నాకు అమూల్యమైన స్నేహితులారా, యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. నేటి వాగ్దానవచనముగా బైబిల్ నుండి యోహాను 14:18వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో యేసు, "మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మిమ్మును ఎన్నటికిని విడిచిపెట్టడు. కానీ, ఈ లోకము మనలను అనాథలనుగా విడిచిపెడుతుంది. అయితే, మనము పాపమును జరిగించినప్పుడు, మనము దేవుని నుండియు మరియు ప్రజల నుండి దూరపరచబడతాము. ఆలాగుననే, నేను 17 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు, నేను యేసునకు దూరముగా ఉండిపోయాను. లోకమును ఆనందించి, అనుభూతి చెందడానికి సహాయపడుటకు స్నేహితులందరు నా చుట్టు ఉండెను. అయినప్పటికిని, పాపము నాలో నుండి పైకి లేచియుండగా, నాకు ఎంతగానో ఒంటరితనము అనిపించినది. నా విద్యలో నేను వైఫల్యము చెందాను. నా జీవితము ఇంతటితో అంతమవుతుంది అనుకున్నాను. అటువంటి సమయములో మా తల్లిదండ్రులు ఒక సభకు రమ్మని నన్ను బలవంతము చేశారు. ఆ సభలో మా తండ్రిగారు మాట్లాడుచున్నారు, నాకైతే, ఆసక్తి ఏమియులేదు. కానీ, ఆ సభలో, ఆయనగారు చెప్పిన ఒక మాట అది నా హృదయమును బలముగా తాకినది, ' ఈ లోకములో నీవు ఒక గొప్ప వ్యక్తివి కావాలని ఎంతగానో ప్రయత్నించుచున్నావు. ఆలాగున జరిగించుటకు ఈ లోకపరమైన విధానములను ఎన్నో జరిగించుచున్నావు. కానీ, ఇప్పుడు నీవు ఏమి చేతకానివాడవుగా అయ్యావు. కనుకనే, ఈ రోజు నీవు యేసు చెంతకు రమ్ము, నిన్ను అనాధగా విడువను,' అని ఆయన చెబుతున్నాడు. ఇంకను, ఆయన, ' నేను మీ యొద్దకు వచ్చెదను, నేను నీకు స్నేహితునిగాను, తండ్రిగాను, సహోదరునిగా ఉంటాను. నేను మీ నిమిత్తము సమస్తమును చేయుదును. యేసు చెంతకు ఉన్న పక్షముననే రమ్ము, దేవుడు ఈ రోజు నిన్ను ఒక గొప్ప వ్యక్తి మార్చుచున్నాడు' అని చెప్పారు.

నేను ఆ మాటలను ఆలకించాను. వెంటనే, ఒక లోతైన ఒప్పుకోలు నా ఆత్మలోనికి వచ్చినది. నేను ఒక పసిబిడ్డవలె ఎంతగానో ఏడ్చాను. వెంటనే, నా పాపములను ఒప్పుకొని అక్కడే విడిచిపెట్టాను, క్షమాపణ కొరకు మరియు నాకు సహాయము చేయవలెనని నేను వేడుకున్నాను.' ఆయన నన్ను తన ఆత్మతో నింపియున్నాడు, అప్పటి నుండి మొదలుకొని, యేసు యొక్క ఆత్మ నాకు స్నేహితునిగా ఉంటుంది. ఎల్లప్పుడు ఆయన నాతో మాట్లాడుచుండెను. నాకు మార్గనిర్దేశము చేయుచు, నన్ను కాపాడుచూ, నన్ను నడిపించుచుండెను. ఆయన నేను చేసిన వాటన్నిటిని ఆశీర్వదించియున్నాడు. గొప్ప ప్రతిఫలమును అనుగ్రహించియున్నాడు. లక్షలాది మందికి ఆశీర్వదకరముగా ఉండునట్లుగా శక్తిసామర్థ్యమును నాకు అనుగ్రహించియున్నాడు. అవును, నా ప్రియులారా, అదే యేసు మీలోనికి రావడానికి సంసిద్ధముగా ఉన్నాడు. మిమ్మును అనాథగా విడిచిపెట్టడానికి కాదు, కానీ, ఆయన మిమ్మును తన బిడ్డగా చేయుటకు మాత్రమే. దేవుని యొక్క బిడ్డగా చేయుట కొరకే. అందుకు, ఆయన మిమ్మును చూచి, 'నేను మీ యొద్దకు వచ్చియున్నప్పుడు, మీ దుఃఖమంతటిని తొలగిస్తాను' అని అంటున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 16:20వ వచనములో చూచినట్లయితే, "మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' ప్రకారము ఆయన మీ దుఃఖమంతటిని సంతోషముగా మారుస్తాడు. మన జీవితములో ఒంటరితనమును కలిగించునవి ఏమిటి? అని మనము చూచినట్లయితే, అది ప్రజలను గురించిన భయము. అవును, ప్రజలను గురించిన భయము మన హృదయాలలోనికి వస్తుంటుంది. ఎవరైనా మనలను నాశనము చేస్తారేమో? అధిగమిస్తారేమో? కీడు చేస్తారేమో? అని భయపడుతుంటాము. కొన్ని