నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుచున్నప్పుడు, మనము ఆనందపు ఊటలను స్వీకరిస్తాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 41:15వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి యున్నాను...'' అని ఆయన మనతో మాట్లాడుచున్నాడు. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా ప్రభువు నేడు మనలను చేయాలని మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, యెషయా 41:15వ వచనమునకు ముందుగా మనము యెషయా 41:11,12 వ వచనములను మనము చదివినట్లయితే, " నీ మీద కోపపడిన వారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు మరియు నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు'' అని చెప్పబడినట్లుగానే, అనేకమంది శత్రువులు వచ్చి, మనలను మ్రింగివేయడాని కొరకై మనకు కీడు చేయుటకు మన మీదికి వచ్చినప్పటికిని, వారు ఒకవేళ మనకు విరోధముగా వలలు పన్నవచ్చును, వారు మనకు విరోధముగా కీడు చేయుటకు ప్రయత్నించి రావచ్చును. కానీ, "భయపడకుము'' ప్రభువు వెనువెంటనే, ఈలాగున సెలవిచ్చుచున్నాడు. 'మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు' అని జెకర్యా గ్రంథములో చెప్పబడినట్లుగానే, మీకు హాని చేయువారు, కేవలము వారు మీకే శత్రువులు కాదు, వారు దేవునికి కూడ శత్రువులుగా ఉన్నారు. మనము వారి మీద జాలి పడవలెను.
కానీ, నా ప్రియులారా, దేవునికి శత్రువులుగా ఉన్నవారికి ఏమి జరుగుతుందో మీకు తెలుసు కదా! వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు ఈ వచనము ద్వారా, ఆయన ఏమని తెలియజేయుచున్నాడంటే, "నేను మిమ్మును నురిపిడి మ్రానుగా చేయుదును,'' అనగా, బలమైన ఆయుధముగా, నూతనమైనదిగాను, అనేకమైన కక్కులు పెట్టబడినదిగాను, పదునైనదిగా మనలను నియమించుచున్నాడు. దేవుడు ఈ శత్రుత్వము మధ్యలో కూడా, అత్యంత శక్తివంతముగా మనలను చేయబోవుచున్నాడు. ఇస్సాకు గెరారు అను ప్రాంతమునకు వచ్చి, తన తండ్రియైన అబ్రాహాము తిరిగి మరల త్రవ్వించుచున్న సమయములో, అక్కడ అతడు చివరిగా త్రవ్వినప్పుడు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను. అప్పుడు శత్రువులైన గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. వారు అంతకుముందు ఆ బావిని త్రవ్వలేదు. కానీ నీరు వచ్చినప్పుడు మాత్రము దొంగిలించడానికి వచ్చారు. ఇస్సాకు వారితో యుద్ధము చేయలేదు గానీ, మరొక బావిని త్రవ్వుడానికి వెళ్లాడు. మరియొ స్థలములో అక్కడ కూడా అద్భుతకరముగా నీళ్లు వచ్చాయి. మరల శత్రువులు వచ్చారు. విడువకుండా, ఇస్సాకు ముందుకు కొనసాగుచుండెను. తదుపరి బావి యొద్దకు, ఇలాగున మరొక బావి దగ్గరకు వెళ్లుచూ ఉండెను.
మరియు చివరికి వారు, మనము ఎక్కడికి వెళ్లినను, మనము ఇతనిని ఆపుచేయలేకపోవుచున్నాము అని అనుకున్నారు. అతడు ఎక్కడికి వెళ్లినను సరే, అతడు త్రవ్విన బావులలో నుండి నీళ్లు పొంగి ప్రవాహముగా వచ్చుచుండెను. దేవుడు ఆ తర్వాత, ఇస్సాకును ప్రచండమైన రీతిలో ఆశీర్వదించాడు. రాజైన అబీమెలెకు సహితము అతని యొద్దకు వచ్చి, ఎవరు నీవు? అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యా పని యేమి? నీవు మాకు ఎటువంటి కీడును తలపెట్టవద్దు. ఎందుకంటే, నీవు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వస్తున్నావు. మాకంటె గొప్పవాడవుగా ఉన్నావు అని చెప్పాడు. అవును, నా ప్రియులారా, దేవుడు మీ శత్రువుల సహితము కూడా ఆలాగున చెప్పునట్లుగా చేయుచున్నాడు. రాజులు కూడా మీ గురించి మాట్లాడుకుంటా రు. మీరు బలమైన నురిపిడి మ్రానువలె ఉండునట్లుగా చేస్తాడు. దేవుని యొక్క మర్మయుక్తమైన ఆలోచనలు మిమ్మును వర్థిల్లింపజేయుచున్నవి, నా స్నేహితులారా, మిమ్మును శక్తివంతులనుగా చేయడానికి మరియు మిమ్మును దీవించుట ద్వారా, మనము ఇందు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించుచూ, దేవుని యొద్దకు వచ్చినట్లయితే, నిశ్చయముగా ఆయన మిమ్మును శక్తివంతులనుగా మారుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మమ్మును నీ బలమైన ఆయుధంగా చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, నిరాంతరాయముగా శత్రుత్వం గురించి చింతించకుండా, మేము ముందుకు కొనసాగుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మును అణిచివేయువారి నిమిత్తము మా శత్రుత్వం వలన మేము నిరుత్సాహపడకుండా, బాధించేవారి వలన కృంగిపోకుండా, మేము నీ చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, నీవు మమ్మును శక్తివంతమైన నూరుపడి మ్రానుగా మరియు నూతనంగా పదునైనదిగాను చేయుము. ప్రభువా, మేము శక్తివంతులుగా మారుటకు మాకు నీ యొక్క శక్తిని దయచేయుము. దేవా, మాలో విచారమును తీసివేసి, మాకు నూతన ఆత్మను అనుగ్రహించుము. ప్రభువా, దుఃఖాత్మను, ఏడుపు మరియు పోరాటాత్మను మాలో నుండి తీసివేసి, మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును ఉపయోగించుకొనుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పని వర్ధిల్లునట్లుగా చేయుము. ప్రభువా, మా బావుల నుండి నీళ్ళు ప్రవహించునట్లుగాను ప్రభువా, మేము అత్యధికంగా ఫలించునట్లు చేయుము. దేవా, రాజులు, సంస్థలు మరియు సమాజం కూడా మాకు భయపడునట్లుగా చేసి, మమ్మును వృద్ధిపొందింపజేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


