నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును స్వస్థపరచవలెనని మీ పట్ల కోరుచున్నాడు. యేసుక్రీస్తు స్వస్థపరచువాడై యున్నాడు. యేసుక్రీస్తు సమాధానమునకు అధిపతియై యున్నాడు. యేసుక్రీస్తు మీకు నిత్యము భద్రతను అనుగ్రహించు నిత్యుడగు తండ్రియై యున్నాడు. అందుచేత నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 33:6వ వచనమును మీ కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను'' అని ఆయన తెలియజేసినట్లుగానే, 'అత్యంత సమృద్ధియైన శాంతి, అత్యంత సమృద్ధియైన భద్రతను వారు అనుభూతి చెందునట్లుగా వారికి నేను అనుగ్రహించెదను' అని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. ఈ రోజున మీరు అన్ని దిశల నుండి మీరు అనారోగ్యత ఉన్నట్లుగా భావించవచ్చును, మీ ఆర్థిక విషయములలోను, మీ ఆత్మలోను, మీ మనస్సులోను, మీ కుటుంబములోను, ఒకవేళ మీ పేరు అనారోగ్యముగా ఉన్నట్లుగా ఉన్నదేమో, అవన్నియు కూడా అనారోగ్యముతో ఉన్నట్లుగా ఉండవచ్చును. కానీ, దేవుడు మిమ్మును స్వస్థపరచుట ద్వారా మిమ్మును పైకి లేవనెత్తుబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 30:17వ వచనములో చూచినట్లయితే, "వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారము దేవుడు ఇప్పుడే మీ గాయములను స్వస్థపరచును గాక. భయపడకండి. మీరు స్వస్థపరచబడెదరు. మీరు పైకి లేవండి, ఇప్పుడే యేసు నామములో మీరు స్వస్థపరచబడుచున్నారు. మంచిది, బైబిల్ నుండి యెషయా 61:1వ వచనములో చూచినట్లయితే, " ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును... ఆయన నన్ను పంపియున్నాడు'' మరియు లూకా 4:18వ వచనములో మనము చూచినట్లయితే, " ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది; దరిద్రులకు సువార్త ప్రకటించుటకై ఆయన నాకు అభిషేకము చేసెను. బంధకములలో ఉన్నవారికి విడుదలైనను, గ్రుడ్డివారికి చూపు కలిగినను ప్రకటించుటకును, నలిగినవారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు'' అని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అందుకు యేసుక్రీస్తు, " నేను బ్రద్ధలైన వారిని స్వస్థపరచుటకు నేను వచ్చియున్నాను'' అని తెలియజేసియున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును స్వస్థపరచు పనిని కలిగియున్నాడు. అందుకొరకు, దేవుని ఆత్మ ఆయన మీద ఉండెను. ఇంకను బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 10:38వ వచనములో చూచినట్లయితే, " అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను'' ప్రకారము దేవుడు ఆయనకు తోడై యున్నందున అపవాదిచేత పీడింపబడిన వారినందరిని ఆయన విడిపించుచున్నాడు. అవునండి, యేసు ఈ లోకములో ఉండియున్నప్పుడు ఆయన తనలో పరిశుద్ధాత్మను కలిగియుండెను. దేవుని యొక్క ఆత్మ స్వస్థపరచుచున్నది. దేవుని యొక్క ఆత్మ ఎల్లవేళల కూడా దేవునిని మనతో ఉంచుచున్నది. అదే దేవుని ఆత్మ నేడు మీ మీదికి కూడా దిగివస్తుంది. కనుకనే, మీరు భయపడకండి. అందుకే, 'దేవుని ఆత్మ యెక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్య్రము ఉంటుంది' అని చెప్పబడినట్లుగానే, నేడు మీ జీవితములో కూడా మీకు ఒక గొప్ప స్వాతంత్య్రము కలుగుతుంది. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ అవధులు లేకుండా మిమ్మును నింపాలని నేను ప్రార్థించుచున్నాను. మీరు నూతన వ్యక్తులుగా మరియు నూతన స్త్రీగాను, నూతన పురుషునిగాను మార్చబడతారు. మీకు శీఘ్రముగా స్వస్థత కలుగును గాక.

