నా ప్రియమైనవారలారా, నేడు దేవుడు మీ కొరకు సమృద్ధియైన మేలులను సిద్ధపరచియున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 32:40వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు ఎల్లప్పుడు మీకు మేలులను జరిగిస్తాడు. మా జీవితములో చూచినట్లయితే, 1985 సంవత్సరములో, కారుణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌స్ అను కారుణ్య విశ్వవిద్యాలయమును ప్రారంభించమని ప్రభువు మా నాన్నగారితో చెప్పినప్పుడు, ఆయన పరిచర్య ద్వారా ఆశీర్వదించబడిన లక్షలాదిమంది ప్రజలు, దేవుని యొక్క ఈ ప్రణాళికకు ఎంతగానో ఆనందించారు. కానీ, తాము సువార్తను ప్రకటించుచున్నామని చెప్పుకున్న ఒకరు లేక ఇద్దరు వ్యక్తులు, మా నాన్నగారికి వ్యతిరేకంగా మాట్లాడటం మరియు పత్రికలలో వ్రాయడం ప్రారంభించారు. అయినప్పటికిని, మా నాన్నగారి యొక్క పుట్టినరోజు సందర్భముగా, ఆయన ఎంతో వ్యాధిపడకలో బలహీనంగా ఉంటూ, మరణమునకు చేరువయ్యారు. తద్వారా, మేము ఎంతగానో బాధను అనుభవించాము. కానీ, మా భవిష్యత్తు ఏమిటో మాకు ఏమియు కూడా తెలియలేదు అని చింతించాము. అటువంటి సమయములో మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ మా తండ్రిగారి మీదికి దిగివచ్చెను.

యేసు ప్రభువు ఎంతో ఆదరణతోను, నిరీక్షణతోను ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు, మాతో యేసు ఇలాగున తెలియజేసెను, " నా పిల్లలారా, లక్షలాదిమంది మిమ్మును ప్రేమించుచున్నారు. అయినను, నేను మిమ్మును ప్రేమించుచున్నాను. కానీ, మీ దృష్టి, మీ మీద అబద్ధాలు చెప్పుచున్నవారి మీదను మరియు అపవాది మాటలను పలుకుచున్న ఆ ఇద్దరు లేదా ముగ్గురు దుష్ట వ్యక్తుల మీదనే ఉన్నది. అయితే, ఆ మాటలను నీవు విన్నావు కనుకనే, సాతాను నీ మూత్రపిండములను నాశనం చేయడానికి అది వీలు కల్పించినది. కానీ, ఈ రోజే, మీరు నా వైపు తిరగండి. మీరు నా వైపు తిరిగి, మీ పట్ల నాకున్న ప్రేమను అనందించండి. తద్వారా, మీరు లక్షలాదిమంది ప్రజల ప్రేమను ఆనందించి, అనుభవించండి. దుష్ట ప్రజలు మిమ్మును ఎంత ఎక్కువగా శపించినట్లయితే, నేను మిమ్మును అంత అధికముగా ఆశీర్వదించెదను'' అని మాతో చెప్పెను. ఆలాగుననే, దేవుడు మా తండ్రిగారిని వ్యాధిపడక నుండి పైకి లేవనెత్తి, ఆయనకు ఒక నూతన మూత్రపిండమును అనుగ్రహించియున్నాడు; ఆ తర్వాత, ఆయన మరో 28 సంవత్సరములు సజీవముతో ఈ లోకములో జీవించి, దేవుని పరిచర్యను కొనసాగించారు. నేడు, భారతదేశంలో దేవుని మహిమ కొరకు ఒక స్మారక చిహ్నంగా, 'కారుణ్య విశ్వవిద్యాలయం' నిలిచియున్నది. అవును, నా ప్రియ స్నేహితులారా, కనుకనే, మీరు దేనికిని భయపడకండి. సాతాను మరియు దుష్టులు మీ మీద ఒకదాని వెంబడి ఒకటిగా కీడులు మోపినప్పటికిని, దేవుడు మాత్రం మీకు ఒకదాని వెంబడి ఒకటిగా మేలులనే జరిగిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీ దుఃఖమును సంతోషంగాను మరియు మీ యొక్క శాపములను ఆశీర్వాదములుగాను, ఇంకను మీకు విరోధముగా లేచు ప్రతి వ్యతిరేకతను గొప్ప ఫలభరితంగా మారుస్తాడు. అప్పుడు, మీరు సమృద్ధిని పొందుకొని అనుభవించెదరు. ఇది మీ పట్ల దేవుని వాగ్దానమై యున్నది. కనుకనే, భయపడకండి.

