నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయడము నాకు ఎంతో సంతోషము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి దానియేలు 6:22వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.'' అవును, ఆలాగుననే, మనము కూడా దేవుని దృష్టికి నిర్దోషులముగా కనబడవలెనని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. ఒకవేళ, మీరు ఏ తప్పును చేయనే చేయకపోయినప్పటికిని కూడా, మీరు నశించిపోవుచున్నాము అన్నట్టుగా మీరు బాధపడుచున్నారా? మీరు మీ పనులన్నిటి కూడా ఎంతో యథార్థముగా చేయుచుండవచ్చును, మీ చుట్టు ఉన్న ప్రజలందరి పట్ల ఎంతో చక్కగా ఉంటుండవచ్చును, అందరికి సహాయపడుచున్నప్పటికిని, అన్ని పనులు మంచి ఉద్దేశముతో చేయుచున్నను, అప్పుడు కూడా మీకు వ్యతిరేకముగా ప్రజలు కుట్ర చేయుచున్నారా? అవాస్తమైన ఆరోపణలు మీ మీద చేయుచున్నారా? తప్పుడు కోర్టుకేసులను మీ మీద ఉంచుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుచున్నారా? మీ ఉద్యోగ స్థలములలో కేవలము మిమ్మును క్రిందికి లాగివేయడము కొరకు నూతనమైన నియమములను ఒకవేళ ప్రజలు తీసుకొని వస్తున్నారేమో? కేవలము మిమ్మును లక్ష్యముగా చేసుకొని, మీకు హాని కలుగచేయుటకు, మీ కొరకు నూతన నియమములను పెట్టుచున్నారేమో? కానీ, నా ప్రియ స్నేహితులారా, ఈ వచనములో మనము చదివిన రీతిగానే, ఒకవేళ ప్రజలు మిమ్మును బాధించవలెననియు ప్రయత్నించినప్పటికిని, ఏదియు మీకు ఎంతమాత్రమును హాని కలుగచేయనేరదు. దేవుని దృష్టిలో మీరు నిర్దోషులుగా కనబడతారు కనుకనే, మీకు ఏ హాని కూడ కలుగదు.
భక్తుడైన దానియేలునకు కూడా అదే జరిగినది. అతడు ఒక ప్రార్థనపరుడైనటువంటి ఒక వ్యక్తి. అతడు దైవీకమైనటువంటి పనులన్నిటిని కూడా చక్కగా నెరవేర్చియున్నాడు. అయితే, అతని చుట్టు ఉన్న ప్రజలు అతనిని ఏ విధముచేతనైనను క్రిందకు త్రోసివేయాలని ప్రయత్నించ సాగారు. కానీ, దానియేలును నశింపజేయాలన్న ఒకే ఒక ఉద్దేశముతో నూతన నియమమును పెట్టించాడు. దానియేలునకు ఆ నియమము కూడా తెలుసు. అయినప్పటికిని కూడా అతడు ప్రార్థనను కొనసాగించుచున్నాడు. రోజుకు మూడుసార్లు అతడు ప్రార్థించేవాడు. అతడు ప్రభువును మాత్రమే ఇష్టపెట్టుచూ, విధేయత కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. అయితే, ఆ నియమమును బట్టి రాజుకు వేరే మార్గము ఏదియు లేక దానియేలును సింహపు బోనులో వేయవలసి వచ్చినది. అతను ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినది. అయితే, ప్రభువు దానియేలు పక్షమున ఉన్నాడు. ప్రభువు తన దూతలనంపించి, సింహములు దానియేలుకు ఏ హానియు చేయకుండా, వాటి నోళ్లను మూయించి వేసియున్నాడు. అందుకే బైబిల్ నుండి దానియేలు 6:22వ వచనములో మనము అదే చదవగలుగుతాము, " నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను'' అని చెప్పియున్నాడు.