ఫర్యాయములు అందరు నన్ను విమర్శించడానికే ఉన్నారు అని భావిస్తుంటాము. కనుకనే, మనము మాట్లాడకుండా, ఎటువంటి కార్యాలు చేయకుండా, కనీసము ప్రజలతో మాట్లాడకుండా, మనలను మనము రోధించుకుంటాము. ప్రజలను గురించిన భయము మనలను ఆలాగున చేస్తుంది. ఇంకను మరికొన్నిసార్లు మనము తప్పు చేసియున్నప్పుడు, ఇతర ప్రజల మీద భోగేచ్ఛలను మనము కలిగియున్నప్పుడు భయము మన హృదయములలోనికి వస్తుంది. ఎందుకంటే, అపరాధ భావమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువు సిలువ శిక్ష ద్వారా మరణించి, సమాధి చేయబడి వారు పట్టబడ్డారు. అందుకే బైబిల్ నుండి యోహాను 20:19వ వచనములో చూచినట్లయితే, " ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను.'' అయినప్పటికిని, యేసు మృతుల నుండి పునరుత్థానుడై తిరిగి లేచాడు. కనుకనే, ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. మూయబడిన తలుపుల మధ్య నుండి ప్రజలను గురించిన భయమును బ్రద్ధలు చేయడానికి, ఆయన వారి మధ్యలోనికి వచ్చి, ఆయన ఈలాగున చెప్పాడు, 'నా సమాధానమును, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతితో మీరు పైకి లేవండి. ఇప్పుడు నా యొక్క ఆత్మను అనగా, పరిశుద్ధాత్మను మీతో ఉంచుకునే కృపను మీకు అనుగ్రహించుచున్నాను. మీరు ఎవరినైతే, క్షమించెదరో, నేను వారిని క్షమించెదను, ఎవరిని మీరు ఆవీర్వదిస్తారో, నేను వారిని ఆశీర్వదిస్తాను, మీరు ఆనాథలు కారు, మీరు ఆశీర్వాదముగా ఉంటారు' అని సెలవిచ్చాడు.

కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు నుండి దేవుడు మీ భయము నుండి మిమ్మును మరలింపజేయవలెనని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, ఏవేవి మీలో ప్రజలకు సంబంధించిన భయములను మీకు కల్పించుచున్నవో వాటిని ప్రభువు మీలో నుండి ఇప్పుడే తొలగించుచున్నాడు. ఆయన మీకు తన యొద్ద నుండి ప్రేమనంతటిని మీరు కలిగియుండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. తద్వారా, ఆ ప్రేమను మీరు ప్రజల మీద కుమ్మరించవచ్చును. ప్రజలందరి యొక్క ప్రేమను మీరు కలిగియుండవచ్చును. నా ప్రియులారా, ఈ రోజు మీ జీవితములను ప్రభువు హస్తములకు అప్పగిస్తారా? ఆలాగుననే, మరియు మరిమొక స్త్రీ ఉండెను, ఆమె మగ్దలెనే మరియ, యేసు మృతి చెందిన తర్వాత, ఆయన యొక్క మృత దేహమును వెదకుచున్నారు. కానీ, ఆమె కేవలము యేసు యొక్క మృత దేహమును మాత్రమే అడుగుచుండెను. తద్వారా, ఆయన దేహము మీద సుగంధ ద్రవ్యములను పూసి, భూస్థాపితము చేయవలెనని కోరెను. కానీ, యేసు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఆయన యొక్క దేహమును తీసుకొని వెళ్లవలెనని ఏడ్చుచుండెను. అప్పుడు, బైబిల్ నుండి యోహాను 20:15వ వచనములో చూచినట్లయితే, "యేసు అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొనిపోదునని చెప్పెను.'' యేసు ఆమెను చూచి, 'మరియా!' అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి చూచినప్పుడు, 'మరియా, నేను నిన్ను అనాథగా విడువను, నేను నీ కోసము సజీవముగా వచ్చియున్నాను, ఇక్కడ నేను నీ నిమిత్తము నీ ప్రక్కన ఉన్నాను, నీవు ఇక ఏ మాత్రము అనాథగా ఉండవు,' అని చెప్పాడు. అవును, నా ప్రియులారా, నేడు మీ పరిస్థితులన్నియు మృతతుల్యముగా ఉన్నవా? మీకు సహాయము చేయడానికి అక్కడ ఎవ్వరును లేక, ఒంటరితనము అను భావముతో మీరు నింపబడియున్నారా? ఆలాగుననే, ప్రభువును కనుగొనలేకపోతున్నాము అని చెబుతున్నారా? ఇంకను నా ప్రార్థనలకు జవాబు రావడము లేదు అని అంటున్నారా? అయితే, యేసు, మీ చెంతకు