నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు ఒక చక్కటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 65:23వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...వారు యెహోవాచేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు'' ప్రకారము దేవుని యొద్ద నుండి మనకు ఎంతటి గొప్ప వాగ్దానము ఇవ్వబడినది కదా! నా ప్రియ స్నేహితులారా, మీరు మాత్రమే ఆశీర్వదింపబడడము కాదు గానీ, మీ సంతానము కూడా ప్రభువు చేత దీవించబడతారు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 13:10వ వచనములో చూచినట్లయితే, "మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగిన యెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును'' ప్రకారము దేవుడు మీ సంతానమును విస్తరింపజేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి ఆదికాండము 16:10వ వచనములో చూచినట్లయితే, " మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని చెప్పెను'' ప్రకారము దేవుడు నేడు మీ సంతానమును ఎవరు కూడా లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాడు. ఆలాగుననే, ఆదికాండము 22:17 మరియు ఆదికాండము 26:4, ఆదికాండము 28:14వ వచనములలో చూచినట్లయితే," ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు'' మరియు " నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమి యొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును'' ప్రకారము మీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అలాంటి సమృద్ధి మన ప్రేమగల దేవుని హృదయాన్ని ప్రత్యక్షపరుస్తుంది. కనుకనే, నేడు నా ప్రియులారా, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించి మరియు విశ్వసించే వారిపై తన ఆశీర్వాదాలను విస్తరించడంలో ఆయన ఆనందిస్తాడు.
ఆలాగుననే, బైబిల్ నుండి 2 సమూయేలు 22:51మరియు కీర్తనలు 18:50వ వచనములలో చూచినట్లయితే, " నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు''ప్రకారము దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపుచున్నాడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, అదే ఆశీర్వాదములను నేడు మీ మీద కూడా కుమ్మరించబడబోవుచున్నవి. సర్వశక్తిమంతుడైన ప్రభువును ఎల్లప్పుడు పట్టుకొనువారు అట్టి ఆశీర్వాదమును పొందుకొనెదరు. బైబిల్ నుండి కీర్తనలు 25:13వ వచనములో చూచినట్లయితే, " అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును'' ప్రకారము నేడు మన సంతానము కూడా ప్రభువుచేత జ్ఞాపకము చేసుకొనబడును. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 22:30వ వచనములో చూచినట్లయితే, "ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు'' ప్రకారము మీ సంతతి కూడా ప్రభువును సేవించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అంటే మీ పిల్లలు కూడా దేవుని సేవ చేయడానికి మరియు ఆయన నామాన్ని మహిమపరచడానికి లేపబడతారు. నేడు, నా ప్రియులారా, మీరు దేవునితో నడవడం వలన మీ కుటుంబం రాబోవు తరాలకు ఆశీర్వదించబడుతుందని తెలుసుకోవడం ఎంత అద్భుతంగా ఉన్నది! కాబట్టి, నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువును హత్తుకుని ఉండండి. మీరు శోధనలను ఎదుర్కొన్నప్పుడు దేవుని విడిచిపెట్టకండి. ఈరోజు మీరు కలిగియున్న విశ్వాసం రాబోవు మీ సంతానమునకు ఆశీర్వాదకరమైన విత్తనంగా విత్తబడుతుంది. కనుకనే, మీ సంతానము కూడా భూమి మీద ఆశీర్వదింపబడుతుంది.
