నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మనము యోబు 23:10వ వచనములో, 'నేను నడచు మార్గము ఆయనకు తెలియును' అనే వాగ్దానమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఇలాగున చెప్పబడియున్నది, "నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును'' అని చెప్పబడినట్లుగానే, మనము నడుచు ప్రతి మార్గము ఆయనకు తెలియును గనుకనే, ఈ రోజు, దేవుడు మిమ్మును శోధించుచున్నాడు అని మీకు అనిపించవచ్చును. మీరు ఉద్యోగము కొరకు ఎదురుచూస్తూ ఉండవచ్చును, విమర్శలను ఎదుర్కొంటూ ఉండవచ్చును లేదా మీకు ఎంతో ప్రియమైనది పొందలేనప్పుడు హేళనకు గురవుతూ ఉండవచ్చును. మీరు మీ ఆరోగ్యమును లేదా జీవితములోని ఆనందమును కోల్పోయి ఉండవచ్చును. అయితే, నా ప్రియులారా, యోబువలె, మీరు మీ ఆస్తులను, సంతోషమును లేదా మీకు ఎంతో ప్రియులైన వారిని కోల్పోయి ఉండవచ్చును. యోబు శోధించబడినట్లుగానే, మీరు కూడా నేడు ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండవచ్చును. అయితే, మీరు దానిని చూచి భయపడకండి.
కానీ, నా ప్రియులారా, నేను ఈ వచచనమును చదివినప్పుడు, నాకు ఒక కథ గుర్తుకు వచ్చినది. ఒక రైతు నేలలో ఒక విత్తనమును నాటియున్నాడు. అతను దానికి నీరు పోసి, అది ఎదగడము కొరకు కనిపెట్టుకొని చూచుచుండెను. అయితే, ఆ మార్గము వైపున వెళ్లుచున్నవారు, ఆ రైతును చూచి, 'నీవు నాటిన ఆ మొక్క ఎక్కడ? నాకు కేవలం మట్టి మాత్రమే కనిపించుచున్నది. ఆ స్థలములో ఏదియు మొలకెత్తుచున్నట్లుగా ఆనవాలు నాకు కనిపించలేదు' అని చెప్పేవారు. కానీ, ఆ రైతు తాను విత్తిన విత్తనము ఎలాగున ఉన్నదని చూడడానికి ప్రతిరోజు మట్టిని త్రవ్వలేదు. అందుకు బదులుగా, అతడు కనిపెట్టుకొనియుండెను. అయితే, చూడండి, మట్టి లోపల, అతడు నాటిన ఆ విత్తనం నెమ్మదిగా వేళ్ళు తొడుక్కుంటూ పైకి ఎదిగి, నీరు, సూర్యరశ్మితో అది క్రమక్రమముగా మట్టి పైకి ఎదిగి, మొక్కగా మారి, చివరికి ఫలములను ఇచ్చినది.
అదేవిధంగా, నా ప్రియులారా, ప్రజలు మీ జీవితమును చూచి, 'మీ జీవితములో ఏమి జరగడము లేదు' అని అనవచ్చును; కానీ పైకి కనిపించని రీతిలో దేవుడు చేయుచున్న పనిని వారు చూడలేరు. మీ చిరునవ్వు వెనుక, మీరు ఆరోగ్యము, వృత్తి లేదా కుటుంబమునకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చును. కానీ, మీ హృదయమును కాపాడుకుంటూ, దేవుని వాక్యములో స్థిరంగా నిలిచియుంటూ, ఆయన స్వరమును ఆలకించుచూ, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడు, దేవుడు మీ విశ్వాసమును అభివృద్ధిపరచి, మిమ్మును తీర్చిదిద్ది, బలవంతులుగా మారుస్తాడు. ఆయన మీ మనస్సును, శరీరమును మరియు ఆత్మను బలపరుస్తాడు. అందుకే బైబిల్ నుండి యోబు 23:10వ వచనములో చూచినట్లయితే, "...ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును'' అని చెప్పబడినట్లుగానే, సువర్ణము అగ్నిచేత శుద్ధి చేయబడుతుంది; దానిలోని మలినమంతయు తొలగిపోయి, అది శుభ్రముగాను మరియు ప్రకాశవంతంగా తయారవుతుంది.
అదేవిధంగా, నా ప్రియులారా, నేడు మీరు ఎదుర్కొనే ఆపదల ద్వారా, మీ జీవితములో ఉన్న మలినమంతటిని దేవుడు తొలగిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన తన చిత్తానుసారంగా మిమ్మును తీర్చిదిద్దుతాడు. ఆ అగ్ని పరీక్షను దాటి వచ్చినప్పుడు, మీరు సువర్ణమువలె, నిర్మలముగాను, పరిశుభ్రముగాను మరియు ఆయన దృష్టిలో ఇంపుగా ప్రకాశిస్తారు. కాబట్టి, ఈ రోజు మీరు అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్లుచున్నప్పటికిని, ప్రభువు మీద మీరు నమ్మకమును ఉంచి, ఆయన వాక్యమునకు విధేయులై, ఆయన చిత్తానుసారంగా నడుచుకోండి మరియు యేసును గట్టిగా హత్తుకొనండి. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 1:6-7వ వచనములలో మనము చూచినట్లయితే, "ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును'' అని మనము చదివినట్లుగానే, నేడు మీరు కొంతకాలం శ్రమపడినప్పటికిని, చివరకు సువర్ణమువలె మెరుస్తూ బయటకు కనిపించెదరు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు మీరు ధైర్యమును తెచ్చుకొనుము. మీరు ప్రభువుయందు నమ్మకమును ఉంచినప్పుడు ఆయన మిమ్మును సువర్ణమువలె ప్రకాశించునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీ యొక్క అద్భుతమైన వాగ్దానమునకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ఆపత్కాలములలో ఉన్నప్పుడు, మా విశ్వాసమును బలపరచి, మేము కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహించుము. దేవా, నిన్ను నమ్మడానికి, నీ వాక్యమునకు విధేయత చూపడానికి మరియు మా హృదయములను, మనస్సులను కాపాడుటకు మాకు సమాధానమును, కృపను, మరియు బలమును దయచేయుము. ప్రభువా, మేము అగ్నిలో నడుచుచున్నప్పుడు, మాలో ఉన్న మలినమంతటిని తొలగించి, నీ చిత్తానుసారంగా మమ్మును తీర్చిదిద్దుము. దేవా, మేము నీ వాక్యములో నాటబడి, నీ స్వరమును విని, విధేయతతో నడుచునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా మనస్సులను, దేహములను మరియు ఆత్మలను నీ వాక్యము చేతను మరియు నీ యొక్క శక్తిచేతను బలపరచుము. దేవా, మేము ఈ శోధనలను దాటిపోవుటకు మాకు కావలసిన ఓర్పును, సహనమును, నీ యందు నమ్మకమును మాకు దయచేయుము. ప్రభువా, మేము నీ నామమునకు స్తుతి, మహిమ, మరియు ఘనతను తీసుకొని వచ్చునట్లుగా, శోధనలో మేము పరీక్షింపబడినప్పుడు, సువర్ణమువలె మేము కనబడునట్లుగా చేయుమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


