నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హబక్కూకు 3:18వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఈ వచనములో భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, "నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను'' ప్రకారము అతడు దేవుని యందు ఆనందించాడు. కానీ, అతడు ఎటువంటి పరిస్థితులలో ఇలాగున అంటున్నాడు అని మునుపటి వచనమైన మనము హబక్కూకు 3:17లో చూచినట్లయితే, "అంజూరపు చెట్లు పూయ కుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను '' అని చెప్పబడినట్లుగానే, అతని చుట్టు ఏదియు కూడా ఫలభరితంగా అస్సలు లేనేలేదు. ఇంకను అతని చుట్టు అంతా కూలిపోవుచున్నట్టుగానే, అంతా భయానకంగా ఉన్నట్టుగానే, అతనికి అనిపించియున్నది. ఇక్కడ హబక్కూకు యూదా రాజ్యముపైన దండెత్తి వచ్చినటువంటి సైన్యములు ఏ విధంగా నశింపజేశాయని చెప్పుచున్నాడు. అతని చుట్టు అస్సలు ఆశీర్వాదములంటూ ఏవియు చూడలేకపోయాడు. అయినను, "నేను యెహోవా యందు ఆనందించెదను'' అని అతడు చెబుతున్నాడు. మన విశ్వాసమును బలపరచే ఆరాధన ఎంత శక్తివంతమైనది కదా! అందుకే, దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును మరియు "సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను'' అని చెబుతున్నాడు. అంతా బాగుంది అన్నప్పుడు దేవుని స్తుతించడము, ఎంతో చక్కగా ఉంటుంది. అయితే, మనము అంతా కోల్పోయిన తర్వాత, దేవుని స్తుతించడము ఎంతో మనకు కష్టతరముగా ఉంటుందో కదా!

ఆలాగుననే, బైబిల్ నుండి యోబు 13:15వ వచనమును చూచినట్లయితే, యోబు భక్తుడు, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతు ను'' అని చెప్పబడిన ప్రకారము అతడు అంతా కోల్పోయిన తర్వాత కూడా, ఇంకను ' నేను ప్రభువును పట్టుకొనియున్నాను' అని యోబు అంటున్నాడు, ఇంకను 'నా నిరీక్షణ నా దేవుని యందు మాత్రమే ఉన్నది. అందరు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవచ్చును. కానీ, ' నా దేవుడు ఎంతో నమ్మదగినవాడు. నా ప్రభువు ఎప్పటికి మారడు. అందుకే నేను ఆయనను నిరీక్షించెదను' అని యోబు భక్తుడు చెబుతున్నాడు. అదేవిధముగా, కొంతమంది విశ్వాస వనితలు ఇలాగున చెప్పడము నేను వినియున్నాను, ' నా కుటుంబము నాకు విరోధముగా పోరాడినను, నా బాంధవ్యములు తెగిపోవుచున్నవి అని నాకు అనిపించినప్పటికిని, నా ధనమంతయు నేను కోల్పోయినప్పటికిని, నా బిడ్డలను నేను కోల్పోయినను కూడా, అయినను నా దేవునిలో నేను ఆనందించెదను. నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి, నా సమస్యలన్నిటి మధ్యలో కూడా నేను నా ప్రభువును స్తుతిస్తూ ఉంటాను.' దుఃఖించుచున్న జనసమూహమునకు నెహెమ్యా ఈ మాటలను జ్ఞాపకము చేసియున్నాడు. "యెహోవా యందలి ఆనందమే, మీకు బలమై యున్నది కనుకనే, మీరు దుఃఖించకండి.'' రక్షకుడు వారికి తోడుగా ఉన్నాడని నెహెమ్యా ఎరిగియున్నాడు. అది కరువు సమయము, ఎంతో కష్టకాలముగా ఉన్నది. అయినను 'యెహోవా యందు ఆనందించమని' నెహెమ్యా ప్రజలకు జ్ఞాకపము చేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి సామెతలు 10:24వ వచనములో చూచినట్లయితే, "శ్రమదినమున నీవు క్రుంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు'' ప్రకారము మీరు శ్రమలలో కూడా దేవుని యందు ఆనందించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు ఎల్లప్పుడు ఆనందించండి.

