నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 14:14వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో మనము చదివినట్లుగానే ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.'' యాంప్లిఫైడ్ వెర్షన్ ప్రకారము, 'మనము కేవలం ఊరకయే, నెమ్మదిగా యుండవలెను' అని చెప్పబడియున్నది. "బీ కామ్'' 'నిశ్చింతగా లేక నిర్మలముగా ఉండండి' అని ముద్రించిన టీ-షర్టులను నేను చూశాను. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు మనలను ఊరక ఉండమని ప్రోత్సహించుచున్నప్పుడు, వారు ఆ విధంగా నిశ్చింత ఉండమని చెబుతున్నప్పుడు, దేవుని వాక్యము మనకు ఇంకెంతగా నమ్మకముగా చెబుతుంది కదా! దేవుని యందు మనము కలిగియున్న ధైర్యమే మనము నిశ్చింతగాను, ఊరకయే ఉండునట్లుగా సహాయము చేయుచున్నది. ప్రజలు మనతో పోరాడునప్పుడు లేదా మనము ఎదురుచూడని సమస్యలు మన చుట్టూ ఆవరించినప్పుడు మనము దేనిని గురించి నిరాశ చెందనవసరము లేదు, మరియు దేనిని గురించి చింతించనక్కరలేదు. మనము కలవరపడవలసిన లేదా కోపముతో రగిలిపోవలసిన అవసరము కూడా లేదు. దానికి బదులుగా, బైబిల్ ఇలాగున చెబుతుంది, 'మీరు ఊరకయే, నెమ్మదిగా ఉండినట్లయితే చాలు.' 'ఊరకయే యుండి, ఆయన దేవుడని తెలుసుకోండి' అని చెబుతుంది.

నా ప్రియులారా, నేడు మీరు ఊరక నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. మీరు నిశ్చింతగా ఉన్నప్పుడు, దేవుడు అనుగ్రహించిన రక్షణను చూడండి. బైబిల్‌లో యూదా రాజైన యెహోషాపాతు పైకి ఒక మహా సైన్యము దండెత్తి వచ్చినప్పుడు, అతడు దేవునికి ఎలా ప్రార్థించాడు? అని 2 దినవృత్తాంతములు 20:12వ వచనములో మనము చూచినట్లయితే, అతడు దేవుని శక్తిని, సామర్థ్యమును గుర్తించి, ఆయన సహాయము కొరకు ఇలాగున మొరపెట్టియున్నాడు: "మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను '' అని చెప్పబడినట్లుగానే, అతడు తన దృష్టిని దేవుని వైపు ఉంచాడు.

ఇంకను బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 20:17వ వచనములో మనము చదివినట్లుగానే, ప్రభువు అతనికి ఇలాగున జవాబిచ్చాడు, "ఈ యుద్ధములో మీరు పోట్లాడ వలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.'' ఈ యుద్ధములో మీరు పోరాడనక్కర్లేదు అని చెప్పాడు. ఆయన ఇంకా ఇలాగున అంటున్నాడు, "మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు.'' అవును, ప్రియ స్నేహితులారా, మీ పక్షమున ప్రభువే యుద్ధం చేయును. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడు మీరు చేయవలసినదంతయు, స్థిరంగా నిలువబడండి, ప్రభువు కలుగజేయు విడుదలను మీ కళ్లతో చూడండి.

నా ప్రియులారా, ప్రభువు ఈ వాగ్దానమును ఇచ్చినప్పుడు, ఆయన రాజైన యెహోషాపాతు పక్షమున యుద్ధము జరిగించాడు. అమ్మోనీయులును మోయాబీయులును శేయారు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి; వారు శేయారు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చూడండి, నా ప్రియులారా, ఆ యుద్ధము యెహోషాపాతుది కాదు, యెహోవాదే! అవును, ఆయన తాను చెప్పిన మాట స్థిరపరచి, యెహోవా యెహోషాపాతు పక్షమున ఆ యుద్ధమును జరిగించియున్నాడు. రాజు మరియు అతని ప్రజలందరు కలిసి ఉపవాసముండి ప్రార్థించారు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు దేవుని శక్తిని నమ్ముతూ, ఆయనను స్తుతించి ఆరాధించారు. దేవునిని కీర్తించుచూ, వారు పరిపూర్ణమైన విశ్వాసముతో తమ శత్రువులను ఎదుర్కొనుటకు బయలుదేరెను.

