నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:16వ వచనమును తీసుకొనబడినది. ఈ వచనమును చదవడము మనకు ఎంత సంతోషమో కదా! ఆ వచనము, " మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని ఆలయముగా పిలువబడడము మనకు ఎంతో గొప్ప భాగ్యమై ఉంటున్నది కదా! అవును, " మనము దేవుని ఆలయముగా ఉన్నామనియు'' ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, దేవుడు మనలో నివసించాలి అనగా, మన దేహమును ఎంత పరిశుద్ధముగా ఉంచుకోవాలి కదా! అతి చిన్న పాపము కూడా ఈ దేవాలయమును నశింపజేయగలుగుతుంది. ఆ తదుపరి వచనమును మనము చూచినట్లయితే, అనగా 1 కొరింథీయులకు 3:17లో దేవుని వాక్యము అదే ఈలాగున సెలవిచ్చుచున్నది, "ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, మనము విలువపెట్టి కొనబడివారమై ఉంటున్నాము. ఇంకను దేవుడు తన స్వరక్తము చేత మనలను క్రయధనమును ఇచ్చి కొనియున్నాడు. కనుకనే, ఈ దేవాలయము దేవునికి ఎంతో ప్రశస్తమైనదిగా ఉంటున్నది. మనము దానిని సుళువుగా మరియు చులకనగా, ఎంతమాత్రము చూడకూడదు. నా ప్రియ స్నేహితులారా, మనము పరిశుద్ధముగా జీవించాలి, 'ప్రభువా, మాలో ఏదైన తప్పిదము ఉన్నదా? అని అడగాలి? ప్రభువా, మా ధ్యానము మరియు మా నోట నుండి వచ్చు మాటలన్నియు కూడా నీకు ఇష్టముగా ఉండునట్లుగా చేయుమని' ప్రభువుకు మనము ప్రార్థన చేయాలి. దేవుడే దిగివచ్చి, మనలో నివసించునట్లుగా అన్నిటికంటె ఎక్కువగా మనము ఆయనను ప్రార్థించాలి.

అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:9వ వచనములో చూచినట్లయితే, "దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావముగలవారే గాని శరీర స్వభావముగలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు'' అని సెలవిచ్చుచున్నది. ఆ ప్రకారముగానే, నా ప్రియులారా, దేవుడు తన ఆత్మతో మనలను నింపునట్లుగాను, మనము ఆయనను వేడుకొనవలెను. అప్పుడు మాత్రమే మనము దేవుని ఆత్మచేత నడిపింపబడినవారముగా ఉంటాము. అదే వచనములో దేవుని వాక్యము ఈలాగున అంటున్నది కదా! చూడండి, "దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావముగలవారే గాని శరీర స్వభావముగలవారు కారు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన ప్రేమచేత మన జీవితాలను తన అదుపులో ఉంచుకోవడమును బట్టి మనము దీవించబడినవారముగా ఉంటున్నాము. అందుకే, బైబిల్ నుండి రోమీయులకు 5:5 వ వచనములో చూచినట్లయితే, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది'' అని చెప్పబడినట్లుగానే, మన మీద ఉన్న మహా ప్రేమను బట్టి, దేవుడు తన పరిశుద్ధాత్మతో మనలను నడిపిస్తాడు. తనకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి, ప్రభువు మనలను తన ప్రేమలో నడిపించుచున్నాడు. కనుకనే, మనము ఏ విధము చేతనైనను కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండ ఆయన మనకు సహాయము చేస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:17వ వచనములో దేవుని వాక్యము ఈలాగున అంటున్నది, "ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును'' అని చెప్పబడినట్లుగానే, మన స్వభావము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. ఇంకను, 'నేను చాలా జ్ఞానవంతుడను/ జ్ఞానవంతురాలను అని అనుకోకూడదు. నాకున్న ఈ లోక జ్ఞానముతోను, ఈ లోక ప్రమాణముతో నేను జీవించెదను అని అనుకొనకూడదు.' ఎందుకనగా, ఈ లోకము జ్ఞానము దేవుని దృష్టిలో వెఱ్ఱితనముగా ఉంటున్నది. కనుకనే, దేవుడు మనలను నింపినప్పుడు, మనము ఎన్నడు కూడా శరీరము చేత నడిపించబడడానికి ఆయన మనలను అనుమతించడు. ఆయన తన ఆత్మచేత మనలను నడిపిస్తాడు. అందుకే, పౌలు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడు తన కృపను బట్టి ఎంత చక్కగా నడిపించుచున్నాడు కదా! దేవుడు మనలను తన ఆత్మతో నింపినప్పుడు మహిమోన్నతమైన సన్నిధానముతో మనము నింపబడతాము.

అందుకే బైబిల్ నుండి 1 రాజులు 8:10,11వ వచనములో చూచినట్లయితే, "యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవచేయుటకు నిలువలేకపోయిరి'' అని చెప్పబడినట్లుగానే, సొలొమోను రాజు దేవుని మందిరమును ప్రతిష్టించినప్పుడు, దేవుని యొక్క తేజోమహిమ ఆ మందిరమును నింపెను. అదేవిధంగా, నా ప్రియులారా, మన దేహములను మనము దేవునికి సజీవయాగముగా ఆయనకు ప్రతిష్టించినప్పుడు, ఆయన తన మహిమతో మనలను నింపుతాడు.

