నా ప్రియమైన వారలారా, దేవుడు నేడు మిమ్మును ఆనందింపజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 2:1వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలము కలిగెను నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును'' ప్రకారము దేవుడు మీ పట్ల ఆనందించుచున్నాడు. అందుకే ఆయన ఇలాగున అంటున్నాడు, " నువ్వు విలపించినది చాలు, భయపడిపోయింది చాలు.'' ఇంకను బైబిల్ నుండి యెహోషువ 6:1వ వచనములో చూచినట్లయితే, " ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను'' ప్రకారము యెరికో గోడలు గట్టిగా మూసివేయబడినందున ఇశ్రాయేలీయులు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఆలాగుననే, బైబిల్ నుండి 2 రాజులు 2:2వ వచనములో చూచినట్లయితే, " బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొనిపోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను'' అని చెప్పబడిన ప్రకారము ప్రవక్తల శిష్యులు ఎలీషాతో అతను ఒంటరిగా మిగిలిపోతాడని, భయపెట్టు మాటలు అతనితో మాట్లాడిరి. కనుకనే, నా ప్రియులారా, మన జీవితములో మీకు వ్యతిరేకంగా ప్రతికూల స్వరాలు, మూయబడిన ద్వారములు మరియు నిరాశను కలిగించు పరిస్థితులు మనలను చుట్టుముట్టవచ్చును. కానీ దేవుడు యెహోషువ మరియు అతని ప్రజలు విశ్వాసంతో యెరికో గోడలు చుట్టూ ఏడు రోజులు తిరగమని, ఏడవ రోజున సంతోషించి విజయోత్సవాన్ని కేకలు వేయమని చెప్పాడు. వారు ఆ మాటలకు విధేయత చూపినప్పుడు, ఏడవ రోజున యెరికో గోడలు కూలిపోయెను. అదేవిధంగా, నా ప్రియులారా, మీరు ముందుకు కొనసాగకుండా మీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడ కూడా మీరు ప్రభువులో ఆనందించినప్పుడు కూలిపోతుంది. కాబట్టి, మరొక అనువాదములో, 1 సమూయేలు 2:1 వ వచనములో లేఖనం ఇలాగున చెప్పబడియున్నది, 'నా కొమ్ము యెహోవా యందు హెచ్చించబడియున్నది.'' ఇది మీ కొరకైన దేవుని వాగ్దానం: మీరు దేవుని యందు ఆనందించాలని ఎంపిక చేసుకున్నప్పుడు మీ తల పైకెత్తబడుతుంది. కనుకనే, నేడు మీరు దేనికిని భయపడకండి. నిశ్చయముగా మీరు హెచ్చింపబడుదురు.

నా ప్రియులారా, మీరు ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే, దేవుడు తానే మీ యందు సంతోషించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి జెఫన్యా 3:17వ వచనములో మనము చూచినట్లయితే, ఇలాగున వ్రాయబడియున్నది, "నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు;...నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును'' ప్రకారము ఆయన మీ మధ్య ఉన్నాడు గనుకనే, మీరు ఆయన యందలి సంతోషించాలి. మరియు మత్తయి 3:17వ వచనములో చూచినట్లయితే, మన పరలోకపు తండ్రి ఈలాగున ప్రకటించాడు," మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.'' అవును, నా ప్రియులారా, దేవుడు మీయందు ఆనందించినట్లయితే, మీరు భయంతో లేదా విచారంతో ఎందుకు జీవించాలి? సంతోషించి, నేను దేవుని బిడ్డను అని ధైర్యంగా ప్రకటించండి. బైబిల్‌లో యోహాను 1:12వ వచనము నుండి ఆయన ఈలాగున తెలియజేసెను, " తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను'' అని యేసుప్రభువు చెప్పబడిన ప్రకారము మీరు ఆయన యందు సంతోషించండి. ఇంకను లేఖనము నుండి యోహాను 14:14వ వచనములో చూడండి, " నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' ప్రకారము మీరు ఆయన యందు సంతోషించాలని ఇప్పుడే ఆయన నామమున అడిగి ఆ సంతోషాన్ని పొందుకొనండి. ఇంకను బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:4వ వచనములో చూచినట్లయితే, " ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి'' అని చెప్పబడియున్నది. ఆలాగుననే, 1 థెస్సలొనీకయులకు 5:16వ వచనములో కూడా నిత్యము ఆయనలో ఆనందించమని మనకు గుర్తు చేయుచున్నది. మీరు ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించినప్పుడు, శోధనల మధ్య కూడా, ఆయన విజయం మీ జీవితంలో ప్రత్యక్షంగా కనిపించడం మీరు చూడగలరు.

నా ప్రియులారా, కనుకనే, నేడు ప్రభువునందు మీరు సంతోషించినప్పుడు, మీకు విరోధముగా లేచు శత్రువులు కూలిపోతారు. దేవుని ప్రజలు స్తుతించి పాడినప్పుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నిలిచిన ప్రజలు తమలో తాము పోరాడుకొని హతులైరని 2 దినవృత్తాంతములు 20:21-22లో ఈలాగున చెప్పబడియున్నది, " మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయారు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.'' కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నేడు మీ హృదయం దేవునితో యథార్థంగా ఉన్నప్పుడు, మీరు సంతోషించి ఆనందిస్తారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 32:11వ వచనములో చూచినట్లయితే, " నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.'' అవును, దేవుడు మీ పక్షాన ఉన్నాడని మీరు నిస్సందేహంగా గుర్తెరుగుతారు. అప్పుడు, లూకా 1:69వ వచనములో చెప్పబడినట్లుగానే, మీ కొమ్ము పైకెత్తబడుతుంది మరియు మీరు ప్రభువు బలంతో ముందుకు నడుస్తారు. నా ప్రియులారా, నేడు దేవుడు మిమ్మును తన సొంత బిడ్డగా పిలుచుచున్నాడని మరియు ఆయన మిమ్మల్ని ఎన్నటికిని విడిచిపెట్టువాడని తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఆయన మీ హృదయాన్ని ఈ ఆనందంతో నింపును గాక, మీ జీవితంలోని ప్రతి యెరికో గోడ వలె ఉన్న సమస్యలన్నియు ఆయన సన్నిధి యెదుట కూలిపోవును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీ ప్రియ బిడ్డగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా హృదయం నుండి ప్రతి భయాన్ని మరియు దుఃఖాన్ని తొలగించుము. దేవా, నీ యందలి పరిశుద్ధాత్మ ఆనందంతో మమ్మును నింపుము. యేసయ్యా, మా జీవితంలోని ప్రతి యెరికో గోడ కూలిపోవునట్లుగా చేయుము. ఓ ప్రభువా, మా కొమ్మును పైకెత్తి మమ్మును ఘనపరచుము. ప్రభువా, ఇశ్రాయేలీయుల వలె మేము నిత్యము నిన్ను సుత్తించి, పాడుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా వ్యతిరేకంగా లేచే శత్రువులతో నీవే పోరాడి, మా పక్షమున యుద్ధము చేసి, మాకు విజయమును అనుగ్రహించుము. ప్రభువా, మాకు కావలసిన సమస్తమును మాకు అనుగ్రహించి, నీ చిత్తంలో మమ్మును అభివృద్ధిపరచుము. దేవా, ఎల్లవేళలో మేము నీలో సంతోషించడానికి మాకు సహాయం దయచేయుము. ప్రభువా, అంతమాత్రమే కాదు, మేము పొందుకున్న ఆనందము ద్వారా మమ్మును ఇతరులకు ఆనంద మార్గంగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.