నా ప్రియమైన స్నేహితులారా, మనకందరికి ఒక సుపరిచితమైన ఈ రోజు బైబిల్ నుండి సామెతలు 21:31వ వచనమును మన కొరకు వాగ్దానముగా ఇవ్వబడియున్నది. ఆ వచనము, "యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము'' అని చెప్పబడిన ప్రకారము ఈ వచనములో రెండు భాగములు ఉన్నవి. మొట్టమొదటిగా, 'గుఱ్ఱములు యుద్ధ దినమునకై సిద్ధపరచబడతాయి.' రెండవదిగా, 'రక్షణ యెహోవా ఆధీనము' అనగా, జయము దేవుని వశములో ఉన్నది అని చెప్పబడియున్నది. అనేకసార్లు, మనము మొదటి విషయమును మరచిపోతాము. మనము ఎల్లప్పుడు అంటుంటాము, అవును! విజయము దేవుడే ఇస్తాడు కదా! మరియు అవును, ప్రభువే నాకు విజయమును ఇస్తాడు అని అంటుంటాము. నిజంగానే, ప్రభువు తప్పకుండా అది జరిగిస్తాడు. అయితే, మన వైపు నుండి మనము యుద్ధమునకై గుఱ్ఱమును సిద్ధపరచాలి. కనుకనే, 'నేడు మీరు శ్రేష్టమైన పనిని కష్టముతో చేయండి. ఆ తర్వాత, మిగిలినది, మీరు ప్రభువు హస్తములకు సమర్పించండి' అని ఒక సామెత కలదు. కనుకనే, మీరు పరీక్షల కొరకు, ఏదైన ప్రదర్శన (ప్రెసెంటేషన్) సిద్ధపడుచున్నట్లయితే, లేక ఏదైన ముఖ్యమైన ఇంటర్య్వూ కొరకు సిద్ధపడుచున్నట్లయితే, మీరు శ్రేష్టమైన వాటి కొరకు సిద్ధపడండి. ప్రభువు మిగిలినవన్నియు చూచుకుంటాడు.

నా ప్రియులారా, మీరు కష్టపడి శ్రేష్టమైన వాటిని చేసినప్పుడు మిగిలిన సమస్తమును ప్రభువు హస్తములకు సమర్పించినప్పుడు ఆయన మీ పట్ల బాధ్యత వహిస్తాడు. అందుకే బైబిల్ నుండి జెకర్యా 4:6వ వచనమును చూచినట్లయితే, "అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను'' ప్రకారము అవును, ప్రభువు ఆశీర్వాదము లేనిదే, శ్రేష్టమైన వాటిని చేసినను కూడా మనము విజయమును పొందుకొనలేము. అందుకనే, ప్రభువును వెదకి ఆయన ఆశీర్వాదమును కోరుకొనడము ఎంతో ప్రాముఖ్యము. కొన్నిసార్లు, మన బలముపై మరియు మన జ్ఞానముపై మనము ఆధారపడతాము. అంతమాత్రమే కాదు, మనము స్వంతగా విజయమును పొందుకోవచ్చును అని అనుకుంటాము. అయితే, అది సాధ్యము కాదండి. ప్రభువు మనకు తోడుగా ఉండనట్లయితే, మనము విజయమును పొందుకొనలేము. కాబట్టి, ఈ రోజు మీ ప్రణాళికను ప్రభువునకు సమర్పించండి. ఎలా చదువుకోవాలో ప్రభువు మీకు చెబుతాడు. ఏ ప్రశ్నలు నేర్చుకోవాలో ప్రభువు మీకు చెబుతాడు. మీ ఇంటర్య్వూలో ఎలా మీరు జవాబులు ఇవ్వాలో ప్రభువు మీకు నేర్పిస్తాడు. కనుకనే, మీరు భయపడకండి.

నేను పాఠశాలను ముగించుకొని, కళాశాలకు వెళ్లుటకు ముందు ఇంటర్య్వూకు హాజరైనప్పుడు, ఆ సమయములో వైవా సెషన్ జరిగినది. నా ముందు గొప్ప వైద్యులు, ప్రొఫెసర్స్ కూర్చుని ఉన్నారు. ఆ వైవా సెషన్‌లో అనేకమంది పాల్గొనుచున్నారు. ఆ వైవా సెషన్‌లో దాదాపు 300 మంది విద్యార్ధులు ఉన్నారు. ఆ వైవా సెషన్‌లో చాలా ప్రశ్నలు అడుగబడుచున్నవి. అయితే, అందులో ఒక్క ప్రశ్నకు నేను మాత్రమే జవాబు ఇవ్వగలిగాను. అక్కడ ఉన్నవారందరు దానిని చూచి ఆశ్చర్యపోయారు. శిల్పా మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చింది, ఇంకెవ్వరు జవాబు ఇవ్వలేకపోయారు అని చెప్పారు. అవును, నా ప్రియులారా, ప్రభువు నాకు తోడుగా ఉండి, నాకు ఈ కార్యమును జరిగించాడు కాబట్టి, ఇది నాకు సాధ్యపడినది. అది చాలా సులభమైన ప్రశ్న కానీ, అందరు ఆ వైవా ముందున్న వారిని చూచి భయపడి, చెప్పలేకపోతుంటారు. కానీ, ఈ రోజు ప్రభువు మీకు విజయమును ఇవ్వడానికి సహాయపడతాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములో మీరు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధములోను దేవుడు మీకు విజయమును అనుగ్రహించును గాక. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మాకందరికి నీ విజయమును అనుగ్రహించుము. యేసయ్యా, మా జీవితములో నీ విజయమును పొందుకొనునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, ఈ రోజు మా ప్రణాళికలన్నింటినీ నీకు అప్పగించుచున్నాము. దయచేసి మా ప్రణాళిక కొరకు నమ్మకంగా మరియు శ్రద్ధగా సిద్ధపడడానికి మరియు కష్టపడి పనిచేయడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా హృదయం నుండి ప్రతి భయాన్ని మరియు గందరగోళాన్ని తొలగించుము. ప్రభువా, మేము మా బలాన్ని కాదు, నీ సన్నిధిని నమ్ముచున్నాము. దేవా, మా ప్రయత్నాలను ఆశీర్వదించి మమ్మును విజయానికి నడిపించుము. ప్రభువా, ఫలితాలను నీ చేతుల్లో వదిలివేయుచున్నాము. దేవా, మా చదువులలోను, ఇంటర్య్వూలోను మరియు మేము హాజరు కాబోవుచున్న వైవాలోను, మా యొక్క ప్రాక్టికల్ పరీక్షలలోను, పోటీ పరీక్షలలో మాకు విజయమును దయచేయుము. ప్రభువా, మేము చక్కగా చదువుకొనుటకును, మరియు మేము చదువుకున్నవన్నియు మాకు గుర్తుండునట్లుగా, చివరిగా నీ నామమునకు మేము మహిమను తీసుకొని వచ్చునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీ యొక్క జ్ఞానముతోను మరియు నీ ఆత్మతో మమ్మును మరియు మా యొక్క ప్రియులను నింపుము. ప్రభువా, మా అందరి మీద నీ యొక్క ఆశీర్వాదములు వచ్చునట్లుగా చేయుము. దేవా, మా కొరకు నీవు కలిగియున్న ప్రణాళికలన్నియు నెరవేరబడునట్లుగా చేయుము. ప్రభువా, మాకు ఎటువంటి ఆటంకములు ఉండకుండా, అన్ని సులభంగా మా యొద్దకు వచ్చునట్లుగా సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి యుద్ధములో మాకు విజయమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.