వచ్చియున్నాడు, ఆయన మీ జీవితమును నిర్మాణము చేయుచున్నాడు, కనుకనే, మీరు నిరీక్షణను కలిగియుండండి, అదే మరియ, శిష్యుల యొద్దకు వెళ్లి, ఆయన సజీవముగా లేచియున్నాడని, చెప్పి, వారికి జీవమును తీసుకొని వచ్చెను. నా ప్రియులారా, మీరు యేసును కలిగియుండుట ద్వారా జీవము మీలో నుండి బయలు వెడలి వచ్చును. మీరు మీ కుటుంబానికి మరియు మీరు మీ స్నేహితులకు జీవమును తీసుకొని వచ్చెదరు. కనుకనే, మీరు భయపడకండి. యేసు ఆహారము లేకుండ ఉండియున్న తన శిష్యుల యొద్దకు వచ్చియున్నాడు. యేసు వారితో మాట్లాడియున్నాడు. దోనె యొక్క ప్రక్కన వల వేయమని చెప్పెను. తద్వారా వారు చేపలు పట్టగలిగారు. ఆ చేపలను ఆయన వండెను. ఆయన వారికి భోజనము పెట్టాడు. అవును, నా ప్రియులారా, ఈ రోజున కూడా ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " నేను వచ్చి, మీకు పోషణను మరియు నేను మీకు చేపను ఇచ్చెదను, మీ జీవితమునకు కావలసిన అవసరతలన్నిటిని నేను మీకు అనుగ్రహించెదను. మీరు ఒంటరివారు కాదు, నేను మిమ్మును అనాథలనుగా విడువను'' అని అంటున్నాడు. కనుకనే, మీరు భయపడకండి, ఈ యేసు మీతో కూడా ఉన్నాడు. కేవలము మీరు ఆయన యందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగియుండండి. నా ప్రియులారా, ఇప్పుడు ప్రభువు ఇక్కడే ఉన్నాడు, మీరు ఆయనను మీ చెంతకు రమ్మని అడుగుతారా? అప్పుడు ఆయన మీ హృదయములోనికి వస్తాడు, మీరు ఇక ఏమాత్రము అనాధులుగా ఉండరు. కనుకనే, మీరు చెప్పండి, 'యేసయ్యా, నీకు వందనములు,' అని చెప్పి ఇప్పుడే ఆయనను మీ లోనికి అంగీకరించినట్లయితే, నిశ్చయముగా ఈ లోకం మిమ్మును విడిచిపెట్టినను సరే, యేసు మిమ్మును విడువడు, ఎడబాయడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా యొక్క ఒంటరితనమును గుర్తెరిగియున్నారు, ఇంకను మేము అనుభవించినదానినంతయు, నీవు మా చెంతకు వచ్చి, మమ్మును నీ చేతులలో భద్రపరచుము. దేవా, ఒంటరితనమును, తీసుకొని వచ్చుచున్న ప్రతి అపరాధ భావమును మాలో నుండి తొలగించి, నీలో మేము రూపాంతరము చెందు కృపను మాకు దయచేయుము. ప్రభువా, మేము ఇక మీదట నుండి నీతో సహవాసమును కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితములో నీ సన్నిధి నుండి తొలగించు ఏయే కార్యములు ఉన్ననను సరే, వాటన్నిటిని నీ శక్తి ద్వారా తొలగించి, కేవలము మేము నీతో మాత్రమే సంబంధము కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, మేము నీ యొక్క ప్రేమను మరియు ప్రజల యొక్క ప్రేమను కలిగియుండునట్లుగా చేయుము. దేవా, ప్రజలను గూర్చిన భయము మాలో నుండి వెళ్లిపోవునట్లుగా చేయుము. దేవా, ఎటువంటి నష్టము, ఒంటరితనమును కలిగియున్నను, సరే, వాటన్నిటిని తొలగించి, వారికి సదుపాయమును అనుగ్రహించి, మా జీవితములను నిర్మాణము చేయుము. యేసు ప్రభువా, మమ్మును ప్రేమించినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మేము ఇప్పుడే నిన్ను మా హృదయంలోకి స్వీకరిస్తున్నాము. ప్రభువా, దయచేసి మా పాపములను, అపరాధములను క్షమించి, మమ్మును శుద్ధి చేసి, మమ్మును నూతనపరచుము. దేవా, మా ఒంటరితనాన్ని మరియు మా భయాలను తొలగించి, మమ్మును నీ పరిశుద్ధాత్మతో మరియు నీ శాంతితో నింపుము. యేసయ్యా, నీవు మా స్నేహితునిగాను, మా తండ్రిగాను, మా మార్గదర్శిగా ఉండి, మమ్మును నడిపించుము. దేవా, మేము ఇకపై అనాథలముగా ఉండము అని మా జీవితములో మేము నిన్ను విశ్వసించుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు విలువైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.