నా వ్యక్తిగత జీవితము ఈ ఆశీర్వాదమునకు ఒక మంచి ఉదాహరణగా ఉంటున్నది. మొదట్లో నేను నా ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్నాను. ప్రజలు నన్ను చూచి అపహసించేవారు. 'ఎల్లప్పుడు ప్రభువు, ప్రభువు అని వెళ్లుచుండేదానవు, అందువలన ఇప్పుడు నీకేమి ప్రయోజనము?' అనేవారు. అయినప్పటికిని, నేను ప్రభువును విడువకుండా, ఎల్లప్పుడు ఆయనను గట్టిగా పట్టుకొని ఉండేదానను. అయితే, చివరికి ఏమి జరిగింది? అని చూచినట్లయితే, ప్రభువు అద్భుతమైన ఇద్దరు బిడ్డలతో నన్ను దీవించాడు. ఈ రోజు కూడా మా కుటుంబమంతయు ప్రభువు చేత దీవించబడినది. అంతమాత్రమే కాదు, బిడ్డలతోను, మనవళ్లతోను, మునిమనవళ్లతోను ప్రభువు నన్ను దీవించియున్నాడు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. నిజంగా, ప్రభువు ఆశీర్వాదాలు ఐశ్వర్యవంతులను చేయుచున్నది, అందుకే బైబిల్ నుండి సామెతలు 10:22వ వచనములో చూచినట్లయితే, " యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు '' ప్రకారము నా ప్రియమైన స్నేహితులారా, మమ్మును మరియు మా కుటుంబమును పైకి లేవనెత్తి, మా సంతతిని ఆశీర్వదించిన అదే దేవుడు నేడు మిమ్మును కూడా ఆశీర్వదిస్తాడు. మీరు ఏమి కోల్పోయినా, ఆయన వాటన్నిటిని మీకు మరల ఇస్తాడు. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో? దానిని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రభువు మిమ్మల్ని మరియు మీ సంతానమును ఆశీర్వదిస్తాడని ఈరోజే నమ్మండి. మీరు నమ్మితే, మీరు దేవుని మహిమను చూస్తారు అని వాక్యం చెబుతోంది. కాబట్టి రండి, ప్రార్థనలో మనం ప్రభువును హత్తుకుందాం. ఆయన మిమ్మును జ్ఞాపకము చేసుకుంటాడు, మిమ్మును పైకి లేవనెత్తుతాడు మరియు మిమ్మును మరియు మీ సంతతిని భూమిపై ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి ఆశీర్వాదమును మీరు కూడా పొందుకోవాలంటే, ఇప్పుడే, మనము ప్రార్థించబోవుచున్నాము. ఈ వాగ్దానములన్నియు కూడా ప్రభువు మీ జీవితములో నేరవేర్చాలని నేను మీ పట్ల కోరుచున్నాను. కనుకనే, మీరు ప్రభువును నమ్మినట్లయితే, మీరు దేవుని మహిమను చూచెదరు. ప్రియ స్నేహితులారా, అదే ఆశీర్వాదమును ప్రభువు యొద్ద నుండి మీరు పొందుకొనగలరని మీరు నమ్ముచున్నారా? రండి ప్రార్థిద్దాము. మీరు ప్రభువును హత్తుకొనండి, మీరు మరియు మీ సంతానము కూడా ఈ భూమి మీద అదేవిధముగా దీవించబడతారు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలైన మమ్మును జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువా, మా సమస్యలన్నియు నీవు ఎరిగియున్నావు, నీ ప్రశస్తమైన హస్తము మా మీద ఉండునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. మాకు కావలసిన దీవెనలన్నిటిని మాకు ఇచ్చి మమ్మును అత్యతధికముగా ఆశీర్వదించుము. దేవా, నీవు మా పట్ల చేసిన నీ యొక్క నిబంధనను శాశ్వతంగా గుర్తు చేసుకొని, మా జీవితములో మేము కోల్పోయిన ఆశీర్వాదములను మరల మాకు అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు మేము నీ యెదుట మొఱ్ఱపెట్టుచున్నాము, నీవు మమ్మును జ్ఞాపకము చేసుకొని, మా హృదయంలోని ప్రతి బాధ, ప్రతి నష్టం మరియు ప్రతి కోరికను నీవు తీర్చమని వేడుకొనుచున్నాము. ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన హస్తములు మా మీద ఉంచి మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుము. దేవా, అబ్రాహాము మరియు దావీదు పట్ల నీవు చేసిన వాగ్దానమును ప్రకారము నీవు మమ్మును మరియు మా సంతానమును ఆశీర్వదించి, విస్తరింపజేయుము. ప్రభువా, మా పిల్లలు మరియు మనవరాళ్ళు నీ అనుగ్రహం మరియు కృపలో నడుచునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితంలోని ప్రతి దుఃఖాన్ని ఆనందంగా మరియు ప్రతి బలహీనతను బలంగా మార్చుము. యేసయ్యా, నీ యొక్క ఆశీర్వాదాము మాకు ఐశ్వర్యమునిచ్చునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నేటి నుండి మా సంతానమును భూమి మీద లెక్కింపలేనంతగా ఆశీర్వాదింపబడునట్లుగా సహాయము చేయుమని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


