నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 13:16వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడ లెక్కింప వచ్చును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మిమ్మును మరియు మీ సంతానమును ఈ భూమి మీద విస్తరింపవలెనని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, సంతానము లేదని మీరు దిగులుపడకండి. దేవుడు నిశ్చయముగా మిమ్మును విస్తరింపజేస్తాడు.
అబ్రాహాము దైవజనుడుగా ఉండియున్నాడు. ఎంతో జాగ్రత్తగా అతడు దేవుని మార్గములను వెంబడించియుండెను. అయితే, అతనికి సంతానము లేదు. అతను మరియు అతని భార్యయైన శారాయి అనేక సంవత్సరములు బిడ్డలు లేకుండా ఉండిపోవలసి వచ్చినది. అయితే, ప్రభువు అబ్రాహాముతో ఈ విధంగా వాగ్దానము చేసియున్నాడు. ఆ వాగ్దానము బైబిల్ నుండి ఆదికాండము 22:17వ వచనములో చూచినట్లయితే, "నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కొందురు'' అని చెప్పబడినట్లుగానే, అబ్రాహాము ఎంతో జాగ్రత్తగా ప్రభువును వెదకినప్పటికిని, అనేక సంవత్సరములు అతను బిడ్డలు లేకుండా ఉండవలసి వచ్చినది. అయినను తన తండ్రియైన ప్రభువును ఎల్లప్పుడు గట్టిగా హత్తుకొనియున్నాడు. అందుకనే, ప్రభువు అబ్రాహామును ఈ విధంగా ఆశీర్వదించియున్నాడు, "నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను'' అని వాగ్దానము చేసియున్నాడు. ఆలాగుననే, అబ్రాహాము యొక్క సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించి, విస్తరింపజేసియున్నాడు. ఎంత గొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా!
అందుకే బైబిల్ నుండి మత్తయి 1:1-17వ వచనములలో ఉన్న లేఖములను చదివినట్లయితే, అక్కడ అబ్రాహాము యొక్క వంశావళిని మనము చదువగలుగుచున్నాము. మత్తయి 1:1,17వ వచనములలో, "అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు పదునాలుగు తరములు.'' చూడండి యేసుక్రీస్తు జన్మించునంత వరకు ఒకరి తర్వాత ఒకరు అబ్రాహాము యొక్క వంశావళిలో దైవీకమైన బిడ్డలు జన్మిస్తూనే ఉండియున్నారు. ఎన్ని సంవత్సరములు గడిచిపోయినను, అతని తరతరములు దీవించబడుతూనే ఉన్నవి. అదేవిధముగా, నా ప్రియులారా, మీరు కూడా అబ్రాహామువలె ప్రభువును యొక్క మార్గములను వెంబడించినట్లయితే, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నేడు మిమ్మును కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా స్నేహితులారా, ఒకవేళ మీరు సంతానము లేకుండా ఎంతో కాలము వేచియుండవచ్చును. అయితే, ఈ రోజు మొదలుకొని ప్రభువు మిమ్మును దీవించబోవుచున్నాడు. అబ్రాహాము ఎంతో జాగ్రత్తగా దేవునిని వెదకినట్లుగానే, నేడు మీరు కూడా దివారాత్రము దేవుని వెదకండి. అంతమాత్రమే కాదు, దేవుని వాక్యమును చదవండి. ప్రభువును మీరు గట్టిగా హత్తుకొని ఉండండి. మీకు అవసరమైనవాటన్నిటిని ప్రభువు సమకూరుస్తాడు. అబ్రాహామువలె మిమ్మును లేక్కకు మించి విస్తరింపజేస్తాడు. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా పట్ల నీవు చేయుచున్న అద్భుతమైన సమకూర్పును బట్టి నీకు వందనములు. దేవా, ఇప్పుడు నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. ప్రభువా, మేము అడుగువాటన్నిటిని అద్భుతమైన రీతిలో మాకు సమకూర్చుము. దేవా, ఎంతో కాలము సంతానము లేకుండా ఉన్న మమ్మును జ్ఞాపకము చేసుకొని, మమ్మును తాకి, అబ్రాహామువలె మేము దీవించబడునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితములో మాకు కావలసిన సమస్తమును సమకూర్చి, అబ్రాహామువలె మమ్మును మరియు మా సంతానమును ఆశీర్వదించుము. ప్రభువా, నిన్ను శ్రద్ధగా వెదకడానికి మరియు నీ మార్గములను మా పూర్ణ హృదయంతో అనుసరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ వాగ్దానములు నెరవేరడం కొరకు మేము వేచి ఉండవలసి వచ్చినప్పుడు కూడా నిన్ను హత్తుకొని ఉండునట్లుగా మమ్మును బలపరచుము. ప్రభువా, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మాకు అవసరమైనవన్నియు సమకూర్చుము. దేవా, ప్రత్యేకంగా సంతానం లేనివారిని జ్ఞాపకము చేసుకొని, నీ బలమైన హస్తముతో తాకి, అబ్రాహామువలె మమ్మును ఆశీర్వదించి, మా యొక్క దైవీకమైన కోరికలను నెరవేర్చుము. ప్రభువా, మా జీవితాలలో మరియు తరతరాలలో నీ ఆశీర్వాదములు విస్తరించునట్లుగా చేయుము. దేవా, మేము నీ కొరకు వేచి ఉన్నప్పుడు మాకు విశ్వాసము, నిరీక్షణ, బలము మరియు సమాధానమును అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