అందుకే బైబిల్ నుండి మత్తయి 10:8వ వచనమును చూచినట్లయితే, "రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి'' అని చెప్పబడిన ప్రకారముగా ' మీరు వెళ్లండి, మీరు వెళ్లి అనేకులను స్వస్థపరచండి, దేవుడు 'తన ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను' అని సెలవిచ్చుచున్నాడు. జీవితములో వృధాగా కూర్చుని, పాపము చేయుచూ, సణగుచూ, ఇతరుల మీద ఫిర్యాదులు చేయుచూ, మీ సమయమును మీరు వృధా చేయకండి. 'పైకి లేవండి, రోగులను స్వస్థపరచండి.' ఒకవేళ, మీరు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థులై, మీ యింట ఉన్నప్పటికిని, మీరు మీ యింట నుండి ప్రార్థన చేయడానికి ప్రార్థన యోధులుగా ప్రార్థన గోపురములో చేరండి. మీ యింటి నుండి ప్రార్థన గోపురములో వచ్చు కాల్స్‌ను స్వీకరించి, రోగులైన వారికి ఆ రీతిగా వారి కొరకు భారముతో ప్రార్థించి, ఈ పరిచర్యలో పాల్గొనవచ్చును. అవును, మీరు ప్రార్థించి, రోగులకు స్వస్థతను తీసుకొని రండి. మీరు ప్రార్థన చేయునప్పుడు, దేవుడు రోగులను స్వస్థపరుస్తాడు. ఏ భాషలలోనైనను సరే, మీరు ప్రార్థించవచ్చును. మీ ప్రార్థనలను అంగీకరించి, యేసు వారిని స్వస్థపరుస్తాడు. అవును, మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులవ్వండి. దేవుని ఆత్మ మీ మీద ఉంటుంది. కనుకనే, మీరు ప్రార్థన చేయునప్పుడు, బైబిల్ నుండి మార్కు సువార్త 16:17వ వచనములో చూచినట్లయితే, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు '' అని చెప్పబడినట్లుగానే, మీరు దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, మీరు నూతన భాషలను మాట్లాడుదురు. ఇతరులను మీరు స్వస్థపరచెదరు. మీరు కూడా స్వస్థపరచబడెదరు. నేడు దేవుడు మీకు ఇటువంటి కృపను అనుగ్రహించును గాక.

రెండవదిగా, ప్రభువు మీకు శాంతిని, కాపుదలను అనుభూతి చెందగల ఆనందమును మీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 147:13-14వ వచనములలో చూచినట్లయితే, "ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే'' అని చెప్పబడిన ప్రకారము ప్రభువు మీ గుమ్మముల గడియలను భద్రపరచి, బలపరచబోవుచున్నాడు. ఆయన మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించబోవుచున్నాడు, ఆయన మీ సరిహద్ధులలో సమాధానమును కలుగజేయువాడైయున్నాడు. ఏ విధమైన అవిశ్రాంతత, ఆత్రుత మరియు దురాత్మ, అపవాది మీ గృహమును చేరదు. ఆయన మీకు శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుగ్రహించును. ఈ ఆశీర్వాదమును యేసు నామమున మీ మీద ఉంచుచున్నాను. ఇట్టి ఆశీర్వాదములను ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడు? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 147:11వ వచనములో చూచినట్లయితే, "తనయందు భయభక్తులుగలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడై యున్నాడు'' ప్రకారము ప్రభువును మీ యందు ఆనందింపనివ్వండి. నా ప్రియులారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన కృప యందు కనిపెట్టుకొనియున్నప్పుడు ఆలాగున జరుగుతుంది.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము పైకి లేవనెత్తబడి, ఇతరులకు కొరకు ప్రార్థించి, వారికి స్వస్థతను తీసుకొని వచ్చునట్లుగా అటువంటి స్థాయికి మేము ఎదుగునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, నీవు మా స్వస్థత నిచ్చువాడవు మరియు మా సమాధానకర్తవుగా ఉన్నందుకై నీకు వందనములు. దేవా, ఇతరులు స్వస్థపరచు నిమిత్తము మేము ప్రార్థన చేయుచుండగా, వారు గానీ, మేము గానీ స్వస్థపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, మా సరిహద్ధులలో సమాధానమును కలిగియుండునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మా కుటుంబము ఆశీర్వదింపబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ చేతిక్రింద భద్రపరచబడునట్లుగా సహాయము దయచేయుము. యేసయ్య, మా గాయాలను మరియు మా వ్యాధులను స్వస్థపరచుము మరియు మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిచేత మమ్మును అత్యధికముగా నింపుము. దేవా, మా యొక్క ప్రతి ఒత్తిడిచేత నుండి మరియు మా బంధకముల నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, నీవు మా ఇంటికి శాంతి సమాధానమును, మా కుటుంబానికి భద్రతను కలిగించుము. దేవా, నీవు మా హృదయం నుండి అన్ని భయాలను మరియు ఆందోళనలను యేసు నామమున తొలగించుము. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికిని మరియు నీ యొక్క శాశ్వతమైన ప్రేమలో మా నిరీక్షణను ఉంచుటకు మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.