అవును, నా ప్రియులారా, ప్రజలు మనలను అపార్థము చేసుకొని, తప్పుడు ఆరోపణలు మన మీద వేయుచూ, మనకు హాని చేయాలని ప్రయత్నించినప్పుడు ప్రభువు మన పక్షమున ఉండి యుద్ధము చేస్తాడని ఈ కధ మనకు తెలియజేయుచున్నది. ఎవ్వరు కూడా మీకు ఎంతమాత్ర ము హాని చేయలేరు. ఎందుకనగా, ప్రభువు దృష్టిలో మీరు నిర్దోషులుగా కనబడు చున్నారు. అయితే, దానియేలును చూచినప్పుడు, అతడు తన్ను తాను నిర్దోషులుగా కనబరచుకోలేదు. మరియు నేను ఏ తప్పు కూడా అస్సలు చేయలేదని వారి యెదుట ఏమి చెప్పలేదు. చూడండి, నేను చేసినది ఇది మాత్రమే, నేను ఈ తప్పులేవియు కూడా చేయనే లేదు అని ఆలా చెబుతూ, తన్ను తాను నిర్దోషునిగా కనుపరచుకోలేదు. కానీ, ప్రభువు అతని యొక్క శత్రువులందరి మధ్యలో కూడా దానియేలును ఘనపరచియున్నాడు. దానియేలు ఆరాధించుచున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని ప్రభువు అందరికి కనపరచు కున్నాడు. దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు అని అందరి యెదుట కనపరచియున్నాడు. ఏ దేవునికైతే, దానియేలు విధేయుడుగా ఉండియున్నాడు. అదే విధముగా, దేవుడు మీ శత్రువుల యెదుట ఈ రోజు మిమ్మును ఘనపరచబోవుచున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు మీ జీవితములో ఉన్నటువంటి సింహములను చూచి మీరు ఒకవేళ భయపడుచున్నారేమో? మేము నీతిగల జీవితమును జీవించుచున్నాము, ఎందుకు మాకు ఈలాగున జరుగుచున్నదని అంటున్నారేమో? లేక మీపైన వేయబడియున్నటువంటి తప్పుడు నేరారోపణలు, తప్పుడు కేసులను చూచి మీరు ఎంతగానో భయపడుచున్నారేమో? కానీ, ఏదియు మీకు ఎంతమాత్రము హాని చేయదు. ఏది మిమ్మును బాధపరచదు. ఏదియు కూడా మీ పేరును చెరిపివేయలేదు. మీ జీవితమును ఎవ్వరు కూడా నశింపజేయలేరు. ఎందుకనగా, ప్రభువు దృష్టిలో మీరు నిర్దోషులుగా కనబడతారు. గనుకనే, ప్రభువే మీ యుద్ధములన్నిటిని పోరాడుతాడు. అంతమాత్రమే కాదు, మీ యొద్దకు వచ్చుచున్న సింహముల యొక్క నోళ్లను ప్రభువు మూయించివేస్తాడు. మిమ్మును భద్రంగా కాపాడుతాడు. కాబట్టి, నా ప్రియులారా, ధైర్యముగా ఉండండి. భయపడకండి. ప్రభువే మీ పక్షమున ఉన్నాడు. ఆయనకు వందన ములు చెల్లించి, ప్రార్థించుదామా? మేము మా విశ్వాసమును గట్టిగా పట్టుకున్నాను, ప్రభువు చెప్పిన మాటలన్నిటిని గట్టిగా పట్టుకున్నాము, అయినను, మాకు ఎందుకు ఈలాగున జరుగుచున్నది అని అనుకుంటున్నారేమో, అంతా మాకు వ్యతిరేకముగా మరియు విరోధముగా జరుగుచున్నది అని అనుకుంటున్నారేమో, అయితే, మీరు దానియేలు వలె దేవునికి భయభక్తులు కలిగియున్నట్లయితే, నిశ్చయముగా దానియేలును దీవించిన దేవుడు మిమ్మును దీవిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా యొక్క నిర్దోషత్వమును ఋజువు చేయుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, ఈ రోజు మా చుట్టు జరుగుచున్న విషయాలను చూచి, మేము భయముతోను, దిగులు చెందియున్నాము. దేవా, మేము ఎదుర్కొంటున్న సింహముల నుండి కాపాడుటకు మాకు నీ దేవదూతలను కాపుదలగా పంపించుము. దేవా, మాకు వ్యతిరేకముగా ఉన్నటువంటి సింహముల నోళ్లను మూయించి, మా జీవితములో ఒక చిన్న గీత కూడా మా మీద పడకుండా, మమ్మును కాపాడుము. దేవా, మేము నీ ద్వారా కాపాడబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ బిడ్డలమన్న పేరును నీవు మాకు కలుగజేయుము. యేసయ్యా, మేము నిన్ను సేవించుచున్నామని ఇతరులకు తెలియపరచుము. దేవా, నీవు జీవముగలిగినటువంటి దేవుడవు గనుకనే, నేడు నీవు మా పక్షమున ఉన్నావనియు, మా యుద్ధములన్నిటిని పోరాడుచున్నావని మేము గుర్తెరుగునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీవు మా పక్షమున ఉండి, మా యుద్ధములను పోరాడే జీవముగల దేవుని సేవించే నీ పిల్లలుగా మాకు మంచి పేరు దయచేయుము. దేవా, మమ్మును ఆశీర్వదించి, నిన్ను గట్టిగా పట్టుకోవడానికి మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


