నా ప్రియమైన స్నేహితులారా, ఇది నూతన సంవత్సరము, అయితే, మీలో ఎంతమంది నిజంగా సంతోషముగా ఉన్నారు? అని చూచినట్లయితే, మీలో అనేకులు మీ ప్రియులను కోల్పోయి ఉండవచ్చును, అది మీ హృదయమును విరిచివేసి ఉండవచ్చును. కొన్ని సంవత్సరముల క్రితము మన ప్రియులను కోల్పోయి ఉండవచ్చును. అయితే, అది మీలో ఎంతో బాధను కలుగజేయుచున్నది. మీలో అనేకులు ఈ రోజు అటువంటి పరిస్థితులలో ఉండి ఉండవచ్చును. మీరు కోల్పోయిన ప్రియులను బట్టి మీ హృదయము విరిగిపోయి ఉండవచ్చును. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 16:22వ వచనము ద్వారా మీకు సెలవిచ్చుచున్నాడు. ఆ వచనము, "...మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు'' అని చెప్పబడిన ప్రకారము అవును, మీకు ఆనంద దినములు కలుగబోవుచున్నవి. కనుకనే, మీరు భయపడకండి.
నా ప్రియులారా, నేడు మీ జీవితములో కోల్పోయిన మీ ప్రియుల స్థానమును ఎవ్వరు కూడా నింపలేరు. అయితే, ఆ వ్యక్తి లేకపోయినను, జీవితమును కొనసాగించగలిగే సమాధానమును దేవుడు మీకు నేడు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము గొప్ప సంతోషమును మీకు కలుగజేయుచున్నది. పరలోకమునకు వెళ్లినప్పుడు, ఆ వ్యక్తిని కలుసుకుంటాము అన్న ఒక గొప్ప సంతోషమును కలుగజేయుచున్నది. కాబట్టి, చింతించకండి, నా ప్రియ స్నేహితులారా, మీ హృదయమును బ్రద్ధలు కానివ్వకండి. తన సంతోషముతో మిమ్మును నింపుతానని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 30:5వ వచనములో చూచినట్లయితే, "ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును'' ప్రకారము సాయంకాలమున ఏడ్పు వచ్చినను, ఉదయమున సంతోషము కలుగుతుంది. అవును, మీ రాత్రులు కన్నీటితో నిండియుండవచ్చును. ఈ రోజు అవి ఆగిపోయి ఉండవచ్చును. కానీ, ప్రభువు తన సంతోషముతోను మరియు సమాధానముతోను మిమ్మును నింపుచున్నాడు.
నా ప్రియులారా, 'అయ్యో, నాకెన్నో మంచి దినములు నేను చూచుచున్నాను. అయితే, రానున్న దినములలో నాకు చెడు ఎదురవుతుందేమో?' అని ప్రజలు అంటుంటారు. కానీ, ప్రభువు ఇచ్చు సంతోషము మీ జీవితాంతము కొనసాగుతూనే ఉంటుంది. దుర్దుదినములు మీకు ఎదురైనప్పటికిని దేవుని సమాధానము మిమ్మును ఆవరించుచున్నది. ఎవ్వరు ఆ సంతోషమును మీ యొద్ద నుండి తీసుకొనలేరు. ఇది ఎంతటి అద్భుతమైన వాగ్దానము కదా! కనుకనే, నేడు మీరు దుఃఖపడుచున్నట్లయితే, నేడు మీ హృదయములను సంతోషముతో నింపుచున్న దేవుని హస్తములకు అప్పగించినట్లయితే, నిశ్చయముగా దేవుడు తన యొక్క సంతోషముతో మిమ్మును నింపుతాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా హృదయము బాధతో నిండియున్నది, మా ప్రియులను కోల్పోయి, హృదయమును విరిగిపోయిన స్థితిలో ఉన్నది. కనుకనే, మా మీదికి నీ యొక్క సమాధానము దిగివచ్చునట్లుగా చేయుము. తండ్రీ, మా విరిగిన హృదయాన్ని మరియు మా కన్నీళ్లను నీవు చూస్తున్నావు. దేవా, మా ఆనందాన్ని తిరిగి ఇస్తావని నీ ప్రేమపూర్వక వాగ్దానానికి వందనాలు. ప్రభువా, మా యొక్క బాధాకరమైన జ్ఞాపకాలు మమ్మును ముంచెత్తినప్పుడు దయచేసి మమ్మును నీ యొక్క సమాధానముతో నింపుము. దేవా, నీ యొక్క దైవీకమైన శక్తితో ఈ జీవితాన్ని కొనసాగించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా దుఃఖాన్ని నిన్ను విశ్వసించడం ద్వారా మాత్రమే వచ్చే పరిపూర్ణ ఆనందంతో సరిసమముగా చేయుము. దేవా, మా యొక్క ప్రతి కఠినమైన దినమున నీ సమాధానముతో మమ్మును ఆవరించుము. ప్రభువా, మమ్మును పరిపూర్ణంగా స్వస్థపరచడానికి మేము నిన్ను నమ్ముచున్నాము. దేవా, మా దుఃఖదినములు సమాప్తములగునట్లుగా చేసి, మా దుఃఖమును సంతోషముగా మార్చుమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


