నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 140:12వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మీ పట్ల న్యాయమును తీర్చాలని కోరుచున్నాడు. ఎందుకంటే, దేవుడు న్యాయాధిపతియైన దేవుడు. ఆయన నీతిగల న్యాయాధిపతియై యున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 30:18 వ వచనములో చూచినట్లయితే, " కావున మీయందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు'' ప్రకారము దేవుడు న్యాయాధిపతియైన దేవుడు, ఆయన కొరకు ఎదురుచూచుచున్న ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించుట ద్వారా వారికి న్యాయమును జరిగిస్తాడు. అవును, నా ప్రియులారా, ఆయన మీ జీవితంలో, మీ కుటుంబంలో మరియు సమాజంలో మీకు న్యాయమును తీరుస్తాడు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి. నేడు కోర్టు కేసులో మీరు ఉన్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ పట్ల న్యాయమును జరిగించి, మిమ్మును ఆనందింపజేసి, ఆయన మీకు ఘనతను తీసుకువస్తాడు.

నా ప్రియులారా, సరే, ఆయన ఎవరికి న్యాయమును తీరుస్తాడు? తన భక్తులకు, ఆయన న్యాయమును తీరుస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 37:28వ వచనములో చూచినట్లయితే, "ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును'' అని చెప్పబడిన ప్రకారము ప్రభువు తన భక్తులకు న్యాయము జరిగించాలని వారి పట్ల కోరుచున్నాడు; ఆయన చిత్తమును జరిగించు భక్తులకు నీతిని జరిగిస్తాడు. నా ప్రియులారా, నేడు మీరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగియుంటూ, ఆయనకు భక్తులుగా మారండి. ఎందుకంటే, ప్రభువు తన చిత్తాన్ని నెరవేర్చే భక్తుల కొరకు న్యాయం చేయడానికి ఇష్టపడతాడు. మీరు దేవుని భక్తులు మరియు దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు, ఎందుకంటే మీరు భక్తులుగా ఉంటూ, ఆయన చిత్తాన్ని నెరవేర్చుదురు కనుకనే, ఆయన మీ జీవితంలో ఆయనను కలిగి ఉంటూ, ఆయనను మోయువారుగా ఉంటారు.

నా ప్రియులారా, ఆయన తన భక్తులను ఎలా కాపాడుతాడు? అందుకే బైబిల్ నుండి యిర్మీయా 17:7,8వ వచనములలో చూచినట్లయితే, "యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు''అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన భక్తులను జలముల యొద్ద నాటబడిన చెట్టువలె వారిని కాపాడుతాడు. వారి వేర్లు నీటిలో లోతుగా నాటబడి ఉంటాయి. తద్వారా, వెట్ట కలిగినప్పుడు, ఆయన భక్తులు నిత్యము భయపడరు. వారి ఆకులు, వారి జీవితం మరియు వారి కుటుంబం ఎల్లప్పుడూ పచ్చగా, వర్థిల్లుతూ ఉంటుంది. కరువు వచ్చినా, ప్రపంచమంతటా ఆర్థిక ఇబ్బందులు ఉన్నను సరే, ప్రభువు తన భక్తులకు న్యాయమును తీరుస్తాడు. కాబట్టి, వారికి ఎలాంటి చింతలు ఉండవు. కనుకనే, నా ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీ శరీరంలో యేసును మోసుకువెళ్లుచున్న దేవుని భక్తులుగా ఉన్నారా? ఆలాగైతే, దేవుడు మిమ్మును ఆపత్కాలములో కాపాడి, భయంకరమైన క్షామము మధ్యలో కూడా మీరు పచ్చగా ఉండునట్లుగాను చేసి, ఆయన మిమ్మును వర్ధిల్లజేస్తాడు. కనుకనే, ఈ రోజు, యేసు నామమున దేవుని న్యాయము మీ యొద్దకు వచ్చును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా పట్ల నీతిని మరియు న్యాయమును జరిగించే దేవునిగా ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, ఈ రోజు, మా జీవితమును, మా కుటుంబాన్ని మరియు మా భవిష్యత్తును నీ ప్రేమగల హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మేము మాట్లాడలేనప్పుడు లేదా పోరాడలేనప్పుడు, మేము వ్యాజ్యెము వేయలేనప్పుడు నీవు మా పక్షమున వ్యాజ్యమాడి మాకు న్యాయమును జరిగించుము. యేసయ్యా, ఆపత్కాలములో నీవు నీ యొక్క భక్తుల వలె మమ్మును కాపాడుము. దేవా, మా జీవితం ఫలవంతముగాను మరియు నిర్భయంగా జీవించుటకు కృపను అనుగ్రహించుము. ప్రభువా, దయచేసి మా జీవితంలోనికి ఘనత, సమాధానమును మరియు ఆనందాన్ని కలుగజేయుము. దేవా, మేము ఈ రోజు నీ న్యాయాన్ని పొందుకొను కృపను మాకు దయచేయుమని యేసు క్రీస్తు నీతిన్యాయములు గల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.