నా ప్రియమైన వారలారా, నేడు స్వాత్రంత్య దినోత్సవమును జరుపుకుంటున్న మీకందరికి స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేడు మీరు దేవునికి యాజకులుగా ఉండాలని ఆయన మిమ్మును పిలిచి, అభిషేకించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ప్రియులారా, ఒకవేళ, మీరు ఇంజనీర్‌గాను, శాస్త్రవేత్తగాను, అధికారులుగాను, విద్యార్థులుగాను, వ్యాపారవేత్తలుగాను, ఉద్యోగస్థులుగాను, లేదా గృహిణిలుగాను ఉన్నను సరే, మీరు ఎక్కడ ఉన్నను సరే, లేక ఏ పనిని చేయుచున్నను సరే, ప్రభువు ఇలాగున అంటున్నాడు, "మీరు నాకు యాజకులు.'' అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 19:6వ వచనములో చూచినట్లయితే, "సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుక వలసిన మాటలు ఇవే'' అని చెప్పబడినట్లుగానే, మనము యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ప్రకటింపబడుచున్నాము. కనుకనే, నా ప్రియులారా, మీ కుటుంబములోని ప్రతి ఒక్కరూ ప్రభువునకు యాజకులుగా ఉండటానికి పిలువబడియున్నారు. కాబట్టి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి ధైర్యంగా పైకి లేవండి. ఎందుకంటే, దేవుడు మీ ప్రార్థనలను విని, దేశమునకు రక్షణను తీసుకువస్తాడు.
నా ప్రియులారా, అందుకే బైబిల్ నుండి 1 పేతురు 2:9వ వచనములో చూచినట్లయితే, " అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు '' అన్న వచనము ప్రకారము మనము రాజులైన యాజక సమూహమును, ఏర్పరచుకొనబడిన వంశముగాను ఉన్నాము. దేవుని స్తుతులను మరియు ఆయన మహత్తరమైన కార్యములను ప్రకటించుటకు మనము పిలువబడియున్నాము. యేసు ప్రభువు తన స్వంత రక్తముతో మనలను కొనుగోలు చేసి, మన దేశమును మరియు మన కుటుంబములను కాపాడే బాధ్యతను మనకు అప్పగించియున్నాడు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 20:28వ వచనములో చూచినట్లయితే, "దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి'' అని చెప్పబడినట్లుగానే, ఒక యాజకునికి ప్రధాన బాధ్యత, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటయే. అందుకే బైబిల్ నుండి యోహాను14:13వ వచనములో చూచినట్లయితే, " మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును'' అని చెప్పబడియున్నట్లుగానే, ఆయన నామమున మనము ఏది అడిగినను చేయుదునని యేసు సెలవిచ్చియున్నాడు. కాబట్టి, ఈ రోజు మీ కుటుంబము మరియు మీ దేశము కొరకు ప్రార్థించడానికి మిమ్మును మీరు సమర్పించుకోండి. దేవుడు మీ ప్రార్థనలను ఆలకించి, మీ విన్నపములన్నిటిని ఆశీర్వదిస్తాడని విశ్వసించండి.
రెండవదిగా, ప్రభువు మిమ్మును ఒక పరిశుద్ధ జనముగా మార్చి మరియు మిమ్మును విస్తరింపజేయుచున్నాడు. అందుకే బైబిల్ యెషయా 60:22వ వచనములో చూచినట్లయితే, "వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును'' అన్న వచనము ప్రకారము మీలో అత్యల్పులుగా ఉన్న మిమ్మును వేయిమందిగాను, ఎన్నికలేనివాడు బలమైన జనముగా మారుస్తానని ఆయన వాగ్దానము చేయుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి యెషయా 60:3-4వ వచనములలో చూచినట్లయితే, " జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించునట్లుగాను, ఆ వెలుగును చూచి జనములు, మీ ఉదయకాలపు తేజస్సును చూచి, రాజులు మీ వద్దకు వచ్చెదరు. మీరు ఇతరుల కొరకు ప్రార్థించుచున్నప్పుడు, దేవుని వెలుగు మీ ద్వారా ప్రకాశిస్తుంది. ప్రజలు మిమ్మును వెతుక్కుంటూ మీ యొద్దకు వచ్చెదరు. నా ప్రియులారా, మీ ఉద్యోగం, పదోన్నతి మరియు గృహము మీకు వస్తుంది. అంతేకాక రాజులు కూడా మీ వద్దకు వచ్చెదరు. మీ ద్వారా మీరు వారికి దేవుని శక్తిని తెలియజేయుదురు. మరియు మీ ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు మిమ్మును వెయ్యి రెట్లు హెచ్చిస్తాడు. కనుకనే, ఈ ఆశీర్వాదం మీ పిల్లలు మరియు మీ మనవ సంతానము ద్వారా కూడా కొనసాగుతుంది. మీ కుటుంబములో ఉన్న చిన్నపిల్లలు కూడా ప్రార్థించువారుగా మార్చబడతారు. దేవుడు మీ కుటుంబమంతటిని, ఆయన మంచితనాన్ని ప్రకటించే రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకను మీ కుటుంబమును ఉన్నతంగా వెయ్యిరెట్లు హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీకు యాజకులుగా ఉండడానికి మమ్మును పిలిచి, అభిషేకించినందుకై నీకు వందనములు. దేవా, మా కుటుంబం మరియు దేశం కొరకు విశ్వాసంగా ప్రార్థించడానికి మరియు నీ చిత్తాన్ని ధైర్యంగా నెరవేర్చడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీ యొక్క వెలుగు మా ద్వారా ప్రకాశించి, అనేకులకు ఆశీర్వాదాలు, రక్షణను తీసుకొని వచ్చునట్లుగాను మరియు అద్భుతములు జరిగించునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మమ్మును పరిశుద్ధమైన మరియు ఆశీర్వదించబడిన సంతతిగా మార్చుము. ప్రభువా, మమ్మును మరియు మా కుటుంబమును వెయ్యి రెట్లు వృద్ధి చేయుము. దేవా, మా పిల్లలు మరియు మనమ సంతతి కూడా ప్రార్థించువారినిగా మార్చి, నీ మంచితనము ప్రకటించునట్లుగా చేయుము. ప్రభువా, మేము అల్పులైనవారి యెదుట కాదు, మేము రాజుల యెదుటనే నిలుచునట్లుగాను, ఇతరులను ఆశీర్వదించునట్లుగాను నీ యొక్క బలమైన హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క ఆత్మీయ వరములను మరియు అభిషేకము మా జీవితములో మరియు కుటుంబములోను శక్తివంతముగా పనిచేయునట్లుగా కృపను చూపుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


