నా ప్రియమైనవారలారా, బహుశా! మీరు ఇలా అడగవచ్చును: 'ప్రభువు నన్ను ఎందుకు సృష్టించాడు? నాకు ఎన్నో సమస్యలు ఉన్నవి. నేను ప్రతిరోజు ఏడ్చుచున్నాను. ఇంకను ఒంటరి తనంలోను మరియు వ్యాధులతోను ఎంతగానో బాధపడుచున్నాను' అని అనవచ్చును. అయి తే, నా ప్రియ స్నేహితులారా, మిమ్మును సృష్టించడములో ప్రభువుకు ఒక ఉద్దేశము కలదు. అందుకే బైబిల్ నుండి నేటి వాగ్దానముగా కీర్తనల గ్రంథము 115:15వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు'' అని చెప్పబడినట్లుగానే, నేడు ప్రభువు మిమ్మును ఆశీర్వదించడానికి మరియు ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చడానికి సృష్టించియున్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి. ఈ ఆశీర్వాదము ఈ రోజు మీ మీదికి దిగివచ్చును గాక. యేసు నామమున, ఈ లోకములో ఒక దీవెనకరమైన వారుగా జీవించుటకు ప్రభువు మీకు ఇటువంటి కృపను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, ధైర్యంతో, మీరు మీ జీవితంలోనికి ప్రవేశించండి మరియు ఎల్లప్పుడు ఇలాగున ప్రకటించండి, "నన్ను ఆశీర్వదించడానికే ప్రభువు నన్ను సృష్టించియున్నాడు'' అని చెప్పండి. అవును, ఆకాశం మరియు భూమిని చూడండి. ప్రభువు వర్షమును, సూర్యుడిని సృష్టించియున్నాడు. సూర్యరశ్మి లేకపోయినట్లయితే, సూక్ష్మక్రిములు అధికముగా పెరుగుచూ, మనకు హాని కలిగించేవిగా ఉంటున్నవి. ఇంకను, అంతా చల్లబడిపోయి, భూమి అంతా మంచుతో నిండిపోయేది. కానీ, దేవుడు సూర్యుడిని సృష్టించి, దానికి వేడిని అనుగ్రహించి, ఈ ప్రమాదములన్నిటి నుండి మనలను కాపాడుచున్నాడు. మన మేలు కొరకు ఆయన సమస్తమును ఎంత అద్భుతంగా సృష్టించియున్నాడు కదా!

అందుకే బైబిల్ నుండి యోహాను 1:3వ వచనములలో చూచినట్లయితే, "సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు'' అని చెప్పబడినట్లుగానే, ఆయనే సమస్తమునకు సృష్టికర్తయై యున్నాడు. ఆయన ఈనాటికి కూడా సమస్తమును సృష్టించుచూ, రూపుదిద్దుతూనే ఉన్నాడు. ఈ లోకమునకు వచ్చు సమస్త జీవరాశులు ఆయన ద్వారానే సృష్టింపబడి, ఈ లోకమునకు పంపబడియున్నవి. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:16వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను'' అని చెప్పబడినట్లుగానే, సమస్తము ఆయనయందు మాత్రమే సృష్టించబడియున్నవి. ఇంకను ప్రకటన 4:11వ వచనములో చూచినట్లయితే, "ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి'' అని చెప్పబడినట్లుగానే, ఆయన సమస్తమును సృష్టించి, ఆయన సంకల్పం వలననే అవన్నియు ఉనికిలోకి వచ్చెననియు మరియు సృష్టించబడియున్నవని మనకు తెలియజేయుచున్నది. విశాలమైన ఈ విశ్వంలో ఉన్న సమస్తమును ఆయన అద్భుతమైన రూపకల్పనకు అనుగుణంగా పరిపూర్ణమైన కొలమానముతో సృష్టించబడినది. ప్రతి వివరమూ ఆయన దైవికమైన ప్రణాళిక ప్రకారమే ఉనికిలో ఉన్నది. మానవ శరీరము మరియు అది ఎంత అద్భుతంగా పనిచేయుచున్నదని చూచినట్లయితే, ' మన శరీరములో ఏదైనా అంటువ్యాధి (ఇన్‌ఫెక్షన్) సోకినప్పుడు, దానిని ఎదుర్కొని నాశనం చేయడానికి శరీరం నలుమూలల నుండి ప్రతిరక్షకాలు (యాంటీబాడ్సీ) వెంటనే పుట్టుకొస్తాయి. దేవుని సృష్టిలో ఆయన జ్ఞానమును మనము చూచుచున్న అనేక మార్గములలో ఇది ఒకటి. నిజంగానే, మన శరీరము ఒక విచిత్రమైన, అద్భుతమైన మరియు ఆశీర్వాదకరమైన సృష్టి. కనుకనే, ఆయనే మిమ్మును సృష్టించియున్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి; మిమ్మును సృష్టించిన ఆ దేవుని చేతులలోనికి మీ జీవితములను సమర్పించుకొనండి. ఆయన మనలను సృష్టించిన ఉద్దేశములో అనేక విధములు ఉన్నవి.

