నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 62:3వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంతటి అద్భుతమైన వాగ్దానము కదా! మన ప్రభువు చేతిలో మనము భూషణ కిరీటముగాను ఉన్నామని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ ఆశీర్వాదములన్నిటిని మనము ఎప్పుడు కలిగియుండగలుగుతాము? అని చూచినట్లయితే, మనము దేవుని బిడ్డలుగా మారినప్పుడు, అది కూడా మనము దేవుని పని చేయుచున్నప్పుడు మరియు మీరు దేవుని మహిమపరచు విధంగా, సాక్ష్యమిచ్చినప్పుడు, ప్రభువు మీ యందు ఇష్టపడతాడు. ఇంకను మనము యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించి మరియు ఆయన కొరకు జీవించినప్పుడు, ప్రభువు మిమ్మును అభిషేకించి, తన కిరీటమును మీకు ధరింపజేస్తాడు. అది కూడా పరిశుద్ధమైన కిరీటముగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథములోని యాజకులు మందిరములో పరిచర్య చేయుచున్నప్పుడు పరిశుద్ధమైన కిరీటాన్ని ధరించినట్లుగానే, బైబిల్ నుండి లేవీయులకు 8:9వ వచనములో మనము చూచినట్లయితే, " అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను'' ప్రకారము పరిచర్యచేయుచున్న యాజకులు ఆ బంగారు కిరీటమును ధరించేవారు. అది పరిశుద్ధమైన కిరీటము.

అవును, నా ప్రియులారా, మనము పరిచర్య చేయుచూ, దేవుని పనిని చేసినప్పుడు, ఆ విధంగా అభిషేకించబడతామని వాక్యము సెలవిచ్చుచున్నది. బైబిల్ నుండి 2 తిమోతికి 4:8వ వచనములో చూచినట్లయితే, " ఇకమీదట నా కొరకు నీతి కిరీట ముంచబడి యున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును'' అని వ్రాయబడియున్నది. నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని పరిచర్య చేసినప్పుడు, అనేకులు మీ గురించి చెడుగా మాట్లాడుచూ, నిందలు వేయవచ్చును. కానీ, వాటివైపు ఎన్నడును చూడకండి. దేవుని వాక్యమును చదవండి. ప్రభువు మిమ్మును సరైన సమయములో ఘనపరుస్తాడు. హల్లెలూయా! కొన్ని రోజులు కష్టము ఉండవచ్చును. కానీ, ఆ తర్వాత, ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. బైబిల్ నుండి 1 పేతురు 5:3,4వ వచనములలో మనము చూచినట్లయితే, " మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి; ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు'' అని చెప్పబడియున్నది. అదే విషయమును నేటి వాగ్దాన వచనములో మనము చదివియున్నాము. కాబట్టి, మీరు లేచి తేజరిల్లి, ప్రభువు పరిచర్యను చేయవలసినవారై ఉంటున్నారు. కనుకనే మీరు భయపడకండి.

బైబిల్ నుండి యెషయా 60:1వ వచనములో మనము చూచినట్లయితే, " నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను'' అని సెలవియ్యబడినది. కనుకనే నా ప్రియులారా, మీరు వ్యక్తిగతంగా ప్రభువునకు మీరు ఏదో ఒక పనిని చేయువారుగా ఉండాలి. కుటుంబముగా అందరు కలిసి, దేవుని మహిమార్థమై ఆయన కార్యములను మీరు చేయాలి. వ్యక్తిగతంగా లేదా కుటుంబంగా, ప్రభువు కోసం ఏదైనా చేయడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. అది ప్రార్థన కావచ్చును, సువార్తను పంచుకోవడం కావచ్చును, చర్చిలో సేవ చేయడం కావచ్చును లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కావచ్చును. అది ఏదైనా, మీ హదయపూర్వకంగా చేయండి, మరియు ప్రభువు సంతోషిస్తాడు. అప్పుడు ఈ వాగ్దానము చొప్పున ప్రభువు తగిన సమయములో మీకు భూషణ కిరీటమును ధరింపజేస్తాడు. కాబట్టి, మిమ్మును మీరు తగ్గించుకొని, మీ జీవితాలను ప్రభువు హస్తాలకు సమర్పించుకొనండి. ఇంకను మీరు ఈలాగున ప్రార్థించాలి, ' తండ్రీ, నేను ఏమి చేసినను దానిని ఆశీర్వదించుము, సరైన మార్గములో నన్ను నడిపించుము, నీ చిత్తమును మా జీవితములో జరిగింపజేయుము ' అదియే మీ ప్రార్థనయై యుండాలి. నా ప్రియులారా, ఇప్పుడు కూడా ప్రార్థించి, మీరు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొనండి. నిశ్చయముగా దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క మంచితనము, కృపలన్నిటిని బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభువా, నీ మహిమార్థమై మమ్మును నీ సేవలో వాడుకుంటున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు మమ్మును నీ బిడ్డగా పిలిచినందుకు కృతజ్ఞతలు. దేవా, మేము నిన్ను ఎల్లప్పుడూ మహిమపరిచే జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికిని మేము నీకు నమ్మకంగా సేవ చేయడానికి మమ్మును బలపరచుము. దేవా, నీ నీతి మరియు మహిమ కిరీటముతో మమ్మును అభిషేకించి, నీ రాకడ దినము వరకు నీ చిత్తములో మమ్మును ప్రతిరోజు నడిపించుము. ప్రభువా, ఈ వాక్యమును ధ్యానించే మమ్మును ఆశీర్వదించుము. యేసయ్యా, నీ పరిచర్య చేయుచున్న మమ్మును మరియు మా ప్రియులైన వారిని కూడా ఆశీర్వదించుము. దేవా, అనేక శ్రమలను మరియు కష్టాలను మరియు ఎన్నో నిందలు ఎదుర్కొంటున్న మా మీద నీ చేతిని ఉంచి, మాకు భూషణ కిరీటమును ధరింపజేయుము. ప్రభువా, మేము నీ కొరకు ఏ పనిని చేసినను, దానిని ఆశీర్వదించుటకు, మాకు ముందుగా నీవు వెళ్లి మమ్మును ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.