నా ప్రియ స్నేహితులారా, నేడు బైబిల్ నుండి మత్తయి సువార్త 5:6వ వచనమును వాగ్దానముగా మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు'' ప్రకారము నీతి కొరకు ఆశకలిగినటువంటి వారు తృప్తిపరచబడతారు అని ఇక్కడ యేసు ప్రభువు తెలియజేయుట మనము చూడగలము. మనకు అన్నిటిని ఇచ్చువాడు యేసు ప్రభువు మాత్రమే అయ్యి ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 6:35,36వ వచనములలో చూచినట్లయితే, " యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు మరియు నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు '' అని యేసు ప్రభువు అంటున్నాడు. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి యోహాను 4:14వ వచనములో చూచినట్లయితే, యేసు "నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని...చెప్పెను'' ప్రకారము అవును, ఆయన ఇచ్చు నీళ్లు నిత్యజీవమునకై మనలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని చెప్పబడియున్నది. ఆలాగుననే, బలమైన సింహాలు కూడా కొన్నిసార్లు ఆకలి కలిగియుండవచ్చును. కానీ, దేవుని యందు విశ్వాసముంచువానికి ఏమేలు కొదువై ఉండదు అని ఆయన సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు సంపూర్ణతను ఇచ్చే దేవుడై యున్నాడు. సంపూర్ణంగా నింపబడియున్న ఒక పాత్ర ఎన్నటికిని కదల్చబడదు. కనుకనే, ప్రియులారా, మనము ఎన్నటికిని కదల్చబడకుండా ఉండాలంటే, 'యేసయ్యా, మీద ఆధారపడి జీవించుచున్నప్పుడు, దేవుడు ఇచ్చు సంపూర్ణతను మీ జీవితములో మీరు కలిగియుంటారు. యేసయ్య కొరకు ఒక గొప్ప ఆశను మీరు కలిగియున్నప్పుడు, ఆ జీవితములో నింపబడియున్నటువంటి భావాన్ని మీరు కలిగియుంటారు.

అందుకే బైబిల్ నుండి కీర్తనలు 46:5వ వచనములో చూచినట్లయితే, " దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు'' ప్రకారము దేవుని కొరకు ఆశ మరియు ఆకలిని మీరు కలిగియున్నప్పుడు, ఆయన మిమ్మును నూనెతో మీ తలను అంటియుండుటను మరియు మీ గిన్నె నిండి పొర్లుట మీరు చూడగలుగుతారు. దావీదు ఇటువంటి గొప్ప అనుభవమును కలిగియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 45:5వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైన వాడొకడును లేడు '' అని దావీదు ఈ విధంగా అంటున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మనము దేవుని అడిగినప్పుడు, ఆకాశపు వాకిళ్లను తెరచి సమృద్ధియైన ఆశీర్వాదములను మన మీద కుమ్మరిస్తాడు. అందుకే పైన వచనములో చెప్పబడినట్లుగానే, "నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు'' ప్రకారము నా ప్రియులారా, నేటి నుండి మీరు తృప్తిపరచబడతారు.

నా ప్రియులారా, "ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి'' అని పౌలు భక్తుడు జ్ఞాపకము చేయుచున్నాడు. కనుకనే, దేవుని ఆత్మచేత మీరు నింపబడినప్పుడు, మీరు కష్టాలను, శ్రమలను ఎదుర్కొన్నప్పుడు కూడా, ప్రభువు తన ఆనందమునిచ్చు ఆత్మతో కూడా మిమ్మును నింపుతాడు. మీరు ఒంటరిగా ఉన్నట్టుగా ఇంక ఎప్పుడు కూడా భావించరు. సమృద్ధి నిచ్చునటువంటి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని మీరు ధైర్యముగా ఉంటారు. ఆయన మీకు బలమునిచ్చుచూ, నిలబెడతాడు. దేవుని ఆనందమే మీకు బలమును కలుగుజేయుచున్నది. ఆయన ఆత్మచేత నింపబడిన మీరు ధన్యులై ఉంటారు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు కూడా ప్రభువు యొద్ద మొఱ్ఱపెట్టండి, తన ఆత్మ చేత నింపమని ప్రభువును వేడుకొనండి. అప్పుడు ఆయన ఎల్లప్పుడు మీరు సంపూర్తిని అనుభూతి చెందునట్లుగా మీకు సహాయము చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు సంపూర్ణత ను ఇచ్చి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగియున్నవారు ధన్యులు అని నీవు వాగ్దానము చేసినట్లుగానే, నీ ఆశీర్వాదములను నేడు మా మీదికి దిగివచ్చునట్లుగా కృపను దయచేయుము. ప్రేమగల ప్రభువైన యేసు, ఆకలితో ఉన్న హృదయంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మమ్మును నీ నీతితోను, సమాధానముతోను నింపుము. ప్రభువా, మా ఆత్మ నీ కొరకు మరియు నీ సన్నిధి కొరకు మాత్రమే దాహం గొనునట్లుగా చేయుము. దేవా, దయచేసి మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక పాత్రగా చేసి, మా బలహీనతలో, నీ యొక్క బలంతో మరియు మా శూన్యతలో, నీ ఆనందంతో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క జీవజలపు ఊరెడు బుగ్గ అనుదినము మా ద్వారా ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి సమయములో మేము నీపై ఆధారపడటానికి మాకు నేర్పుము. దేవా, నీ వాక్యానుసారముగా మేము నీ ఆత్మచేత నింపబడునట్లుగా చేయుము. ప్రభువా, నూనెతో మా తలను అంటి, మా గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా చేసి, ఇక మా జీవితములో ఏడుపు ఉండకుండా మా దుఃఖమంతయు సంతోషముగా మార్చుము. దేవా, మా ఆత్మను ఎల్లప్పుడు సంతృప్తిపరచే జీవజలంగా మార్చుటకు నీవు మా సమృద్ధి దేవునివి కాబట్టి మా సర్వస్వాన్ని నీకు ఆర్పించుచున్నాము. కనుకనే, నేడు నీ కొరకు ఆకలిదప్పులు కలిగియున్న మా జీవితాలను తృప్తిపరచి, సంపూర్ణంగా ఆశీర్వదించి, ధన్యకరమైన జీవితమును నేడు మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.