నా ప్రశస్తమైన స్నేహితులారా, ఒక నూతన ఆర్థిక సంవత్సరానికి ఆరంభమైన ఈ నూతన మాసమును మీరు ప్రారంభించుచుండగా, దేవుడు మిమ్మును ఈ నూతన ఆర్థిక సంవత్సరములోను మరియు నూతన మాసములోను ఆశీర్వదించు గాక. ఈనాడు, మీ ఇల్లు ఎలా నిలబడుతుంది? మీ జీవితం ఎలా స్థిరంగా కట్టబడుతుంది? అనే విషయాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు గల ఏకైక మార్గము మనకు నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 127:1వ వచనములో కనిపించుచున్నది. ఆ వచనము, "యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే...''అని చెప్పబడినట్లుగానే, అనేకులు తమ సొంత ఇంటిని, కుటుంబాన్ని మరియు జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తారు; కానీ యెహోవా ఆ ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కనుకనే, బైబిల్ నుండి హెబ్రీయులకు 3:4వ వచనములో చూచినట్లయితే, " ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తము ను కట్టినవాడు దేవుడే...'' అని చెప్పబడినట్లుగానే, ప్రతి ఇల్లు ఎవరో ఒకరిచేత కట్టబడుతుంది, అయితే, సమస్తాన్ని నిర్మించువాడు దేవుడేనని మనకు గుర్తుచేయుచున్నది. నా ప్రియులారా, ఈ నెలలో, దేవుడు మీ కొరకు సమస్తమును నిర్మిస్తాడు; అది ఒకవేళ, మీ కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఉద్యోగం, విజయం, అభిషేకం, సమృద్ధి, సమాధానము మరియు అద్భుతాల కొరకు కృప, ఏదైనను సరే విరిగిపోయిన, చెదరిపోయిన మరియు నాశనమైన సమస్తమును తిరిగి కట్టబడుతుంది. యేసు స్వయంగా మీ జీవితంలో కట్టబడతాడు! కాబట్టి, దేవునికి మీ హృదయాన్ని తెరువండి. ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు. గనుకనే, మీరు ఆయన సహకారులు; ఆయన మీ తండ్రి, మీ దేవుడు, కనుకనే, ఆయన మీ కొరకు సమస్తమును నిర్మిస్తాడు. నా ప్రియులారా, దేవుడు ఒక ఇంటిని నిర్మించినప్పుడు, ఆయన దానిని సుఖకరమైన ఇల్లుగా నిర్మిస్తాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 32:18వ వచనములో చూచినట్లయితే, " అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదర'' అని వ్రాయబడినట్లుగానే, మీ జీవితంలో విశ్రమ స్థలమునందును, సుఖకరమైన నివాసముల యందును మరియు నెమ్మదిగా ఉంటుంది. అందుకే యేసు ఇలాగున సెలవిచ్చియున్నాడు: " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని చెప్పబడిన ప్రకారము ఈ విశ్రాంతి అనగా ఏమిటి? అని చూచినట్లయితే, ప్రభువు మీకు సంబంధించిన వాటన్నిటిని సంపూర్ణము చేయుచూ, మీరు ఆయన ఆశీర్వాదములను అనుభవించునట్లుగా సమస్తమును తన ప్రణాళిక చొప్పున సమకూరుస్తాడు.

ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 147:14వ వచనములో చూచినట్లయితే, " నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మీ సరిహద్దులకు సమాధానమును అనుగ్రహించి, శ్రేష్ఠమైన ఆశీర్వాదముతో మిమ్మును తృప్తిపరుస్తాడు. ఇంకను బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 9:31వ వచనములో, " కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను'' ప్రకారము తొలి విశ్వాసులు సమాధానమును అనుభవించి, బలపరచబడి, దేవుని పట్ల భయభక్తులతో జీవించి, పరిశుద్ధాత్మచే ప్రోత్సహించబడి, విస్తరించెదరు. ఇది సమాధానము, సమృద్ధికి, సంరక్షణ మరియు వర్థిల్లతను అనుభవించడానికి మీరు నీతిగా జీవిస్తూ, ఆయన చిత్తాన్ని అనుసరించినట్లయితే, దేవుడు మీకు వీటన్నిటిని అనుగ్రహిస్తాడు. రెండవదిగా, దేవుడు మీ ఇంటిని రక్షణతో నిండిన గృహంగా నిర్మిస్తాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు, మీరు మరియు మీ కుటుంబం రక్షణ పొందుతారని బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 16:31వ వచనము నుండి వాగ్దానం చేయబడుతుంది. "అందుకు వారుప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు,'' అని చెప్పబడినట్లుగానే, మీరును మరియు కుటుంబం యేసును రక్షకునిగా అంగీకరించి, పాపం నుండి విడుదల పొంది, నీతిగా జీవిస్తూ, పరలోకంతో అనుసంధానించబడిన గృహంగా మారుతుంది. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 7:14వ వచనములో చూచినట్లయితే, "అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును'' అని చెప్పబడిన ప్రకారము పరిశుద్ధాత్మ పరివర్తనను తీసుకురావడం ద్వారా, అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామి విశ్వాసి ద్వారా పవిత్రపరచబడతారని నిశ్చయతను కలిగించుచున్నది. భార్యాభర్తలు విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, లేఖనము నుండి మలాకీ 2:14వ వచనములో వాగ్దానం చేసినట్లుగా, వారి పిల్లలు దైవభక్తి గలవారిగా మార్చబడతారు. దేవుడు యిర్మీయా 3:22వ వచనములో చూచినట్లయితే, "భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మా దేవుడవైన యెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము'' అని చెప్పబడినట్లుగానే, విశ్వాసములో వెనుకబడిన వారిని బాగుచేసి, ఆయన తన వద్దకు తిరిగి రప్పించునని' చెప్పబడినట్లుగానే, దారి తప్పిన వారు కూడా తిరిగి పునరుద్ధరించబడతారు.

మూడవదిగా, నా ప్రియులారా, మీ ఇల్లు సేవ చేయు కుటుంబంగా మారుతుంది. అందుకే బైబిల్ నుండి యెషయా 8:18వ వచనములో ఇలాగున ప్రకటించబడియున్నది, " ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము'' ప్రకారము దేవుని ప్రేమ మీ కుటుంబం ద్వారా ప్రవహించును మరియు మీ ద్వారా ప్రజలు యేసును గుర్తించెదరు. ఆలాగుననే, మార్త, మరియ మరియు లాజరుల కుటుంబం వలె, మీ ఇల్లు కూడా ఇతరులను ప్రేమతో ఆహ్వానించగలదు. మార్తా పరిచర్య చేసింది మరియ యేసు పాదాల ఉత్తమమైనదానిని ఎంచుకొనెను. ఇంకను లాజరు మరణము నుండి తిరిగి లేపబడటం ద్వారా ఒక అద్భుతాన్ని పొందుకొనును. ఇందు కారణంగా, దేవుని శక్తిని ప్రత్యక్షంగా చూడటానికి నలుమూలల నుండి ప్రజలు వచ్చారు. అదేవిధంగా, నా ప్రియులారా, యేసు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను గురించి మీరు సాక్ష్యం చెప్పినప్పుడు, ప్రజలు ఆయన వైపు ఆకర్షించబడతారు, తద్వారా, దేవుడు మీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు. నాలుగవదిగా, మీ ఇల్లు బలంగా స్థిరపరచబడుతుంది. వరదలు రావచ్చును, వర్షాలు కురవవచ్చును, బలమైన గాలులు వీచవచ్చును; అయినా సరే, బండ మీద కట్టబడిన ఇల్లు వలె మీ ఇల్లు కూడా స్థిరంగా నిలిచి ఉంటుంది. కనుకనే, మీరు దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయులైనప్పుడు, మీ జీవితం స్థిరంగా నిలిచి ఉంటుంది. యేసే ఆ బండ అని (1 కొరింథీయులకు 10:4) లో చెప్పబడియున్నది. మరియు మీరు అపొస్తలుల, ప్రవక్తల పునాదిపై కట్టబడియున్నారని (ఎఫెసీయులకు 2:20)వ వచనములో తెలియజేయబడినది. క్రీస్తు మీద కట్టబడిన మీ యిల్లు, మీ కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. ఇంకను ఎఫెసీయులకు 5:22-33వ వచనముల ప్రకారం, భార్య భర్తను గౌరవిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు; వారిద్దరూ ఏకశరీరమై, ఐక్యతతో జీవించెదరు.

