నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హబక్కూకు 2:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మిమ్మల్ని నీతిమంతులనుగా ఉంచియున్నాడు. కనుకనే, మీకు సమస్యలు ఎదురైనప్పుడవ మీరు వాటిని చూచి భయపడకండి. అనేకసార్లు మీరు, 'అయ్యో, బహుశా! నాలోనే ఏదో ఒక లోపం కలిగియున్నదేమో లేక, నేను ఏదో తప్పు చేసియున్నానేమో, అందుకే నాకు ఈ సమస్య మరియు ఈ కష్టము వచ్చినది అని అనుకుంటారు. ఆలాగున కాదు, నా ప్రియ స్నేహితులారా, సమస్యలు వచ్చినప్పుడే, మీ జీవితంలోని నీతికి గల శక్తిని ప్రజల యెదుట మరియు మీ యెదుట కూడా ప్రత్యక్షపరచబడుతుంది. ప్రియులారా, అనేక కష్టాలు, శ్రమలు మరియు బాధల మధ్యలో, కూడా మీరు నీతి మార్గంలో నడుచునట్లుగా నమ్మకమైనవారని దేవుడు మీకు కనుపరుస్తాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 3:22వ వచనములో చూచినట్లయితే, " అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది'' అని చెప్పబడిన ప్రకారము విశ్వసించే వారందరికీ యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా నీతి అనుగ్రహించబడుతుంది. మీరు యేసును మీ నీతిగా నమ్మినప్పుడు, మీరు గౌరవంతో, బలంతో నడిచెదరు మరియు అన్నిటికంటెను అత్యధికమైన విజయమును పొందుకొనువారుగా ఉంటారు.

నా ప్రియులారా, నేడు మిమ్మును మీరు నేరారోపణ చేసుకొననవసరము లేదు మరియు నిందించుకోనవసరము లేదు. అందుకు బదులుగా, 'మేము ప్రభువును నమ్ముకొనియున్నాము, కాబట్టి మేము నీతిమంతులముగా నడుచుకొనుచున్నాము' అని మీరు ధైర్యముగా చెప్పగలిగినట్లయితే, దేవుని యందు విశ్వాసముంచువారి కొరకు సిద్ధపరచిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు స్వాస్థ్యముగా పొందుకొంటారు. కాబట్టి, దేవుడు మిమ్మును నీతిమంతులుగా తీర్చిదిద్దియున్నాడు కనుకనే, మీరు ప్రభువును స్తుతించండి మరియు దేవుడు మిమ్మును నమ్మకత్వంగా ఉంచియున్నాడు కాబట్టి, మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ తర్వాత మీరు సమస్త ఆశీర్వాదములను పొందుకొని జీవించెదరు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 15:6 వ వచనములో చూచినట్లయితే, " అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను'' అని వ్రాయబడిన ప్రకారము అబ్రాహాము ప్రభువును నమ్మాడు మరియు అది అతనికి నీతిగా ఎంచబడియుండెను. ఎందుకనగా, దేవుడు తనను పిలిచాడని అబ్రాహాము నమ్మాడు మరియు అతని మనస్సాక్షి ప్రభువు ఎదుట యథార్థముగా ఉండెను గనుకనే, దేవుడు, 'నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు' అన్న వాగ్దానము ప్రకారము అతనికి సంతానం లేకపోయినప్పటికిని అతడు దేవుని యొక్క వాగ్దానము నమ్మాడు. మరియు 'అబ్రాహామును గొప్ప జనముగా చేయుదును అన్న దేవుని వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్నప్పటికిని, దేవుని యెదుట అతను నీతి విషయంలో తాను ఎప్పుడూ సందేహించలేదు. సరైన సమయంలో, దేవుడు అతనికి అద్భుతమైన సంతానమగు కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. మరియు అబ్రాహాము ద్వారా పిలువబడినటువంటి దేశము అది నేటికిని నిలిచియున్నది, అది 'ఇశ్రాయేలు' అనే ఒక దేశం. కనుకనే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అనుటకు ఆధారంగా, నేడు ఆ దేశము సాక్ష్యంగా నిలిచియున్నది. చూడండి, ఇది ఎంత గొప్ప ధన్యత కదా!

కాబట్టి, నా ప్రియులారా, మీరు కష్టాలన్నిటి మధ్యలో నీతిమార్గంలో నమ్మకంగా నడుచుకున్నప్పుడు, మీరు మెండైన దీవెనలతో నింపబడతారు. అయితే, నీతికి ఫలం ఏమై యున్నదని మనము బైబిల్ నుండి యెషయా 32:17వ వచనములో చూచినట్లయితే, "నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు'' అన్న వచనము ప్రకారం, నీతి వలన సమాధానము కలుగుతుంది. అవును, నీతి ఫలము ఏమనగా? సమాధానము. తద్వారా, మీ జీవితకాలమంతయు మీకు సమాధానము కలుగుతుంది. రెండవదిగా, బైబిల్ నుండి మత్తయి 5:6వ వచనములో చూచినట్లయితే, " నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు'' ప్రకారము మనము నీతి కొరకు ఆకలిదప్పులు గలిగియున్నప్పుడు, మనకు దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడుతుందని బైబిల్ నుండి మత్తయి 6:33వ వచనములో మనకు గుర్తుచేయుచున్నదేమనగా, " కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును'' ప్రకారము మీరు మొదట దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెదకినప్పుడు ఈ దీవెనలన్నియు మీకు అనుగ్రహించబడును. చివరగా, బైబిల్ నుండి మత్తయి 5:10వ వచనములో చూచినట్లయితే, మీరు ఎదుర్కొంటున్న కష్టాల మధ్యలో కూడా మీరు భయం లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే, పరలోక రాజ్యం మీ సొంతమవుతుంది. తద్వారా, పరలోకం మీకు తెరవబడుతుంది. దేవుడు మీకు ఈ ఆశీర్వాదాలను అనుగ్రహించి, మిమ్మల్ని నీతిమంతులుగా ఉంచును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:

సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రేమగల ప్రభువా, యేసుపై మా విశ్వాసం ద్వారా మమ్మును నీతిమంతులుగా ఉంచినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మేము కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, మమ్మును మేము నేరారోపణ చేసుకొనకుండా మరియు నిందించుకోకుండా మాకు సహాయం చేయుము. దేవా, మా యొక్క నీతి శోధనలలో మాత్రమే జ్యోతుల వలె ప్రకాశిస్తుందని మాకు గుర్తు చేయుము. ప్రభువా, దయచేసి మా హృదయాన్ని నీ పరిపూర్ణ సమాధానముతో నింపుము. దేవా, ప్రతిరోజూ నీ నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయుము. యేసయ్య, శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు మేము ఎటువంటి భయం లేకుండా, నీలో నమ్మకంగా నడవడానికి మమ్మును నీ శక్తిచేత బలపరచుము. దేవా, నీ పరిపూర్ణ సమయంలో మా జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని నీవు జోడిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా పితురుల వలె మేము నీకు నీతిగా జీవించుటకును మరియు వారు పొందుకొన్న ఆశీర్వాదములను మేము కూడా పొందుకొని అనుభవించునట్లుగా మాకు విశ్వాసమును మరియు కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.