నా ప్రియ స్నేహితులారా, మన దేవుడు సమస్తమును కట్టువాడు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 3:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే '' అని సెలవియ్యబడినది. కనుకనే, అదేవిధముగా ఆయన మీకు కూడా జరిగిస్తాడు. ఆయన ఇలాగున చెబుతున్నాడు, ' నా కుమారుడా, నా కుమార్తె, నేను మీ కొరకు ఒక యింటిని నిర్మిస్తాను. '' అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 17:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియు గాక యెహోవా నీకు సంతతి (నివాసమును) కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని'' అని చెప్పబడినట్లుగానే, నేడు దేవుడు మీకు ఒక ఇంటిని మరియు నివాసమును కలుగజేస్తాడని విశ్వసించండి.

నా ప్రియులారా, దేవుడు మీ కొరకు ఎటువంటి ఇల్లును నిర్మిస్తాడు? ఆయన దేనిని కట్టిస్తాడు? మొట్టమొదటగా, ఆయన మిమ్మును కట్టుచున్నాడు. అందుకే బైబిల్‌లో యూదా 1:20వ వచనములో చూచినట్లయితే, " ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొనియుండుడి'' అని చెప్పబడియున్నది. ఆలాగుననే, యేసుక్రీస్తును కేంద్రంగా చేసుకున్న అతి పరిశుద్ధమైన విశ్వాసంలో దేవుడు మిమ్మును బలపరచుచున్నాడు. యేసు మీ రక్షకుడు, మీ పరలోకపు తండ్రి మరియు మీ రక్షకుడు. ఆయన తన అమూల్యమైన రక్తంతో మిమ్మును క్రయధనమును చెల్లించి కొనియున్నాడు. ఇంకను తనకు స్వకీయ సంపాద్యము గా చేసుకున్నాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, ఆ విశ్వాసం ఎన్నటికిని నిర్మూలము కాదు. ఎటువంటి పోరాటములు, కష్టములు, భయములు లేదా అవహేళనలు ఎదురైనను సరే, "యేసు నా కొరకు తన రక్తమును చిందించి, నన్ను విమోచించియున్నాడు'' అని మీరు ధైర్యంగా ప్రకటించవచ్చును. ఇది మీ జీవితమును బలపరచి, స్థిరపరచే అతిపరిశుద్ధమైన విశ్వాసం. ఈ విశ్వాసంలో మీరు వృద్ధి చెందుతున్న కొలది, దేవుని బిడ్డగా మీరు మరింత బలవంతులు అవుతారు. ఈ విశ్వాసం మీ హృదయాన్ని నింపినప్పుడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ప్రారంభించెదరు. మీరు పోరాటలను ఎదుర్కొన్నప్పుడు మీ ప్రార్థనలు ఇక సాధారణమైనవిగా ఉండవు. పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆయన అనుగ్రహించు భాషలతో మాట్లాడి, అవి ఆత్మచేత నడిపించ బడి ప్రార్థించెదరు. ఆ ప్రార్థనలు సాతాను శక్తులను బ్రద్ధలు చేయుబడుచున్నవి మరియు వ్యతిరేకతను జయించుచున్నది. చింతలను మరియు భారములను తొలగించబడుచున్నవి మరియు ఆ ప్రార్థన దేవుని ఆశీర్వాదముల కొరకు ద్వారములను తెరవబడుచున్నవి.

నా ప్రియులారా, మీరు ప్రభువును వెదకడం కొనసాగించినప్పుడు, ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమ మిమ్మును నింపుతుంది. ఎటువంటి పోరాటములు వచ్చినను, చింతలు ఎదురైనను సరే, భయములు, కష్టములు, వినాశనం, కఠినమైన మాటలు, అపనిందలు లేదా అన్యాయపు తీర్పులు ఎటువంటివైనప్పటికిని, దేవుని ప్రేమ మిమ్మల్ని నింపుతుంది. ఆ ప్రేమ ద్వారా అన్నిటిని జయించుటకును మరియు అందరికంటె ఉన్నతంగా హెచ్చింపబడే శక్తి మీలోనికి వస్తుంది. అందరిని ప్రేమించే కృప మీ మీదికి దిగి వస్తుంది. ఆ దుఃఖము నడుమ మిమ్మును అవహేళనపరచుట కొరకు ప్రజలు జరిగించుచున్న కార్యముల మధ్యలో, ' తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుకనే, వీరిని క్షమించుము,' అని ప్రార్థించు ఒక ఆత్మ మిమ్మును నింపుతుంది. దేవుని ప్రేమచేత నింపబడిన ఒక ఆత్మ మిమ్మును నింపుతుంది. దేవుని ప్రేమ మీ హృదయాన్ని రూపాంతరం చెందించి, మీకు విజయమును అనుగ్రహించుచున్నది. అప్పుడు ప్రభువు అందరికంటె ఉన్నతమైన నామమును మీకు ఇచ్చి, మిమ్మును ఘనపరుస్తాడు. ఆయన మీ మాటలను స్థిరపరుస్తాడు మరియు మీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. మీరు పలికిన కార్యములన్నియు ఆలాగుననే జరుగుతాయి. కనుకనే, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే, అతి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప విశ్వాసముచేత దేవుడు మిమ్మల్ని నిర్మించి, లేవనెత్తుతాడు. ఆ కృప మీకు దేవుడు ఈ రోజు అనుగ్రహిస్తాడు. లోకాన్ని జయించే విజయమే మీ విశ్వాసం. ఆ విజయవంతమైన విశ్వాసాన్ని దేవుడు నేడు మీకు అనుగ్రహించును గాక.