చివరగా, నా ప్రియులారా, మీ ఇల్లు ఒక ఆశీర్వాదకరమైన ఇల్లుగా మారుతుంది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 115:12వ వచనములో చూచినట్లయితే, " యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థుల నాశీర్వదించును'' అని చెప్పబడిన ప్రకారముగా ఆయన మిమ్మును మరచిపోకుండా, ఆశీర్వదించును. కనుకనే, బైబిల్ నుండి మత్తయి 6:33వ వచనము మీకు ఇలాగున గుర్తుచేసినట్లుగానే, మీరు మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి; అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇంకను మీరు ఇచ్చినప్పుడు, మీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అందుకే బైబిల్ నుండి లూకా 6:38వ వచనములో చూచినట్లయితే, "ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు'' అని చెప్పినట్లుగానే, మీరు దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు మీకు తిరిగి ఇస్తాడు. మలాకీ 3:10లో చెప్పబడినట్లుగానే, దేవుని పరిచర్యకు మీరు ఇవ్వండి. కనుకనే, మీరు దేవుని సేవకులకు ఇవ్వండి (కీర్తనలు 16:2-3) మరియు మీ బంధువుల పట్ల బాధ్యత వహించండి (1 తిమోతి 5:8), మరియు పేదవారిని ఆదరించండి (యెషయా 58:7-8). మీరు ఇలా చేయడం ద్వారా, దేవుడు మీ ఇంటిని బలపరిచి ఆశీర్వదిస్తాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన సమాధానముతోను, బలంతోను, రక్షణతోను, తనకు మరియు తన ప్రజలకు చేయు సేవతో, మరియు సమృద్ధియైన ఆశీర్వాదాలతో మీ ఇంటిని ఈ నూతన మాసమంతయు ఆశీర్వదించును గాక. ఆయన మీ కుటుంబాన్ని నిర్మించి, మీ జీవితాన్ని నిత్యము స్థిరపరచును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా ఇంటిని, మా జీవితాన్ని నీ ప్రేమగల చేతులకు అప్పగించుచున్నాము. యేసయ్యా, మేము కలిగియున్న సమస్తమునకు నీవే నిర్మాణకర్తగా, పునాదిగా ఉండి, నీ మీద మా యిల్లు కట్టబడునట్లుగాను, క్రీస్తు అను బండ మీద మా యిల్లు మరియు మా జీవితాలు స్థిరపడునట్లుగా కృపను దయచేయుము. దేవా, మా యొక్క బ్రద్ధలు చేయబడిన ప్రతి సంబంధాన్ని మరల పునరుద్ధరించి, మా కుటుంబంలో సమాధానమును నెలకొల్పి, సుఖకరమైన నివాసములలో మేము నివసించునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, నీ రక్షణ ప్రతి హృదయాన్ని నింపి, మమ్మును నీకు అతి సమీపముగా చేయుము. యేసయ్యా, కుటుంబముగా మేమందరం కలిసి నిన్ను సేవించునట్లుగాను, ఐక్యతతో, ప్రేమతో నడుచునట్లుగానట్లుగా మాకు నేర్పించుము. దేవా, మేము నీకు ఇచ్చువారముగాను, నీ రాజ్యాన్ని, నీతిని వెదకునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి తుఫానులోనూ ఒక కుటుంబంగా నీలో స్థిరంగా నిలబడేలా మమ్మును బలపరచుము. దేవా, మేము నీ పరిపూర్ణ ప్రణాళికపై విశ్వాసం ఉంచునట్లుగాను దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా ఇంటిని ఇతరులకు ఆశీర్వాదంగాను, నీ సన్నిధికి నివాస స్థలంగా మార్చుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.