నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 2:10వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానంద భరితులై యింటిలోనికి వచ్చిరి '' ప్రకారము ఎవరు ఆ నక్షత్రమును చూశారు? ఆ నక్షత్రము ఎటువంటిది? అని చూచినట్లయితే, బైబిల్ నుండి మత్తయి 2:1,2వ వచనములను చదివినట్లయితే, "రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి'' అని తెలియజేసినట్లుగానే, సర్వశక్తిమంతుడైన దేవుడే వారిని నక్షత్రము ద్వారా నడిపించి, యేసు క్రీస్తు పుట్టినటువంటి స్థలమునకు ఆయన వారిని తీసుకొని వచ్చాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, ఆ నక్షత్రమువలె అనేకులను ఆయన యొద్దకు రప్పించే మిమ్మును ఒక అద్భుతమైన సాధనముగా ప్రభువు వాడుకుంటాడు. నక్షత్రము ఒక అందమైన చిహ్నము.
అదేవిధముగా, బైబిల్‌లో అబ్రాహామునకు పిల్లలు లేరు. అనేక సంవత్సరములు గతించిపోయినను అతడు ముసలివాడైనప్పటికిని కూడా తన భార్య ద్వారా అతనికి బిడ్డలు కలుగలేదు. ఆ సమయములో దేవుడు అతనితో మాట్లాడాడు. బైబిల్ నుండి ఆదికాండము 15:5వ వచనములో చూచినట్లయితే, " మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను'' ప్రకారము దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినట్లుగానే, ఆయన అతనిని ఆశీర్వదించియున్నాడు. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి మత్తయి 1:1-17వ వచనములలో చూచినట్లయితే, అబ్రాహాము యొక్క వంశావళిని మనము చదువగలుగుతాము. అబ్రాహాము దేవుని మాటను నమ్మియున్నాడు. అదేవిధముగా, జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును నమ్మి, దానిని వెంబడించియున్నారు. చివరిగా, యేసు పుట్టిన స్థలమును వారు చూచి, యేసుక్రీస్తును వారు ఆరాధించియున్నారు.
ఆలాగుననే, బైబిల్ నుండి దానియేలు 12:3వ వచనములో చూచినట్లయితే, " బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు'' అని చెప్పబడిన ప్రకారముగా, ఎవరు అనేకులు నీతిమార్గము వైపు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నా ప్రియులారా, ఈ లోకములో మీరు నక్షత్రమువలె ప్రకాశించగలరు. అంధకారములో ఉన్నటువంటి వారిని మరియు పాపములో నడుస్తున్నవారిని మీరు విడిపించి రక్షించగలరు. మీరు ఒక నక్షత్రము వలె ప్రకాశించగలరు. ఇంకను బైబిల్ నుండి ఫిలిప్పియులకు 2:14-16వ వచనములలో చూచినట్లయితే, "...మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు'' ప్రకారము మీరు జీవముగల దేవుని వాక్యమును చేత పట్టుకొన్నట్లయితే, లోకములో అనేకులను దేవుని యొద్దకు నడిపించు జ్యోతుల వలె ప్రకాశించెదరు. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడు ప్రభువుకు సమర్పించుకొని, అనేకులను యేసుక్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చు నక్షత్రమువలె చేయుమని ప్రభువును అడిగినట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ప్రకాశించునట్లుగా చేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన :
మా ప్రశస్తమైన ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈ సమయమునకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, మమ్మును అత్యానంద భరితులగునట్లుగా అనేకులను నడిపించే ప్రకాశవంతమైన తేజో నక్షత్రంవలె ఉన్నందుకై వందనాలు. ప్రభువా, నీ వాక్యమును వినుచున్న మా హృదయాలను తాకుము. యేసయ్యా, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించు విధముగా, మమ్మును కూడా వాడుకొనుము. ప్రభువా, జ్ఞానులను నీ సన్నిధికి నడిపించినట్లుగానే, ఇతరులను నీ వైపు నడిపించడానికి మా జీవితాన్ని కూడా నడిపించుము. దేవా, అనేకులకు వెలుగునిచ్చే నక్షత్రముగా మమ్మును ప్రకాశింపజేయుము. ప్రభువా, నీ మహిమార్థమై మమ్మును నీ కొరకు ప్రకాశించే నక్షత్రమువలె చేయుము. దేవా, ఈ చీకటి ప్రపంచంలో నీ వెలుగుతో ప్రకాశించడానికి మరియు మేము ఎక్కడికి వెళ్ళినా నీ ప్రేమను ప్రతిబింబించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీ దైవీక సన్నిధితో నింపగల పాత్రగా చేసి, మాలోని ప్రతి సందేహముగల ఆత్మను తొలగించుము. ప్రభువా, దయచేసి నీ సన్నిధి యొక్క ఆనందంతో మమ్మును నింపుము మరియు మా జీవితం ఇతరులను నీ హృదయానికి సమీపముగా ఆకర్షించే నక్షత్రంవలె ఉండునట్లుగా చేయుము. దేవా, నీ నీతిలో నడవడానికి మరియు అబ్రాహాము వలె విశ్వాసం కలిగి ఉండటానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీ మహిమ కొరకు మమ్మును ప్రకాశింపజేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


