నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేడు ప్రభువు ఎటువంటి పరిస్థితులలోను మిమ్మును విడిపించి, ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 5:9వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతో ననెను. అందు చేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు పెట్టెను.’’ అవును, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఎంతగానో హింస నొందారు. ఐగుప్తు వారిని బానిసలుగా ఎంతో వేధించారు. కనుకనే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంతో కష్టపడి పనిచేయవలసి వచ్చినది. తద్వారా, వారు దేవుని వైపు చూచి, ఎంతగానో మొఱ్ఱపెట్టియున్నారు. ఆ సమయములో ప్రభువు మోషేను పంపించి ఆశ్చర్యకరముగా వారిని విడుదల చేసియున్నాడు. ప్రియ బిడ్డలారా, మనము ఈ లోకములో అదేవిధముగా, అనేక శ్రమలను మరియు హింసలను అనుభవిస్తుండవచ్చును. ఇంకను మనము కూడా అన్ని రకములైన వేదనలు అనుభవిస్తున్నామేమో? అయితే, భయపడకండి, మీకు సహాయము చేయుటకు దేవుడు మీతో కూడా ఉన్నాడు.
బైబిల్ గ్రంథములో చూచినట్లయితే, యాకోబు భార్యయైన రాహేలు, తనకు పిల్లలు లేరని, నిందను, అవమానమును ఎదుర్కొంటున్నానని చెబుతూ, దేవునికి మొఱ్ఱపెట్టినది. అయితే, ప్రభువు ఆమె మొఱ్ఱను ఆలకించి, ఇద్దరు బిడ్డలతో ఆయన ఆమెను దీవించియున్నాడు. అదేవిధముగా, నూతన నిబంధన గ్రంథములో చూచినట్లయితే, దైవజనుడైన జెకర్యా అను వ్యక్తి ఉండెను. అతని భార్యకు కూడా బిడ్డలు లేరు. ఒకవేళ, మీరు సంతానములేనివారు, ఉద్యోగము లేనివారు, వ్యాపారములేనివారుగాను ఉంటూ, ఇప్పుడు ఎన్నో అవమానములను ఎదుర్కొంటున్నారేమో? అయితే, మీరు ఒక విషయమును జ్ఞాపకమునకు ఉంచుకొనవలెను. ఆ సమయములో మీరు సిలువ వైపు చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఎన్నో అవమానములను ఎదుర్కొనియున్నాడు. ఇంకను తన్ను తాను తగ్గించుకొని, సిలువలో వ్రేలాడియున్నాడు, ఆలాగుననే, ఆయన తన ప్రాణమును అర్పించాడు. అన్నిటిని త్యాగము చేసియున్నాడు. సిలువలో అన్నిటిని జరిగించి ముగించాడు. కాబట్టి, నా ప్రియులారా, మనము అవమానాల పాలైనప్పుడు, మనము ఏమి చేయాలి? మనము ఆయన వైపు చూచి, ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే చాలు, ‘ప్రభువా, నీవు అవమానములను ఎదుర్కొన్నావు, ఇప్పుడు మేము కూడా ఈ అవమానాలను ఎదుర్కొంటున్నాము అయ్యా, ఈ అవమానములన్నిటి నుండి మమ్మును విడిపించుము, నీవు మాతో ఉండి, వీటన్నిటి నుండి మేము బయటకు రావడానికి మాకు సహాయము చేయుము’ అని ఆయన ఆలాగున మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ అవమానమునకు ప్రతిగా మీకు ఘనతను ఇస్తాడు.