నా ప్రియులారా, అందుకు ప్రతిఫలముగా, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన శత్రువులు హతులైరి. ప్రజలు యుద్ధ భూమిని చూడటానికి వెళ్ళినప్పుడు, తమ శత్రువులు ఓడిపోయారని తెలుసుకున్నారు. వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొని, యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు! అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 20:29వ వచనములో చూచినట్లయితే, "ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగానే, వారి చుట్టు ఉన్నవారందరికి దేవుని భయము వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను'' అని చెప్పబడినట్లుగానే, యెహోవా ఇశ్రాయేలీయుల శత్రువులతో ఎలాగున పోరాడి యుద్ధము చేసియున్నాడని ప్రజలు విన్నప్పుడు రాజ్యములన్నియు దేవునికి భయపడినవి. అవును, నా ప్రియ స్నేహితులారా, "నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను'' అని చెప్పబడినట్లుగానే, మనతో యుద్ధము చేయువారితో దేవుడే యుద్ధము చేస్తాడు. చూడండి, మనకు ఎంతటి ప్రేమగల దేవుడు ఉన్నాడు కదా! అవును, నా ప్రియులారా, మనము మానవ బలముపై నమ్మకము ఉంచకూడదు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 20:7వ వచనములో చూచినట్లయితే, "కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములనుబట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. వారు క్రుంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము'' అని దావీదు చెప్పినట్లుగా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడవలెను. అవును, నా ప్రియులారా, దేవుని యందు మనము నమ్మకము ఉంచినప్పుడు, ఆయన యందు మాత్రమే నమ్మకము కలిగియుండుట ద్వారా మనము మన యొక్క ప్రతి పోరాటమును సుళువుగా జయించగలము. అంతమాత్రమే కాదు, మిగతా కార్యములన్నిటిని దేవుడే చూసుకుంటాడు. నేడు కూడా, నా ప్రియులారా, మీరు మీ పక్షమున దేవుడు తెర వెనుక ఉండి కార్యములను జరిగించుచున్నాడని నాకు తెలుసు.

నా ప్రియులారా, రాజైన యెహోషాపాతుకు తన శత్రువులు ఎదురుగా వచ్చినప్పుడు ఏమి జరుగుతుందని తెలియదు. అదేవిధంగా, ఐగుప్తీయుల సైన్యము వెనుక నుండి తరుముచూ వచ్చుచుండగా, ఇశ్రాయేలీయులు విశాలమైన ఎర్ర సముద్రము యెదుట నిలువబడినప్పుడు, ప్రభువు వారి కొరకు ఏమి చేయబోవుచున్నాడని వారికి ఏమాత్రము కూడా తెలియదు. వారు ఎఱ్ఱ సముద్రములో చిక్కుకుపోయారనియు; దేవుడు తమ కొరకు ఎలా మార్గము చూపుతాడని వారు ఊహించలేకపోయారు. కానీ, నా ప్రియులారా, ప్రభువు ఎర్ర సముద్రమును రెండుపాయలుగా చీల్చి, ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడుచునట్లుగా చేశాడు. అదేవిధంగా, ఎటువంటి మార్గము లేదనిపించే చోట కూడా దేవుడు మీ కొరకు ఒక మార్గమును సిద్ధపరుస్తాడు. ఆయనను నమ్మండి, నెమ్మదిగా ఉండండి, అప్పుడు ఆయన కల్పించే గొప్ప విడుదలను మరియు రక్షణను మీ కన్నులారా, మీరు చూచెదరు! నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే మా పరాక్రమశాలివి, మరియు మా సహాయకుడవు. ప్రభువా, నీవు మా జీవితములోని ప్రతి యుద్ధములో పోరాడి, కష్టాలన్నిటిని, వ్యాధులను, కోర్టు కేసులు మరియు శత్రువుల నుండి మమ్మును విడిపించుము. దేవా, మాతో పోరాడుచున్న వారితో నీవు పోరాడి, ప్రతి అవమానమును, నిందను మా నుండి తొలగించుము. ప్రభువా, మా యొక్క ప్రతి పరిస్థితిలో మాకు విజయమును అనుగ్రహించి మరియు మా యొక్క ప్రతి తీర్పు మాకు అనుకూలముగా ఉండునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ప్రతి బాధ నుండి మమ్మును కాపాడుము. యేసయ్యా, మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లకుండా చేయుము. దేవా, మాకు వ్యతిరేకంగా పన్నిన ప్రతి పన్నాగమును ఓడిపోవునట్లుగాను మరియు మా జీవితములో నీ గొప్ప శక్తిని ప్రత్యక్షపరచునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.