బైబిల్ నుండి యోహాను 1:16వ వచనములో చూచినట్లయితే, " ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి'' అని చెప్పబడినట్లుగానే, మీలో ఉన్న యేసు పరిపూర్ణతను బట్టి మీరు ఒకదాని వెంబడి ఒకటిగా ఆశీర్వాదములను పొందుకుంటారు. ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 23:6వ వచనములో చూచినట్లయితే, " నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' అని ప్రకటించుచున్నది. నా ప్రియులారా, దేవుని ఈ మంచితనం ప్రతి శాపాన్ని, ప్రతి దుఃఖాన్ని, దుష్టుల మరియు సాతాను యొక్క ప్రతి దుష్టక్రియలను నాశనం చేయుచున్నది. దేవుని మంచితనం మరియు మేలులు మీలోనికి వచ్చినప్పుడు, జ్ఞానం కూడా మీలోనికి దిగివస్తుంది. అందుకే బైబిల్ నుండి యాకోబు 1:17వ వచనములో చూచినట్లయితే, " శ్రేష్ఠమైన ప్రతియావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు'' అని చెప్పబడినట్లుగానే, ప్రతి మంచి యీవియు పై నుండి వచ్చునని చెప్పబడియున్నది. రెండవదిగా, దేవుని మంచితనం మీకు ఆశ్రయంగా మారుతుంది. అందుకే బైబిల్ నుండి నహుము 1:7వ వచనములో చూచినట్లయితే, " యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును'' అని చెప్పబడినట్లుగానే, శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మూడవదిగా, బైబిల్‌లో రోమీయులకు 8:28వ వచనములో చూచినట్లయితే, " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' అని చెప్పబడియున్నట్లుగానే, మీకు సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగును. నా ప్రియులారా, మీ మీదికి వచ్చుచున్న కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. మరియు నాలుగవదిగా, బైబిల్ నుండి మత్తయి 7:11వ వచనములో చూచినట్లయితే, " పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన పిల్లలకు మంచి యీవులను ఇస్తాడు. ఆలాగుననే, బైబిల్ నుండి లూకా 11:13వ వచనములో చూచినట్లయితే, " పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' ప్రకారముగానే, ఆయన వాటన్నింటికంటే గొప్ప మంచి యీవియైన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పబడియున్నది. అవును, నా ప్రియులారా, మీ జీవితంలో ఒకదాని వెంబడి ఒకటిగా ఎన్నో మేలులు నేడు మీకు కలుగును గాక. అవును, మీ జీవితములో కూడా ఒకదాని వెంబడి ఒకటిగా ఎన్నో మేలులు జరగాలంటే, మీ దృష్టిని యేసుపై ఉంచినప్పుడు, ఆయన మిమ్మును సమృద్ధియైన మేలులతో నింపుతాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మాకు మేలు చేయక మానవని మాపట్ల నీవు చేసిన నిత్య నిబంధనకు నీకు వందనములు. ప్రభువా, మాకు విరోధముగాను రూపింపబడు యే ఆయుధము కూడా వర్థిల్లకుండా చేయుము. యేసయ్యా, మా జీవితములో దుఃఖము మరియు నిరుత్సాహం ఎదురైనప్పుడు, మా దృష్టిని నీ మీదనే నిలిపి ఉంచడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క అద్భుతమైన శక్తితో మాకు వ్యతిరేకంగా పలికిన ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుము. ప్రభువా, మా యొక్క ప్రతి బాధను, నష్టం, మరియు పోరాటం మా జీవితంలోని నీయొక్క మంచితనానికి మరియు మేలులకు సాక్ష్యంగా మారునట్లుగా కృపను అనుగ్రహించుము. యేసుప్రభువా, నీ యొక్క జ్ఞానం, శాంతి మరియు పరిశుద్ధాత్మ ఆనందంతో మరియు సమృద్ధియైన దీవెనలతో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క మంచితనం మరియు కనికరమును మా జీవితకాలమంతా మమ్మును వెంబడించునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క ప్రణాళికను విశ్వసించి, నీ యొక్క శాశ్వతమైన ప్రేమలో ఎల్లప్పుడూ ఆనందించడానికి మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.