నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 16:31వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు...'' అని చెప్పబడినట్లుగానే, మీరు ప్రభువైన యేసునందు విశ్వాసముంచాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసును గురించి చెప్పు అవకాశము మీకు ఎప్పుడైన వచ్చిందా? సువార్తను మీరు ఇతరులకు చెబుతున్నారా? అయితే, ఈ రోజు యేసును గురించిన సువార్తను మీరు అనేకులకు చెప్పుటకు ప్రయత్నించండి.

బైబిల్ గ్రంథములో పౌలు మరియు సీలలు సువార్త చెప్పడము వలననే, చెరసాలలో వేయబడడాన్ని మనము చూడగలము. చెరసాలలో వారు ఉన్నప్పటికిని, రాత్రివేళలో వారు దేవుని స్తుతించుచూ, పాడుచూ ఉండిరి. మధ్య రాత్రిలో కూడా ఆకస్మాత్తుగా, చెరసాల తలుపులన్నియు కూడా తెరుచుకొనబడియున్నవి. అంతమాత్రమే కాదు, ఆకస్మాత్తుగా, ఆ స్థలమంతయు మహా భూకంపము కలిగినది, చెరసాల పునాదులన్నియు అదిరెను. వెంటనే, చెరసాల తలుపులన్నియు కూడ తెరుచుకొనెను. పౌలు సీలల యొక్క బంధకములన్నియు ఊడిపోయి, పడిపోయినవి. తద్వారా, అందరు కూడా పారిపోయే అవకాశము ఉన్నది. కానీ, ఎవ్వరు కూడా పారిపోలేదు. అయితే, ఆ చెరసాల అధికారి, ఆ శబ్దమును విని, అందరు కూడా పారిపోయారు అనుకున్నాడు. 'అయ్యో, నేను నా ఉద్యోగమును కూడా కోల్పోతానేమో అని తలంచాడు.' అప్పుడు, ' పౌలు సీలలు మేమందరము ఇక్కడనే ఉన్నాము, నీవు భయపడవద్దు అని చెప్పారు. ' ఇవన్నియు జరగడము చూచిన తర్వాత, ఆ అధికారి, నేను రక్షణ పొందుకొనడానికి ఏమి చేయాలి? అని అడిగాడు. పౌలు సీలల నుండి దేవుని యొక్క వాక్యమును వినడానికి, అనగా సువార్తను ఆలకించడానికి తన యింటి వారినందరిని కూడా తీసుకొని వచ్చియున్నాడు. వారందరు కూడా ప్రభువునందు విశ్వాసముంచారు మరియు వారందరు కూడా బాప్తిస్మము పొందియున్నారు.

అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, మన జీవితములలో కూడా కష్టాలు, శ్రమలు ఎదురైనటువంటి సమయములలో మనము ఆయన యందు ఉంచిన విశ్వాసము వలన ప్రభువు మన జీవితములో కూడా అద్భుతములను జరిగిస్తాడు. ఆ అద్భుతముల వలన నిజమైన సజీవుడైన దేవునికి మనము సాక్షులముగా ఉంటాము. ఆ సంఘటనల మూలముగా, మీరు సేవించుచున్నటువంటి ప్రభువైన యేసును గురించి, మీ చుట్టు ఉన్న ప్రజలైన వారందరు కూడా తెలుసుకుంటారు.

నా ప్రియులారా, ఈ రోజు మీ జీవితములో జరిగినటువంటి విషయాలన్నిటిని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మీ విశ్వాసము ఎంత బలముగా ఉన్నది? మీకు జరిగినటువంటి అద్భుతముల మూలముగా, మీరు సేవించుచున్న దేవుడు సజీవుడు అని ప్రజలందరు తెలుసుకుంటారు. పౌలు మరియు సీలలు ఆ చెరసాలలో అధికారికి ఆ విధంగానే, ఒక సాక్ష్యముగా నిలిచియున్నారు. అవును, ఆ చెరసాలలో కూడా ఒక అద్భుతము జరిగియున్నది కాబట్టి. అతను మరియు అతని కుటుంబమంతయు రక్షణ పొందియున్నారు. ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా ఇతరులను ప్రభువులోనికి నడిపిస్తారు. వారిని మరియు వారి కుటుంబ సభ్యులందరిని కూడా ప్రభువు చెంతకు రక్షణలోనికి నడిపిస్తారు. ఈ రోజు అటువంటి విశ్వాసము కొరకు ప్రభువును వేడుకుందాము, 'ప్రభువా, మా విశ్వాసము ద్వారా జరుగు అద్భుతములు ఈ లోకములో నీ యొక్క శక్తికి సాక్ష్యముగా ఉండాలి అని అడుగుదాము. ఆలాగుననే, మీ జీవితము ద్వారా ప్రభువు అదే అద్భుతమును ఇతరులకు కూడా చేయబోవుచున్నాడు. ఈ విశ్వాసము కొరకు నేడు ఆయన సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించి పొందుకుందాము. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మాలో ఉన్న విశ్వాసము అద్భుతములను జరిగించునట్లుగా చేయుము. ప్రభువా, ఈ రోజు మేము నీ శక్తికి సాక్షులముగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, చెరసాలలోని పౌలు సీలలకు అద్భుతము జరిగిన రీతిగానే, మా విశ్వాసము కూడా అద్భుతములను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, అతి క్లిష్టమైన మరియు కష్టమైన పరిస్థితులలోను కూడా నీ శక్తిని చూపెట్టడానికి ఈ భూలోక పునాదులు కదిలింపబడునట్లుగా, నీ శక్తి మా పట్ల మరియు మా ద్వారా ఇతరుల పట్ల కనపరచబడునట్లుగా చేయుము. దేవా, ప్రజలు మాలో ఉన్న నీ యొక్క శక్తిని చూచి, వారు కూడా రక్షణలోనికి వచ్చునట్లుగా మరియు ప్రభువైన యేసువైన నీ యందు మేము మరియు ఇతరులు విశ్వాసముంచునట్లుగా చేయుము. ప్రభువా, మేమును మరియు మా యింటి వారందరును కూడా రక్షణ పొందునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా విశ్వాసమును బలపరచి, మా ద్వారా నీవు కార్యములను చేసి, నీ మహిమార్థమైన మమ్మును నీ బిడ్డలనుగా వాడుకొనుము. దేవా, మా యొక్క కష్టమైన పరిస్థితులలో కూడా మా ద్వారా నీ మహిమ ప్రత్యక్షపరచబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అత్యంత ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.