నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 16:3వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును'' అని చెప్పబడినట్లుగానే, మీ పనుల భారమును దేవుని మీద ఉంచినప్పుడు దేవుడు మీ కార్యములన్నిటిని సఫలపరుస్తాడు. నా ప్రియులారా, ఒకవేళ మీ పనులన్నియు చిన్నవియైనను, అవి పెద్దవియైనను సరే, అన్నిటిని ప్రభువు హస్తములకు సమర్పించడము ఎంత ధన్యకరము కదా. మనము ఆ విధముగా చేసినప్పుడు, ఏమి జరుగుతుంది? మన కార్యములన్నియు కూడా సఫలమవుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు చేయునవన్నియు కూడా సఫలమవుతాయి. అందుకే బైబిల్ నుండి ప్రసంగి గ్రంథము 3:22వ వచనములో చూచినట్లయితే, "కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము'' అని చెప్పబడినట్లుగానే, మనము ఏమి చేయవలెను?అని మనము చూచినట్లయితే, మనము చేయు క్రియలన్నిటిలోను మనము సంతోషించవలెను. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 2:7వ వచనములో చూచినట్లయితే, "సత్‌క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవము నిచ్చును'' అని చెప్పబడినట్లుగానే, మనము సత్‌క్రియను ఓపికగా చేసినప్పుడు, ఆయన మనకు నిత్యజీవమును అనుగ్రహించుచున్నాడు.

నా ప్రియులారా, మనము ఏమి చేసినను, సత్‌క్రియలును చేయువారుగా ఉండవలెను. ప్రజలను ద్వేషించుచూ, ఇతరులకు చెడు చేయడము దేవుని చిత్తము కాదండి. మొదటిగా, మనము దేవునిని ప్రేమించవలెను. రెండవదిగా, మనము ప్రజలందరిని ప్రేమించవలెను. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 9:8వ వచనములో చూచినట్లయితే, " మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు'' అని చెప్పబడినట్లుగానే, మీరు సత్‌క్రియ చేసినప్పుడు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. కనుకనే, మీరు ఏ పని చేసినను, కూడా అది సత్‌క్రియ అయి ఉండాలి. ఆలాగుననే,మీరు దేవునిని ఇష్టపెట్టువారుగా ఉండాలి. ఇంకను మీ ప్రక్కనున్న వారికి సహాయము చేసేవారిగాను, వారిని ప్రేమించేవారినిగాను ఉండాలి. మీ కుటుంబ సభ్యులకును, మరియు మీరు ఎక్కడైతే, పని చేయుచున్నారో అక్కడ ఉన్న వారందరిని కూడా ప్రేమించుచూ, వారికి సహాయము చేయు, సత్‌క్రియ చేయువారుగా ఉండాలి.

బైబిల్ గ్రంధములో రాణియైన ఎస్తేరును చూచినట్లయితే, ఎస్తేరు ఆ విధంగానే ప్రార్థించినది. తను రాణిగా కూడా ఉన్నప్పటికిని, ప్రభువు యెదుట తన్నుతాను తగ్గించుకొని, మూడు రోజులు ఉపవాసము ఉండి తన ప్రజల కొరకు ప్రార్థించినది. తన ప్రజలైన యూదులు నశించిపోకుండా వారి కొరకు ఎంతో భారముతో ప్రార్థించినది. ఎస్తేరు యొక్క ప్రార్థనలు అన్నిటిని దేవుడు సఫలపరచియున్నాడు. అదేవిధముగా, ప్రభువు నన్ను కూడా ఎస్తేరు ప్రార్థనా బృందమును ప్రారంభించునట్లుగా చేశాడు. ఆ యొక్క ఎస్తేరు ప్రార్థనా బృందమును బట్టి, ఎంతో మంది దీవించబడ్డారు. నేను అన్నిటిని ప్రభువు హస్తములకు సమర్పించాను. వేలకొలది మంది దీవించబడులాగున ఈ ఎస్తేరు ప్రార్థనా బృందమును అద్భుత రీతిగా నడిపించబడడానికి సహాయము చేసియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా అదేవిధముగా చేయండి, దేవుని యందు భయభక్తులు కలిగి యుండండి. ఆయన మహిమార్థమై సమస్తమును జరిగించండి. ప్రభువు యెదుట ఆయనకు ఇష్టకరమైన జీవితమును కలిగియుండండి. అప్పుడు మీరు కూడా సమృద్ధిగా దీవించబడతారు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా యొక్క ప్రశస్తమైన ప్రేమగల తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును మేము నీ హస్తములకు సమర్పించుకుంటున్నాము. దేవా, మేము ఏమి చేసినను, నీకిష్టమైన క్రియలను జరిగించునట్లుగాను, సత్‌క్రియలు చేయునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మా పనుల భారమును నీ మీద వేయుటకు మాకు కృపనిమ్ము. ప్రభువా, నీవు మా పట్ల ఏదైతే, యిష్టపడుచున్నావో అదే విధముగా, మేమును జరిగించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మేము చేయునదంతయు వర్థిల్లునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ యొక్క పరిపూర్ణ చిత్తానుసారంగా మమ్మును నడిపించుము. దేవా, మా ఉద్దేశములన్నిటిని నీవు సఫలపరచుము. ప్రభువా, మేము ఎస్తేరు రాణివలె మా కుటుంబము కొరకు మరియు మా ప్రియులగువారికి ప్రార్థించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము ఏది చేసినను, అది వర్ధిల్లి నీ నామమునకు మహిమను, ఘనతను తీసుకొని వచ్చువారముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.