అందులో మొట్టమొదటిదిగా: ఆయనను ఆరాధించడానికి ఆయన మనలను సృష్టించాడు: ఆయన మనలను ఎందుకు సృష్టించాడు? ఆయనను ఆరాధించడానికి. అందుకే బైబిల్ నుండి నెహెమ్యా 9:6వ వచనములో చూచినట్లయితే, " నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు'' అని చెప్పబడినట్లుగానే, ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమి దానిలో ఉన్న సమస్తమును ఆయనను స్తుతించవలెను. ఆయన సృష్టించిన సమస్తమును ఆయన ద్వారానే నిలిచియున్నవి మరియు ఆయన మహిమ కొరకు ఈ ఉనికిలో ఉన్నవి. కాబట్టి, మనము ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయనను ఆరాధించవలెను.

రెండవదిగా: మనము జీవించడానికి ఆయన సమస్తమును సృష్టించియున్నాడు: ఈ లోకములో మానవాళి జీవించడానికి అవసరమైన ప్రతిదానిని ప్రభువు సృష్టించియున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 1:1-4వ వచనములలో చూచినట్లయితే, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను '' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఈ లోకమును ఎలా సృష్టించాడో మరియు దానిలోకి వెలుగును ఎలా తీసుకు వచ్చియున్నాడని వివరించుచున్నది. ఆయన భూమిని మరియు దానిలో ఉన్న సమస్తమును మానవ జీవితము కొరకు సిద్ధపరచియున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 29:11వ వచనములో చూచినట్లయితే, " నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువుకు మన పట్ల ఒక ఉద్దేశము కలదు. ఆ ఉద్దేశము మన జీవితములో ఒక భవిష్యత్తు మరియు ఒక నిరీక్షణను కలిగించుచున్నది. కనుకనే, మీరు తప్పకుండా ఒక మంచి భవిష్యత్తును కలిగియుంటారు. ఎన్నటికిని కీడు మిమ్మును తాకకూడదు. కాబట్టి, మీరు ధైర్యంగా ఉండి ఆయన ఉద్దేశములను విశ్వసించమని ప్రభువు మిమ్మును పిలుచుచున్నాడు.

మూడవదిగా: ఆయన మిమ్మును ఒక ఉద్దేశంతో సృష్టించియున్నాడు: ప్రభువు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతోనే సృష్టించియున్నాడు. ప్రతిఒక్కరు ఎలా జీవించవలెను? ఏమి చేయవలెను? ఆయన జీవముతో మనము ఎలా నింపబడవలెను? మరియు ఇతరులకు జీవమును ఎలా అందించవలెను? అనే విషయాలను ఆయన నిర్ణయించియున్నాడు. ఈ లోకంలో జీవించ డానికి మీకు ఒక ఉద్దేశము కలదు. కనుకనే, ఈ యొక్క దేవుని సంకల్పం మరియు దేవుని ఉద్దేశము నెరవేర్చబడతాయి. కాబట్టి, మిమ్మును మీరు పూర్తిగా ప్రభువుకు అప్పగించుకొనవలెను. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 1:27వ వచనములలో చూచినట్లయితే, " దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనలను తన స్వరూపంలోనే సృష్టించియున్నాడు. ఈ లోకంలో తన స్వరూపమును మరియు తన చిత్తమును (మనస్సును) ప్రత్యక్షపరచడానికి ఆయన మిమ్మును సృష్టించియున్నాడు. కనుకనే బైబిల్ నుండి సామెతలు 16:4వ వచనములో చూచినట్లయితే, " యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు సమస్తమును దాని దాని పని నిమిత్తము సృష్టించియున్నాడు.