నా ప్రియులారా, ఒకవేళ నేడు మీకు అవమానము రావచ్చును. అయితే, వేరే మార్గమే లేదు, వేరెవ్వరు కూడా మీకు సహాయము చేయలేరు, అవమానాలు వస్తుంటాయి, గనుకనే ఈ లోకము ఎంతో చీకటితో నిండియున్నది, కృతజ్ఞత లేనటువంటి ప్రపంచం ఇది. మీరు ఎవరికైతే, సహాయము చేసియున్నారో? వారి నుంచి మీరు అవమానములను ఎదుర్కొనవలసి వస్తుంది. స్నేహితులారా, అటువంటి సమయములో మనము ఏమి చేయాలి? సిలువ వైపు చూడండి, ఇంకను యేసయ్య యెదుట మోకరించి, ఆయనకు మొఱ్ఱపెట్టండి, ‘తండ్రీ, మాకు సహాయము చేయుము, మా అవమానములన్నిటి నుండి మమ్మును విడిపించుము. దేవా, మా బలహీనతల మరియు నుండి బాధల నుండి మమ్మును విడిపించుము,’ అని మీరు ఆలాగున దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, ప్రభువు మిమ్మును అర్థము చేసుకుంటాడు. ఎందుకనగా, ఆయన కూడా అవమానమును నొందియున్నాడు. ఆయన ఆ మార్గముగుండా వెళ్లియున్నాడు. ఇప్పుడు కూడా నా ప్రియ స్నేహితులారా, మనము ప్రభువు వైపు చూడబోవుచున్నాము, మీ అవమానములన్నియు తొలగిపోతాయి. కనుకనే, నేడు మిమ్మును మీరు తగ్గించుకొని, ప్రభువు యెదుట ప్రార్థన చేస్తుండగా, ఆయన అన్నిటిని మిమ్మును విడిపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమాకనికరము గలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మమ్మును ఇంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, మమ్మును బట్టి నీవు శ్రమను అనుభవించియున్నావు, గనుకనే, నీకు వందనాలు. తండ్రీ, నీవు ఆ సిలువలో అవమానములను, శ్రమలను ఎదుర్కొన్నావు, నీ వైపు మేమందరము చూస్తున్నాము, సిలువ మాత్రమే మాకు సహాయము. యేసయ్యా, ఆ సిలువలో నిన్ను నీవు తగ్గించుకొని, అనేక శ్రమలను నొందియున్నావు, గనుకనే, నీ యొక్క సిలువ శక్తిచేత, మా బలహీనతలన్నియు మా నుండి తొలగిపోవునట్లు చేయుము. దేవా, మా అవమానాల నుండి మేము విడుదల పొందుకొని, నీ మహిమార్థమై ప్రకాశించునట్లుగా కృప చూపుము. ప్రేమగల తండ్రీ, మా ప్రతి కన్నీటిని చూసే దేవుడు నీవే, మా యొక్క ప్రతి నిందను అర్థం చేసుకుంటావు. కనుకనే, ఈ రోజు, సిగ్గు, దుఃఖం మరియు తృణీకరించబడిన స్థితిలో భారముతో నిండిన హృదయంతో మేము నీ యెదుటకు వస్తున్నాము. దేవా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి ఐగుప్తు నిందను నీవు తొలగించినట్లుగానే, మా జీవితం నుండి ప్రతి భారాన్ని తొలగించుము. ప్రభువైన యేసు, మా కొరకు నీవు సిలువపై చివరివరకు నిందను భరించావు, కాబట్టి నీవు మమ్మును సంపూర్ణంగా అర్థం చేసుకోగలవని మాకు తెలుసు. కనుకనే, నేడు మా జీవితంలో అవమానం మరియు ఓటమిలను కలిగించే ప్రతి పరిస్థితి నుండి మమ్మును విడిపించమని అడుగుతూ, తండ్రీ, మేము ఇప్పుడు నీకు మొరపెట్టుచున్నాము, నీవే మాకు సహాయం మరియు నమ్మకం. దేవా, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మును సమాధానము, శక్తితోను మరియు పునరుద్ధరణతో నింపుము. యేసయ్యా, నీవు పొందిన సిలువ శ్రమల ద్వారా మా దుఃఖాన్ని సంతోషంగాను మరియు మా నిందను ఘనతగాను మార్చడానికి మేము నిన్ను నమ్ముచున్నాము. నేడు నీవు మా అవమానమును అంతము చేస్తావని విశ్వసించుచూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.