నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 12:9వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది...'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరొక అనువాదములో చూచినట్లయితే, "నీకు కావలసినదంతయు నా కృపయే అయ్యి ఉన్నది. నీ బలహీనతలో నా కృప నిన్ను బలపరచుచున్నది '' అని వ్రాయబడియున్నది. బైబిల్ గ్రంథములో అపొస్తలుడైన పౌలు భక్తునికి ఒక ముల్లు పెట్టబడినది. కాబట్టి, అతడు ముమ్మార్లు ఆ ముల్లును తీసివేయమని ప్రభువును వేడుకున్నాడు. 'కష్టము లేనిదే, ఏ లాభము ఉండదు' అని ఒక సామెత చెప్పబడుతుంది. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు మీరు అనుభవించే నొప్పి, వేదన రేపు మిమ్మును బలపరుస్తుంది అని అంటారు. కానీ, కొంతమంది, ఆ నొప్పిని మరియు బాధను తట్టుకోలేపోతుంటారు. అటువంటివారు ప్రభువును వెఱ్ఱితనముగా దూషిస్తారు. ఇంకను, ' దేవా, నీవు నన్ను స్వస్థపరచకపోయినట్లయితే, నేను ఇక నుండి నిన్ను ఆరాధించను' అని అంటుంటారు. చివరిగా, వారు నిరాశ, నిస్పృహలోనికి వెళ్లిపోతారు. మనము ఎంత అధికముగా వేదన, బాధను అనుభవిస్తామో, ప్రభువు యొద్ద నుండి అంత అధికముగా బలాన్ని పొందుకుంటాము.

నా ప్రియులారా, మన జీవితములో ఇటువంటి బాధల ద్వారా ప్రభువు మనకు తగ్గింపును నేర్పిస్తాడు. అటువంటి అనుభవముల గుండా, మనము వెళ్లాలని ప్రభువు మన పట్ల కోరుకుంటున్నాడు. ఇంకను ఆయనకు సమీపముగా మారాలని ఆయన మన పట్ల ఆశించుచున్నాడు. బైబిల్‌లో, అపొస్తలుల కార్యములు 14:22వ వచనములో ఆ మాటలనే చెప్పబడియున్నవి, " శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి'' అన్న వచనం ప్రకారం మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననగా, అనుదినము మన సిలువనెత్తుకొని మనము మోయవలెను. అప్పుడు మాత్రమే మనము ప్రభువును వెంబడించగలము. ఆ నొప్పిని మనము భరించాలి. ఆ కష్టమును మనము సహించగలము. ఇంకను, 'ప్రభువా, నేను అనుభవించుచున్న ఈ వేదనలు నా మంచి కొరకే' అని విశ్వాసులుగా ఉంటూ మనము చెప్పగలగాలి. అయితే, మరొక వైపు, ' ప్రభువా, ఈ ముల్లును నా జీవితములో నుండి తొలగించుమని' చెప్పినప్పుడు, మనము ప్రభువు యొద్ద నుండి ఎన్నడును కూడా జవాబును పొందుకొనలేము. అంతమాత్రమే కాదు, "నా బిడ్డా, నా కృప నీకు చాలును '' అని ప్రభువు అప్పుడు మనతో అంటాడు. మనము అనుభవించుచున్నటువంటి భౌతిక లేక మానసిక, ఆధ్యాత్మికమైన ఆ ముల్లు ద్వారా ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడని మనము తెలుసుకోగలుగుతాము. కనుకనే, 'ఆయన కృప మీకు చాలును' అని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము ఎటువంటి బాధలు, వేదనలు అనుభవించుచున్నప్పటికిని, దేవుని కృప మనలను స్వస్థపరచగలదు. దేవుని కృప మన బాధల నుండి మనలను విడిపించగలదు. మనం ఎదుర్కొంటున్న ఎలాంటి గాయాన్ని అయినా దేవుని కృప బాగు చేయగలదు. కనుకనే, ధైర్యముగా ఆయన యొద్దకు రండి, ఆయన కృపను పొందుకొనండి.

ఆలాగుననే, నా ప్రియులారా, బైబిల్‌లో 2 కొరింథీయులకు 3:5వ వచనములో చూచినట్లయితే, "మా వలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగి యున్నది.'' అవును, మన యొక్క సామర్థ్యము దేవుని వలన మాత్రమే కలుగుతుందని వాక్యములో స్పష్టముగా తెలియజేయుచున్నది. దేవుని కృప మీకు చాలిన కృపగా ఉండును గాక. యేసుక్రీస్తునందున్న కృప ద్వారా మీరు బలపరచబడుదురు గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు శ్రమనొందియున్నాడు. మీరు మీ బరువులను ఇక మోయనవసరము లేదు. యేసుప్రభువు ఇదివరకే సిలువలో అది చేసియున్నాడు. కాబట్టి, ప్రభువు యొద్ద నుండి వచ్చే కృప మీద మనము అనుదినము అధారపడినప్పుడు, ప్రభువు యొద్ద నుండి మనకు సామర్థ్యము వచ్చునట్లుగా చేస్తాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యొక్క కృప మీ మీదికి దిగి వచ్చి, ఆయన మిమ్మును హత్తుకొని, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఇప్పుడే, నీ కృప మా మీద కుమ్మరించునట్లుగా మరియు నీ ప్రేమ మమ్మును ఆవరించునట్లుగా చేయుము. దేవా, నీ కృప ఎంతో ఉన్నతమైనది కనుకనే, మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, ఈ లోకములో మేము ఎదుర్కొంటున్న ఎటువంటి కష్టాలనైనను మరియు బాధలనైనను నీ కృప చేత మమ్మును బాగుచేయుము. తండ్రీ, మా వేదనను భరించగలుగుటకును మరియు మా మీద ఉన్న కాడిని సుళువుగా ఉండునట్లుగా మాకు సహాయము చేయము. దేవా, మా కష్టాలన్నిటి నుండి మమ్మును విడిపించుము. దేవా, మా వేదన అంతటి నుండి మమ్మును బయటకు తీసుకొని రమ్ము, నీకు పరిచర్య చేయుటకు మాకు స్వాతంత్య్రమును దయచేయుము. దేవా, నీ కృప మమ్మును ఆవరించునట్లుగా చేయుము. యేసయ్యా, మేము బలహీనంగా ఉన్నప్పుడు, నీవే మా బలం మరియు మాకు కేడెముగా ఉన్నావు. దేవా, మా ప్రార్థనలకు జవాబు రాలేదు అనిపించినప్పటికీ, నీవు మా మేలు కొరకు కార్యము చేయుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితములో ఉన్న ముల్లును స్వీకరించి నీ ఉద్దేశ్యంలో నమ్మకం ఉండుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మా బాధలలో మేము నీ కృప ఎదగడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క చాలినంత కృప మా అనుదిన జీవితములో ఒక భాగం విశ్వాసంగా ఉండునట్లుగా చేయుము. దేవా, మా జీవిత తుఫానులలో కూడా మా హృదయాన్ని సమాధానముతో నింపుము. యేసయ్యా, నీవు సిలువపై మా భారాలను నీవు ఇప్పటికే మోసావని మాకు గుర్తు చేయుము. ప్రభువా, క్రీస్తు యేసులో ఉన్న కృప ద్వారా మా బలహీనతలన్నిటిని తొలగించి, మమ్మును నీ కృపచేత బలపరచుమని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.