నా ప్రియులారా, మీరు శ్రమలన్నిటి మధ్యలో కూడా ఈ లోకపు ప్రజలతోను మరియు అపవాదితోను ఇలాగున చెప్పండి, 'నీవు నా ఆనందమును దొంగలించలేవు, నేను దేవుని ఆనందముతో నింపబడియున్నాను. నా ఆనందము దేవునిలో భద్రపరచియున్నది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా నా ఆనందమును దొంగలించలేరు.' అదేవిధముగా, ఒక వృద్ధురాలిని గురించి ఒక కథను నేను వినియున్నాను. ఒక పాష్టరుగారు బోధించుచున్నప్పుడు, ఆమె ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేది. 'దేవునికి స్తోత్రము, హల్లెలూయా, అని ఆమె గట్టిగా కేకలు వేయుచుండెను. ఆమె పాష్టరుగారికి దేవునికి అంతరాయమును కలిగించుచుండెను. ఆయన బోధ మధ్యలో ఈ వృద్ధ స్త్రీతో ఈ విధంగా చెప్పియున్నాడు, 'నీవు నోరు మూసుకొని, మాట్లాడకుండా ఉన్నట్లయితే, నేను నీకు నూతనమైన బూట్లు కొని ఇస్తాను' అని చెప్పాడు. బోధకుడు వాక్యము చెప్పగానే, ఆమె 'హల్లెలూయా' అని మరల కేకలు వేసెను. బూట్లు ఉన్నను, లేకపోయినను సరే, ఆమె 'హల్లెలూయా' అని అంటూ దేవుని స్తుతిస్తూ ఉండెను. ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని ఎల్లప్పుడు స్తుతిస్తూ ఉండండి. దేవుని సన్నిధానములో ఎల్లప్పుడు ఆనందిస్తూ ఉండండి. మన యొద్ద నుండి అన్నియు తొలగిపోవచ్చును, మనము అన్నిటిని కోల్పోవచ్చును. మన యొద్ద నుండి సమస్తమును తొలగింపబడవచ్చును. అయితే, మన దేవుడు మనలను ఎన్నడును కూడా విడువడు, ఎడబాయడు. నా ప్రియులారా, మనలో నిలిచియున్న ఒకే ఒక్క విషయము అది దేవుని యందలి ఆనందము మాత్రమే. భక్తుడు చెప్పిన రీతిగానే, ' నేను యెహోవాయందు ఆనందించెదను మరియు నా రక్షణ కర్తయైన దేవునియందు నేను సంతోషించెదను' అని నేడు మీరు కూడా చెప్పండి. నా ప్రియ స్నేహితులారా, మీరు సంతోషించం డి, దేవుని మహిమను స్తుతించండి. అప్పుడు మీరు కోల్పోయిన వాటన్నిటిని మరల పొందుకొనెదరు. యోబు తాను పోగొట్టుకున్నవాటన్నిటిని రెండంతలుగా పొందుకున్నాడు. బానిసత్వము అనంతరము కూడా ఇశ్రాయేలీయులు సమస్తమును తిరిగి పొందుకున్నారు. ఇంకను దావీదు దేవుని యందు సంతోషించినప్పుడు తాను పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందుకున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మీరు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకుంటారు కనుకనే, మీరు ప్రభువు యందు ఆనందించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానముగా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా చుట్టూ ఉన్న సమస్తమును విఫలమైనప్పుడు, దయచేసి నీలో ఆనందాన్ని ఎన్నుకోవడం మాకు నేర్పుము. ప్రభువా, మేము ప్రతిఫలము ఏమీయు పొందుకోనప్పుడు మరియు బలం లేనప్పుడు కూడా, నీవే మా రక్షణకర్తవైన దేవుడవని మాకు జ్ఞాపకము చేయుము. దేవా, మా చుట్టు ఉన్న ప్రజలు మమ్మును ప్రేమించునట్లుగాను కృపను దయచేయుము. ప్రభువైన యేసయ్యా, భయం మరియు నిరాశ నుండి మమ్మును రక్షించుము మరియు దైవీక ఆనందంతో మమ్మును నింపుము. ప్రభువా, మా యొక్క బాధాకరమైన క్షణాలలో కూడా మా స్తుతి మరింతగా పెంచుకొనునట్లుగా కృపను దయచేయుము. దేవా, మేము నిన్ను మా పూర్ణ హృదయముతో నమ్మునట్లుగాను ఎందుకంటే, నీవు మార్పులేనివాడు మరియు నమ్మదగినవాడవు గనుకనే, మేము నీ యందు విశ్వాసముంచుచున్నాము. ప్రభువా, మేము కోల్పోయిన వాటన్నిటిని తిరిగి రెండంతలుగా పొందుకొనునట్లుగా చేయుము. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ సంతోషముతోను మరియు సమాధానముతోను మమ్మును నింపుము. దేవా, మేము నీలో మాత్రమే ఆనందించునట్లుగాను మరియు సంతోషించునట్లుగా నీవు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.