నాల్గవదిగా: ఆయన భూమిని స్వాస్థ్యముగా సృష్టించియున్నాడు: ప్రభువు మానవుని సృష్టించి, భూమిని అతనికి స్వాస్థ్యముగా అనుగ్రహించి దాని మీద ఉంచియున్నాడు. అందుకే, ఆయన ద్వారానే సమస్త లోకములను సృష్టించినవాడు ఆయనే. కనుకనే, బైబిల్ నుండి హెబ్రీయులకు 1:2వ వచనములో చూచినట్లయితే, " ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను '' అని దేవుని కుమారుని గురించి పేర్కొనబడియున్నది. కనుకనే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:10వ వచనములో చూచినట్లయితే, " భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగును'' అని చెప్పబడినట్లుగానే, యేసు నామమున పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు మరియు భూమి క్రింద ఉన్నవారు అందరి మోకాళ్లు వంగవలసినదే. ప్రభువు మనకు ఆ అమూల్యమైన నామమును అనుగ్రహించి, ఈ లోకములో ఆయన ఆశీర్వాదమును పొందుకునే మార్గమును మనకు కల్పించియున్నాడు. కనుకనే, సమస్తము ఆయన నుండి, ఆయన ద్వారా మరియు ఆయన కోసమే సృష్టింపబడియున్నాము. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 11:36వ వచనములో చూచినట్లయితే, "ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి యున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.'' అవును, ఆయన సమస్తమును సృష్టించియున్నాడు మరియు మీ జీవితం కూడా ఆయన దైవీక సంకల్పంలో ఒక భాగమే. కాబట్టి, మిమ్మల్ని మీరు పూర్తిగా ఆయనకు సమర్పించుకొని, ఆయన ప్రణాళికను విశ్వసించండి, ఆయనను ఆరాధించి, స్తుతించండి, మరియు ఆయన మీ కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదము మరియు సంకల్పములో ధైర్యంగా ముందుకు నడవండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రేమగల తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువైన యేసయ్య, మమ్మును, ఒక అందమైన ఉద్దేశము తో సృష్టించి, మమ్మును ఒక ఆశీర్వాదకరముగా చేసినందుకై మీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మేము నీ చేత సృష్టించబడ్డామని మరియు మా జీవితం నీ దృష్టిలో అమూల్యమైనదని మేము గుర్తుంచునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నిన్ను ఆరాధించుటకును, నీ ప్రణాళికలను విశ్వసించడానికి మరియు నీవు మా పట్ల కలిగియున్న ఉద్దేశములో ధైర్యంగా నడవడానికి మాకు నేర్పించుము. దేవా, మా కుటుంబము, పని, పరిచర్య, పరిశుద్ధత, కష్టపడి పనిచేయడం మరియు నీతికి ప్రతిఫలములు వర్థిల్లునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదములను నాశనము చేయాలని చూచునట్లుగాను మరియు మా యొక్క ప్రతి కీడు నుండి మమ్మును కాపాడుము. ప్రభువా, నీ యొక్క చిత్తానుసారముగా ప్రతి ద్వారమును తెరువుము మరియు మా జీవితంలో నీ యొక్క ఆశీర్వాదములు అత్యధికమగునట్లుగా చేయుము. దేవా, మమ్మును మేము నీకు సంపూర్ణముగా సమర్పించుకొనునట్లుగాను, నీ నామమును మహిమపరచుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.