో కూడా నీవు మా పట్ల జాగ్రత్త వహించు ము. ప్రభువా, మా జీవితాలను నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాము, మా పితురులను ఆశీర్వదించిన , అదే హస్తముతో మమ్మును కూడా ఆశీర్వదించుము. దేవా, మమ్మునందరిని గొప్ప జనముగా చేసి, మా పేరును ఘనంగా హెచ్చించి, ఉన్నత స్థలమునకు మమ్మును లేవనెత్తుము. దేవా, మేము చేయునదంతయు నేడు సఫలపరచుము. ప్రభువా, ఇశ్రాయేలీయులను నీ కంటి పాపవలె కాపాడినట్లుగానే, ప్రతిరోజు మమ్మును నీకు దగ్గరగా చేర్చుకొని, మా నుండి సమస్త కీడు నుండి మమ్మును కాపాడి, మా అవసరతలన్నిటిని తీర్చుము మరియు మా జీవితం మరియు మా ఇంటి నుండి ప్రతి అనారోగ్యం మరియు దుఃఖాన్ని తొలగించుము. ప్రభువా, మేము జనములకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, నీ నామానికి మహిమ తీసుకురావడానికి దయచేసి నీ మార్గాలలో నమ్మకంగా నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నీకు మాత్రమే చెందినవారమనియు, నిన్ను పోలినవారెవరు లేరనియు నేడు మమ్మును మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. దేవా, మమ్మును గొప్ప జనముగా చేసి మమ్మును ఆశీర్వదించి మా పేరును గొప్ప చేసి, మమ్మును ఆశీర్వాదముగా నుండునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.