ఆలాగుననే, నా ప్రియులారా, బైబిల్ నుండి యోహాను సువార్త 2:19-21వ వచనములలో చూచినట్లయితే, " యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమును గూర్చి యా మాట చెప్పెను.'' అందుకే యేసు, " నా దేహము దేవుని ఆలయమై యున్నదని'' సెలవిచ్చినట్లుగానే, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పినది, ఆయన తన శరీరమును గురించి చెప్పియున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రజలు అసూయతో ఆయనను చంపుతారు అని ఆయనకు తెలుసు. ఆయన మరణమవుతాడు అని ఆయన ముందుగానే ఎరిగియున్నాడు. మూడు దినములలో మరల ప్రభువు తనను లేపుతాడు అని ఆయనకు తెలుసు. ఆయన యొక్క భావము అర్థము అదియే అయి ఉన్నది. యేసయ్య, మన కొరకు సిలువలో మరణించియున్నాడు కనుకనే, మూడవ దినమున మరల లేచియున్నాడు గనుకనే, తనతో పాటు మన శరీరములను కూడా మరల లేపుతాడు నా ప్రియ స్నేహితులారా, మన శరీరములు మృతి చెందడానికి ఆయన అనుమతించడు. మనము పరిశుద్ధంగా ఉంటాము. మనము మరింత పరిశుద్ధంగా మార్చబడతాము. మనము నీతిమంతులుగా ఉంటాము. మనము మరి ఎక్కువగా నీతిమంతులముగా మారిపోతాము. ఏ అపరాధ భావము లేకుండా, ఏ మచ్చయైనను, ముడతయైనను మనలో ఎంత మాత్రము ఉండదు. ఆయన రెండవసారి మరల వచ్చినప్పుడు, మనము ఆయనను ఎదుర్కొనునట్లుగా, ప్రభువు మనలను సిద్ధపరుస్తాడు. మీరు సిద్ధముగా ఉన్నారా? నా ప్రియ స్నేహితులారా, మన దేహములను పరిశుద్ధమైన యాగముగా ఉంచడములో మనము ఎంతో జాగ్రత్త వహించేవారముగా ఉండాలి.

నా ప్రియులారా, బైబిల్ గ్రంధములోని భక్తులు చెప్పిన రీతిగానే, 'ప్రభువా, నేను ప్రజలకు మరియు నీకు మధ్యలో ఉండి సేవ చేయుచున్నాను' అని చెప్పినట్లుగానే, మీరు కూడా ప్రభువు సేవ కొరకై మీ దేహములను ప్రభువు సేవ కొరకై సమర్పిస్తారా? ప్రభువు వాడుకొనడానికి మీ శరీరములను ఎంత అధికముగా సమర్పిస్తారో, అంత అధికమైన కృప మీకు అనుగ్రహింపబడుతుంది. మీ శరీరములోని ప్రతి బలహీనత మిమ్మును విడిచి వెళ్లిపోతాయి. మీరు సింహము వలె ధైర్యవంతులుగా మారిపోతారు. మనలో ఉన్న అభిషేకము ఎంతో గొప్ప వ్యత్యాసమును తీసుకొని వస్తుంది. మీరొక వ్యత్యాసమైన వ్యక్తులుగా మారిపోతారు. రాజైన సౌలు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, అతడు ప్రవచించుటకు మొదలు పెట్టియున్నాడు. అతడు నూతన వ్యక్తిగా మారిపోయాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును కూడా వాడుకుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడండి, మీ దేహమును పరిశుద్ధముగా ఉంచుకొనండి. మీరు సింహము వలె ధైర్యముగా గర్జిస్తారు. రానున్న దినములలో దేవుడు మిమ్మును అత్యధికముగా నింపి, బలంగా వాడుకొనును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును నీ ఆలయముగా మార్చినందుకై నీకు వందనము. దేవా, నీకు ప్రీతిలేని కార్యములన్నిటిని మా నుండి, మా హృదయమును, మనస్సును, శరీరాన్ని శుభ్రపరచుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి, మమ్మును బలముగా వాడుకొనుము. దేవా, ఈ లోకము నీవిచ్చు శక్తిని అర్థము చేసుకొనలేకపోయినను, నీ యొక్క మహా కృపను బట్టి, నీ పరిశుద్ధాత్మ వరములన్నిటితో మమ్మును నింపుము. ప్రభువా, వ్యత్యాసమైన రీతిలో మమ్మును వాడుకొనుచు, ఈ లోకములో మేము సూచనలుగాను, అద్భుతములుగా ఉండునట్లుగా చేయుము. దేవా, యేసయ్యను నీ ఆత్మతో మమ్మును నింపినట్లుగానే, మమ్మును కూడా నీ సేవను చేయడానికి కొలతలేని ఆత్మతో నింపుము. ప్రభువా, మేము ప్రవచించేవారినిగాను, అద్భుతములు చేయువారినిగా మమ్మును మార్చుము. దేవా, మా దేహములు నీకు ఆలయముగాను మరియు పరిశుద్ధంగాను మార్చి, మమ్మును నీ యొక్క పరిశుద్ధతతోను మరియు సమృద్ధి కృపతో నింపుము. యేసయ్యా, మేము శరీరానుసారంగా జీవించకుండా, ప్రతిరోజు నీ యొక్క ఆత్మచే నడిపించబడునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితం, మా మాటలు, మా క్రియలు నిన్ను మహిమపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, నీ రాజ్యం కొరకు మమ్మును వాడుకొనుమని, నీ మహిమగల రాకడ కొరకు మమ్మును సిద్ధపరచుము. పభువా, మాలో ఉన్న మచ్చలు, అపరాధ భావములు, తప్పిదములన్నియు మా నుండి తొలగించి, నీ హస్తములో వాడబడుటకు అర్హులుగా ఉండునట్లుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.