నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకందరికి శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 2:15వ వచనమును మనము నేడు ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, " రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము'' ప్రకారము నేడు మనము క్రీస్తు సువాసనగలిగి జీవించాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, రక్షింపబడిన జీవితాన్ని మనము ఎలా కలిగియుండగలుగుతాము? అని మనము చూచినట్లయితే, యేసుక్రీస్తు తనకు తాను ఆ సిలువలో సమర్పించుకొనియున్నా డు. మన కొరకు యేసుక్రీస్తు తన జీవితమును త్యాగము చేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో మనము చూచినట్లయితే, పౌలు భక్తుని గూర్చి చదవగలము. ఆ వచనములో, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు భక్తుడు చెప్పియున్నాడు. అతడు ఆరంభములో సౌలుగా ఉండేవాడు. అన్ని చెడు కార్యములను జరిగించేవాడు. యేసుక్రీస్తుకు విరోధముగా చెడు కార్యములన్నియు చేయుచుండువాడు. ఒకరోజు యేసుక్రీస్తు అతనిని దర్శించియున్నాడు. ఆయన, సౌలును, చూచి, "సౌలా,సౌలా, నీవు ఎంతకాలము నన్ను హింసించెదవు? నన్ను బాధపెట్టెదవు ?'' అని ప్రశ్నించెను. ఆ రోజుననే అతడు తన హృదయాన్ని యేసుక్రీస్తునకు సమర్పించుకున్నాడు. సౌలు, పౌలుగా మార్చబడ్డాడు.

అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో ఈలాగున అంటున్నాడు, "నా హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నాను మరియు యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా నన్ను కడిగియున్నాడు నేను నూతన వ్యక్తిగా మార్చియున్నాను మరియు నేను యేసుక్రీస్తులో నూతనమైన వ్యక్తిగా మార్చబడియున్నాను'' అని తెలియజేయుచున్నాడు. మరి మీ గురించి ఏమిటి? నా ప్రియమైన బిడ్డలారా. మరియు తల్లిదండ్రులారా, మీ జీవితము ప్రభువుకు సమర్పించుకున్నారా? ఆలాగైతే, మీ జీవితము మీ పిల్లలకు మాదిరికరముగా ఉండాలి. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క సమృద్ధి దీవెనలతో మీరు నింపబడియుండాలి. మరి మీరు అటువంటి జీవితమును కలిగి ఉంటున్నారా? రండి! మీ జీవితమును ఇప్పుడే, యేసయ్యకు సమర్పించుకొనండి. తన ప్రశస్తమైన రక్తముతో మిమ్మును పరిశుద్ధపరచమని అడగండి. మీరు కూడా నూతనమైన వ్యక్తిగా మార్చబడియుంటారు. క్రీస్తు యొక్క సువాసన మీ జీవితముపైన ఉండబోవుచున్నది. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

అందుకే బైబిల్ నుండి 1 పేతురు 2:12వ వచనములో చూచినట్లయితే, " అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారము మీరు చేయవలసిన సత్‌కార్యములు ఏమైయున్నవి? మీరు దేవుని యొక్క ఆదర్శమును పాటించాలి. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 1:10వ వచనములో చూచినట్లయితే, "ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను'' అని చెప్పబడిన ప్రకారము దేవుని యెదుట ఆయనను ఇష్టపరచు జీవితమును మీరు జీవించాలి. ఇంకను యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు కడగబడినప్పుడు, మీరు నూతన సృష్టిగా మార్చబడతారు. ప్రభువు మిమ్మును నడిపిస్తూ, అన్నివేళల ఆయన మీకంటె ముందుగా నడుస్తాడు. అప్పుడు మీ జీవితములో నుండి సువాసన వెదజల్లబడుతుంది. మీరు ప్రభువు యెదుట ప్రకాశించగలుగుతారు. అందుకే బైబిల్ నుండి యోహాను 5:35వ వచనములో చూచినట్లయితే, "అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్టపడితిరి'' ప్రకారము అతడు మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడని మనము చదువుగలుగుతాము. ఆలాగుననే,బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:16వ వచనములో చూచినట్లయితే, "అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు'' అని చెప్పబడిన ప్రకారము మీరు కూడా దేవుని మహిమార్థమైన జ్యోతుల వలె ప్రకాశించగలరు. ఇంకను బైబిల్ నుండి 1 తిమోతికి 2:10వ వచనములో చూచినట్లయితే, మనము స్త్రీలను గురించి చదువుతాము, " దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను '' ప్రకారము స్త్రీలు కూడా దేవుని మహిమార్థమై ప్రకాశించాలి. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడే, మన జీవితాలలో క్రీస్తు యొక్క సువాసనతో మనము నింపబడదాము. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మహిమోన్నతమైన జీవితముతో మనలను ఇప్పుడే నింపమని ప్రభువును అడుగుదాము. నా ప్రియులారా, ఎంతమంది అటువంటి మహిమోన్నతమైన జీవితమును పొందాలని ఆశించుచున్నారు? ఆలాగైతే, ఇప్పుడే పౌలు వలె మీ జీవితమును యేసు ప్రభువునకు సమర్పించుకొన్నట్లయితే, ఆయన రక్తముతో మిమ్మును కడిగి పవిత్రులనుగా చేసి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, అడుగుడి మీకియ్యబడును అని చెప్పబడినట్లుగానే, నిన్ను అడుగు మా జీవితములో నీ యొక్క ప్రశస్తమైన దీవెనలతోను మరియు ఆశీర్వాదములతో నింపుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, మా హృదయాన్ని పూర్తిగా నీకు అర్పించుకుంటున్నాము, నీ విలువైన రక్తంతో మమ్మును కడిగి, మమ్మును నీలో నూతనమైన వ్యక్తిగా మార్చుము. దేవా, మా జీవితం నీ యొక్క మధురమైన సువాసనను మోసుకొనునట్లుగా చేయుము. ప్రభువా, నీ దృష్టికి యెదుట మేము నీకు ఇష్టము వచ్చినట్లుగా నడవడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును నీకు ఇష్టమైన మార్గములో నడిపించుము మరియు నీవు మాకు ముందుగా వెళ్ళుము. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థించుచున్న మమ్మును సౌలును దర్శించినట్లుగానే, నీవు దర్శించుము మరియు నీ మహిమార్థమై మేము ప్రకాశించాలని కోరుచున్నాము. దేవా, మా జీవితాలను తాకుము, నీ యొక్క శక్తి ద్వారా మా జీవితములను నీవలె రూపాంతరపరచునట్లుగా చేయుము. ప్రభువా, మా ముఖములు మరియు మా గృహములు నీ యెదుట ప్రకాశించు వెలుగు వలె ఉండునట్లుగా చేయుము. దేవా, మా అంధకారమంతయు మరుగైపోవునట్లుగాను, నీ మహిమార్థముగా మేము ప్రకాశించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.