నా ప్రియ సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:13వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు'' అని సెలవిచ్చిన ప్రకారము క్రీస్తుయేసునందు ఆయన రక్తము వలన మనము ఆయనకు ఇప్పుడు సమీపస్థులమై యున్నాము. బైబిల్ నుండి "అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకొని యున్నాము'' అని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. మనలను ప్రభువు యొద్దకు తిరిగి తీసుకొని రావడానికై యేసు ప్రభువు ఆ సిలువపైన త్యాగము చేసి, మరణించవలసి వచ్చినది. పాతనిబంధన కాలములో పాపములను క్షమింపబడడము కొరకై పశువులను యాజకులు బలి ఇచ్చేవారు. అయితే, యేసుక్రీస్తు మనందరి పాపములు క్షమించబడుట కొరకై సిలువలో తన స్వంత రక్తమును కార్చియున్నాడు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు10:20వ వచనములో చూచినట్లయితే, "ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది '' ప్రకారము యేసయ్య రక్తము వలన మనలను తనకు సమీపముగా తెచ్చుకొనియున్నాడు. ఆయన మనతో సమాధానమును కలిగియున్నాడు. మన పాపములు ప్రభువు యొద్ద నుండి మనలను దూరపరచియున్నవి. అయితే, యేసయ్య రక్తము వలన మనకు ప్రభువుతో సమాధానమును కలిగియున్నది. అందుకే మనము ధైర్యమును కలిగియున్నాము. నేటి వాగ్దానమైన ఎఫెసీయులకు 2:13వ వచనములో కూడా అదే చెప్పబడియున్నది. యేసయ్య, మన సమాధానముకర్తగా ఉన్నాడు. తండ్రికి మనకు మధ్యలో ఉన్న అడ్డంకులను తొలగించివేశాడు. యేసయ్య యొక్క త్యాగము వలన చిందించబడిన రక్తము వలన మనము క్షమించబడియున్నాము. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 3:25లో మనము అదే చూడగలుగుచున్నాము, " పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను'' అని చెప్పబడియున్నది. ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన కలదు.
మా స్వంత కుటుంబములో ఇదే అనుభవమును మేము పొందుకొనియున్నాము. మా తల్లిగారికి క్యాన్సర్ వ్యాధి వచ్చియున్నప్పటికిని, మా కుటుంబము అంతయు అందునుబట్టి వేదనపడ్డాము. మా తండ్రిగారు కూడా ఎంతగానో చింతించారు. 3 సంవత్సరములు మా అమ్మగారితో పాటు ఆ వెల్లూరు హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఒకరోజు మా నాన్నగారు ప్రభువుకు తన హృదయమును సమర్పించారు. కనుకనే, అక్కడ ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో ఉన్నటువంటి ధ్యానగదికి మా నాన్నగారు వెళ్లారు. ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ఆయన ఎంతగానో ఏడుస్తూ మొఱ్ఱపెట్టారు, మోకరించి ప్రార్థించారు, నేల మీద పడి సాష్టాంగపడ్డారు, ' ప్రభువా, నా హృదయమును నీకే సమర్పించుచున్నాను, నీవు నా భార్యను స్వస్థపరచుము!' అని ఆయన ఎంతగానో దేవుని సన్నిధిలో వేడుకున్నారు. ఆ ధ్యానగదిలో నుండి మా తండ్రి ఏడ్చి, మొఱ్ఱపెట్టుట ఆ మార్గము నుండి వెళ్లుచున్న మా తల్లిగారు చూశారు. మా నాన్నగారి యొక్క మార్పు కొరకు మా అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేసేవారు. అయితే, ఆ సయములో, తన భర్త మోకరించి, ప్రభువు సన్నిధిలో ప్రార్థించుట చూచినప్పుడు, ఆమె ఎంతగానో ఆనందముతో ప్రభువును స్తుతించారు. ఆ రోజు తనకు ఎంతో ఆనందమును కలిగించిన రోజు అని మాతో చెబుతుండేవారు. అవును, నా ప్రియులారా, యేసయ్య రక్తము వలన మనము తండ్రి యొక్క సింహాసనమునకు దగ్గరగా చేరగలుగుతాము. ఆ తర్వాత మా కుటుంబము పైకి ఒక దీవెన వెంబడి ఒక దీవెన వచ్చినవి. నాకు ఒక దైవజనునితో వివాహము చేయబడినది. మా సహోదరి, సహోదరుడు కూడా ఎంతగానో దీవించబడ్డారు. నేను మరియు నా యింటివారును కూడా ప్రభువును సేవించెదము అని మేము ధైర్యముగా చెప్పగలిగాము. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, అవును, యేసు క్రీస్తు యొక్క రక్తములో ఎంత గొప్ప శక్తిని కలిగియున్నది. యేసయ్య రక్తము లేనిదే ఎప్పటికి మన పాపములు క్షమించబడలేవు. కనుకనే, మనము ఏమైయున్నామో అది దేవుని రక్తము వలన అయియున్నాము. మా ఆంటిగారు, ఎల్లప్పుడు, 'యేసు రక్తము' అని చెబుతుంటారు. తన గృహమునకు ఎవరైనను వచ్చినను కూడా సరే, వారి తల మీద నూనె రాసి, 'ఇది యేసు రక్తము స్వస్థత పొందుకొనుము' అని చెబుతుంటారు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 1:7 వచనములో చూచినట్లయితే, "అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును'' అని చెప్పబడిన ప్రకారము యేసు రక్తము ద్వారా మన యొక్క సమస్త పాపముల నుండి మనలను శుద్ధి చేయుచున్నది. కనుకనే మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తారా? నా ప్రియ స్నేహితులారా, యేసయ్య రక్తమును ఎంతమాత్రము మీరు నిర్లక్ష్యము చేయకండి. మీ పాపములు మిమ్మును దూరపరుస్తాయి. అయితే, మా తండ్రిగారు ప్రభువును క్షమించమని అడిగి ప్రార్థించిన రీతిగానే, నేడు మీరు కూడా మీ పాపములను క్షమించమని ఆయనను అడిగినట్లయితే, ఆయన మీ పాపములను తప్పకుండా తన రక్తము ద్వారా క్షమిస్తాడు. కాబట్టి, ప్రియులారా, ఇప్పుడే, ప్రభువునకు మొఱ్ఱపెట్టండి, ఇప్పుడు తన రక్తము ద్వారా మిమ్మును పరిశుద్ధపరచుచున్నాడు. కనుకనే, యేసయ్య నామమున పలుకండి, 'యేసయ్యా, నన్ను క్షమించండి' అని మొఱ్ఱపెట్టండి. ఇప్పుడే మీ హృదయమును ఆయనకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ పాపములను క్షమించి, మిమ్మును దేవునికి సమీపస్థులనుగా చేసి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమాకనికరములు గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తానికి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మా ప్రభువైన యేసయ్యా, మా పాపములను క్షమిస్తావని చెప్పినందుకై నీకు వందనాలు. తండ్రి, పాపములో చిక్కుకొనియున్న మా ప్రియులైన వారి యొక్క పాపములను మరియు మా పాపములను క్షమించుము. కనికరముగలిగిన మా దేవా, నీ కనికరమును మా మీద కనుపరచి, మా పాపములను క్షమించుము. ప్రభువా, మా శోధనలు నీ యొద్ద నుండి మమ్మును దూరంగా తీసుకొని వెళ్లకుండా యేసయ్య, నీ రక్తము మేము నీకు సమీపముగా వచ్చునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. యేసయ్య, నీ రక్తములో ఉన్న శక్తి ద్వారా మా పాపములను కడిగి శుద్ధీకరించి, పరిపూర్ణముగా నూతనమైన వారినిగా మమ్మును మార్చుము. యేసయ్య, నీవు మాలో ఉన్న ధైర్యమును మేము కలిగియుండునట్లుగా నీ కృపను నిమ్ము. దేవా, మా చెడు అలవాట్ల నుండి మేము బయటకు వచ్చునట్లుగాను, మమ్మును రూపాంతపరచుము. ప్రభువా, ప్రతి పాపం మరియు ప్రతి అపరాధాన్ని మా నుండి తొలగించి, నీ కుమారుని యొక్క రక్తములో శక్తి మా జీవితంలో స్వస్థత మరియు విడుదలను తీసుకొని వచ్చునట్లుగాను, మా బాధలో మమ్మును తాకి ఓదార్చునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క క్షమాపణ ఈరోజు మా హృదయాన్ని నింపుము. దేవా, మాలోని పాపం మరియు భయం యొక్క ప్రతి సంకెళ్ల నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, మరొకసారి మేము నీ దగ్గరికి వచ్చునట్లుగా మమ్మును పవిత్రంగా, ఆనందంగా మరియు నీ సమాధానముతో నింపుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


