నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:16వ వచనమును మనము ధ్యానించుకొనుచున్నాము. ఆ వచనము, " నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును '' అని చెప్పబడినట్లుగానే, మన పక్షమున ఎల్లప్పుడు వాదించుటకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. అవును, నా ప్రియులారా, ఈ లోకములో ఒక ఉత్తరవాది యొక్క ఎంతో ప్రాముఖ్యమైనది. ఏదైనా ఒక కోర్టు కేసు ఉన్నప్పుడు, మన పక్షమున వాదించుటకు మన పక్షమున ఒక న్యాయవాదిని పెట్టుకుంటాము కదా. కారణము, వారికి న్యాయవిధులన్నియు తెలుసు. ఆలాగుననే కోర్టు కేసులను గురించి సమస్తమును తెలుసు. కనుకనే, వారు మన పక్షమున నిలువబడి పోరాడుతాడు. న్యాయమూర్తి యెదుట మన గురించి అన్నియు చక్కగా తెలియజేస్తాడు. అయితే, ఆ కేసును గురించిన చివరి తీర్పు న్యాయమూర్తి ఇస్తాడు.
అయితే, నా ప్రియులారా, కొన్నిసార్లు, అత్యంత ప్రాముఖ్యమైన సమయములలో న్యాయవాది మనలను విడిచిపెట్టవచ్చును. అది ఒత్తిడి మూలముగా అయి ఉండవచ్చును. లేక మనము తగిన ఫీజు చెల్లించలేకపోవచ్చును. లేక వారికి ఏమైనా బెదిరింపులు ఎదురైనట్లయితే, వారు మనతో ఉండి ఇక ముందు సాగలేక మరియు మన పక్షమున వాదించలేరు. అప్పుడు మనము వేరొక న్యాయవాదిని వెదకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఈ వచనములో మనము చూచినట్లయితే, మనతో ఎల్లప్పుడు వాదించుటకు ఒక న్యాయవాది మన పక్షమున ఉన్నాడు. గనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి. కానీ, నేటి వాగ్దానము మనలను ఎన్నటికిని విడువని ఒక ఉత్తరవాదిని గురించి తెలియజేయుచున్నది. ఆయన మన పక్షమున ఎల్లప్పుడు న్యాయవాదిగా ఉండి, మన కొరకు దేవుని వాదిస్తాడు.
నా ప్రియులారా, ఒకరోజు మనము న్యాయమూర్తియైన దేవుని యెదుట నిలువబడియున్నప్పుడు, మన జీవితములో మనము చేసిన పనులన్నిటిని బట్టి తీర్పు తీర్చు న్యాయమూర్తి యెదుట మనము నిలువబడినప్పుడు, ఈ ఉత్తరవాది మన పక్షమున నిలువబడి, మన కొరకు మాట్లాడుతాడు. అవును, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మన జీవితములో మనము ఏదైనా పాపము చేయుచున్నప్పుడు లేక మనము శోధింపబడినప్పుడు, మనము ఎంతగానో శోధనలకు నెట్టివేయబడుచున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆ పాపములను గురించి మనలను హెచ్చరిస్తాడు. ఇది చేయకూడదు, అక్కడికి వెళ్లవద్దు, ఇది మాట్లాడవద్దు అని చెబుతాడు. ఆ పాపము చేయకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను కాపాడుతాడు. మనము ఎంతగానో శోధింపబడినప్పుడు, ఆ శోధనను జయించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతా డు మరియు మనం పాపంలో పడకుండా కాపాడతాడు. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క కార్యముల వైపు మనలను నడిపిస్తాడు.
నా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును మనకు నిత్యము జ్ఞాపకము చేసి, మన హృదయాలను ప్రభువుకు సంబంధించిన కార్యముల వైపు నడిపిస్తాడు. మనము ప్రార్థించలేనప్పుడు, మన కొరకు ఆయనే మన పక్షమున విజ్ఞాపనము చేస్తాడు. పరిశుద్ధ జీవితమును జీవించునట్లుగా ఆయన మనలను నడిపిస్తాడు. మనము ప్రభువుకు చెందినవారమని మనకు ఎల్లప్పుడు జ్ఞాపకము చేస్తుంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటూ, నీతి మార్గంలో నడవడానికి సహాయపడతాడు మరియు మనలను తండ్రికి మరింత సన్నిహితంగా చేరుస్తాడు.
అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఈ పరిశుద్ధాత్ముడు, మన ఉత్తరవాదియై ఉంటున్నాడు. మీ జీవితములో మీకు తోడుగా ఉండి, మిమ్మును నడిపించాలని, మిమ్మల్ని బలపరచాలని మరియు మీకు సహాయం చేయాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇప్పుడే ఆయనను మీ జీవితాలలోనికి ఆహ్వానించండి మరియు ఆయన నిత్యమైన సన్నిధిలోని ఆనందమును అనుభవించండి. ఆలాగుననే, ఎల్లప్పుడు ఆయన మీతో కూడా ఉండునట్లుగా, ఆయనను మీరు వేడుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ పక్షమున వ్యాజ్యమాడి మిమ్మును నేటి వాగ్దానము నుండి దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా నిత్య సహాయకుడు మరియు ఉత్తరవాదియైన పరిశుద్ధాత్మ అనే అమూల్యమైన వరమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ప్రభువా, మా పక్షమున వాదించుటకు నీవు ఇచ్చిన న్యాయవాదిని బట్టి నీకు వందనములు. దేవా, మా పక్షమున మాట్లాడడానికి మరియు మా జీవితమును నడిపించడానికి మరియు మా జీవితములో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించుటకు నీవు పంపిన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనములు. ప్రభువా, నీ చెంతకు మమ్మును చేర్చు పరిశుద్ధాత్ముని, పాప రహితమైన జీవితమును జీవించునట్లుగా చేయుచున్న దేవా, నీకు వందనములు. దేవా, మేము నీ బిడ్డలమని నిరూపించు దేవుడవుగాను, నీకు ఇష్టమైన జీవితమును, మరియు నీతిగల జీవితమును జీవించుటకు మాకు సహాయము చేయుము, దేవా, ప్రతిరోజు నీ ప్రేమతో మమ్మును నింపుము. ప్రభువా, పాపపు మార్గములో నడుచునప్పుడు, దోషారోపణ చేయుచున్నప్పుడు, మరియు నీతి మార్గాలలో నడవనప్పుడు, నీ స్వరమును వినునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మా శోధనను జయించి, పరిశుద్ధమైన మరియు నీకు ప్రీతికరమైన జీవితమును గడుపునట్లుగా మమ్మును బలపరచుము. ప్రభువా, మేము నీకు చెందినవారమని ప్రతిరోజు మాకు గుర్తుచేసి, మా హృదయాలను మీ సమాధానముతోను, మీ సన్నిధితో నింపుము. దేవా, మేము తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నీ పరిశుద్ధాత్మ మమ్మును నడిపించి, కాపాడి, మా పక్షమున న్యాయము తీర్చుము. ప్రభువా, ప్రతిరోజూ నీవు మాకు మరింత సమీపముగా చేర్చుకొని, నీ ప్రేమను మేము అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