రెండవదిగా, దేవుడు మిమ్మును ఆలయముగా నిర్మించి లేవనెత్తు కృపను అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 16:18వ వచనమును చూచినట్లయితే, " మరియు నీవు పేతురువు; ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను '' అని చెప్పబడినట్లుగానే, పాతాలోకపు ద్వారములు తమపై ఎన్నడూ విజయం సాధించలేనంతగా ప్రభువు తన ప్రజలను బలపరుస్తాడు. ఎటువంటి వ్యతిరేకత ఎదురైనప్పటికిని, క్రీస్తు మీలో నివసించుచున్నందున మీరు ఆయన కొరకు ధైర్యంగా నిలువబడతారు. మీరు దేవుని ఆలయమని బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:16వ వచనములోనూ మరియు మీరు దేవుని గృహమునై యున్నారని 1 కొరింథీయులకు 3:9వ వచనములలోనూ లేఖనము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఇది ఎంతటి అద్భుతమైన గొప్ప ఆధిక్యత కదా! మీ ద్వారా ఆయన సన్నిధి ప్రకాశించునట్లుగా, దేవుడు మీ జీవితమును తన చక్కని నివాస స్థలంగా తీర్చిదిద్దుతాడు.

చివరిగా, ఇతరులను బలపరచడానికి ప్రభువు మిమ్మల్ని సిద్ధపరచుచున్నాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 15:2వ వచనములో చూచినట్లయితే, "తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను'' అని లేఖనము మనలను ప్రోత్సహించినట్లుగానే, ప్రతి ఒక్కరూ తమ పొరుగువారిని బలపరచడానికి ప్రయత్నించవలెను. నా ప్రియులారా, అదేవిధంగా, బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 5:11వ వచనములో చూచినట్లయితే, " కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి'' అని చెప్పబడినట్లుగానే, ఒకరినొకరు ప్రోత్సహించుకొనవలెననియు మరియు బలపరచుకొనవలెననియు మనకు లేఖనము స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 4:29వ వచనములో చూచినట్లయితే, " విను వారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి'' అని చెప్పబడినట్లుగానే, మన నోటి నుండి ఎలాంటి చెడు లేదా హానికరమైన మాటలు రానీయకూడదని, దానికి బదులుగా ఇతరుల అవసరాలకు అనుగుణంగా వారిని బలపరచే మరియు వినువారికి కృపను కలిగించే మాటలు మాత్రమే పలకాలని మనకు ఉపదేశించబడింది. మీరు ఇతరులను ప్రోత్సహించడానికి, వారి విశ్వాసమును బలపరచడానికి, వారి పవిత్రతను అభివృద్ధి చేయడానికి మరియు నీతిలో వారు ఎదగడానికి సహాయపడునట్లుగా దేవుడు మీ జీవితమును తన కృపతో నింపుతాడు. ఆయన మిమ్మును తన ఆలయంగానూ, మీ పొరుగు వారందరికి ఒక ఆశీర్వాదకరంగానూ మిమ్మును తీర్చిదిద్దాడు.

నా ప్రియమైనవారలారా, నేడు దేవుడు మిమ్మును బలపరచినప్పుడు, మీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆయన మిమ్మును ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, అలాగే మీ కుటుంబ మరియు వృత్తిపరమైన జీవితాలలో మిమ్మును స్థిరపరుస్తాడు. ఆయన మిమ్మును సురక్షితంగా కాపాడి, ఉన్నత స్థాయికి చేర్చి, మీరు వెళ్లుచున్న ప్రతిచోట మిమ్మును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా జీవితమునకు ప్రధానశిల్పిగా ఉన్నందుకు నీకు వందనములు. దేవా, అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మమ్మును బలపరచుము. యేసయ్యా, అనుదినము నీ యొక్క రక్షణ శక్తిపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా ప్రార్థనలు శక్తివంతంగా మరియు నీకు ప్రీతికరంగా ఉండునట్లుగా మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి భయం, దుఃఖము, నింద మరియు కష్టములను నీ ప్రేమచేత జయించునట్లుగా కృపను అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును నీ యొక్క పరిశుద్ధ ఆలయంగా చేయుము మరియు నీ యొక్క చిత్తానుసారంగా మా స్వభావమును తీర్చిదిద్దుము. దేవా, నీ యొక్క అనుకూలమైన వచనముతో మా పొరుగువారిని మరియు ఇతరులను ప్రోత్సహించడానికి, మా చుట్టూ ఉన్నవారిని బలపరచడానికి మరియు మేము వెళ్లుచున్న ప్రతిచోటా, మేము నీకు ఆశీర్వాదకరంగా మారడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మహిమ కొరకు మా కుటుంబమును, మా ఉద్యోగమును, మా వృత్తిని, మా పరిచర్యను, మా ఆరోగ్యమును మరియు మా జీవితంలోని ప్రతి రంగమును నిర్మించుము. దేవా, మా జీవితాంతము నీ యందు గొప్ప విశ్వాసమును, అతిపరిశుద్ధతను కలిగి ఉండునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, మా జీవితం నీ మంచితనాన్ని ప్రతిబింబించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.