నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భమున దినకరన్ కుటుంబము తరుపున మరియు యేసు పిలుచుచున్నాడు కుటుంబము తరుపున మీకందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ఆలాగుననే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా సువార్త 2:11వ వచనమును వాగ్దానముగా తీసుకొనబడినది. ఆ వచనములో, " దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు'' అని చెప్పబడిన ప్రకారము దేవుని గొప్ప ఆశీర్వాదంతో ఈ క్రిస్మస్ పండుగను ఆనందంగా కొనియాడండి. మన కొరకు లోకరక్షకుడు పుట్టియున్నాడు అన్న ఈ యొక్క సువర్తమానము మనకు ఎంతటి గొప్ప సంతోషాన్ని కలుగజేయుచున్నది కదా! ఈ లోకానికి మాత్రమే కాదు, మీ కొరకు కూడా ఒక రక్షకుడు జన్మించియున్నాడు. ఆయనే మెస్సీయ్య, ఈ లోక రక్షకుడు. ఆయనే ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు.

నా కుమార్తె క్యాట్లిన్‌కు మొదటి సంవత్సరము జన్మదిన సందర్భమున, అది కోవిడ్ సమయము. అప్పటికి కోవిడ్ కాలం ముగించే సమయము, మేము బాతుల థీమ్‌తో కూడిన ఒక పుట్టినరోజు వేడుకను జరిగించాము. 'డక్ కేక్' అని మేము బాతుల ఆకారంలో ఉన్న ఒక కేక్‌ను చేయించాము. ఆ కేక్ నిజంగానే, మా చుట్టు నిజమైన బాతులు అటు ఇటు తిరుగుచున్నట్లుగానే అనిపించినది. ఆలాగుననే, మేము ఒక తోలుబొమ్మల ప్రదర్శన (పప్పెట్ షో)ను కూడా ఏర్పాటు చేశాము. ఆ సమయములో ఆటలు ఆడాము మరియు విందు ఏర్పాటు చేసి, మా బంధువులందరిని ఆహ్వానించాము. వారందరూ ఆ చిన్న పాపను చూడటానికి ఎంతగానో ఆశతో అందరు వచ్చారు. వారు ఎంతో ఉత్సాహముతో మా ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించి, మా కుమార్తె కొరకు విలువైన బహుమతులను తీసుకొని వచ్చి ఇచ్చారు మరియు ఆమెను చూడగానే ఎంతగానో సంతోషించారు. ఈ భూమి మీద ఉన్న ఒక చిన్న బిడ్డ పుట్టియున్నదను ఆనవాలు కొరకు ఇవన్నియు జరిగించబడినవి.

నా ప్రియులారా, ఆలాగుననే, ఈ లోక రక్షకుడు మీ కొరకు మరియు మా కొరకు ఈ భూమి మీద పుట్టియున్నాడు. కాబట్టి, మనం ఇంక ఎంత ఎక్కువగా సంతోషించాలి కదా? సర్వశక్తిమంతుడైన దేవుడు, పరాక్రమశాలియైన దేవుడు ప్రత్యేకంగా మనందరి కొరకు జన్మించియున్నాడు. అది మీ హృదయానికి ఇంకను ఎంతటి గొప్ప ఆనందాన్ని కలిగించాలి కదా! ఈ క్రిస్మస్‌కు ఆయన కోరుచున్నదంతయు, ఆయన అడుగుచున్న ఏకైక బహుమతి, మీ హృదయమే. తద్వారా, ఆయన దానిని ఆనందంతో నింపి మీలో నివసించగలడు. కనుకనే, యేసు మీలోనికి వచ్చినప్పుడు, మీ గాయాలు స్వస్థపరచబడతాయి, మీ బాధలు తొలగిపోతాయి మరియు మీరు గొప్ప స్వస్థతను, విడుదలను పొందుకుంటారు. అవును, నా ప్రియులారా, మనం మన ప్రేమ అంతటిని ఆయన మీద ఉంచినప్పుడు, మనం దీనిని అత్యంత ఆనందంతో జరుపుకోవాలి కదా? కనుకనే, ఇప్పుడు 'యేసయ్యా, నీవు మా కొరకు జన్మించినందుకై నీకు కృతజ్ఞతలు' అని చెప్పినట్లయితే, నిశ్చయముగా, ఈ క్రిస్మస్ దినము మీకు మరియు మీ కుటుంబాలలో ఈ క్రిస్మస్ ఆనందమును నింపుతుంది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును సంతోషముతోను మరియు ఆశీర్వాదములతో నింపును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవుమాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్య, మా కొరకు జన్మించినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీవు మా రక్షకునిగా మరియు మా ప్రభువుగా వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మా జీవితంలోనికి నీవు అడుగుపెట్టిన సర్వశక్తిమంతుడైన దేవుడవు నీవే, కనుకనే, ఈ క్రిస్మస్ పండుగ దినమున, మా హృదయాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, దయచేసి మాలోనికి వచ్చి నివసించుము. దేవా, మమ్మును నీవు పుట్టిన ఆనందంతో మమ్మును నింపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి గాయం స్వస్థపరచబడునట్లుగా చేయుము మరియు మా యొక్క ప్రతి బాధ తొలగిపోవునట్లుగా చేయుము. దేవా, ఈ రోజు మా జీవితంలోనికి నీ యొక్క స్వస్థతను మరియు విడుదలను తీసుకొని వచ్చునట్లుగాను, నీవు మా కొరకు జన్మించావు. కనుకనే, ఈ క్రిస్మస్ దినమున మేము నీలో ఆనందించునట్లుగా చేయుము. దేవా, నీ ద్వారా మేము పొందుకున్న ఈ గొప్ప రక్షణ చెప్పనాశక్యము కానీ వరమునకై నీకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.