నా ప్రియులారా, నేర్పరియైన శిల్పకారుని వలె ఉండుటకు ప్రభువు మిమ్మును పిలిచెను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో మనము చూచినట్లయితే, " దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని...'' అని చెప్పబడినట్లుగానే, ప్రతివాడు దాని మీద ఏలాగున కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అని వాక్యము తెలియజేయుచున్నది. కనుకనే, మీరు కూడా బలమైన పునాది మీద కట్టబడవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు.

నా ప్రియులారా, ప్రతి జీవితానికి ఒక దృఢమైన పునాది అవసరం; ఆ పునాది మరెవరో కాదు, కదిలించబడలేని రాయి అయిన మన ప్రభువైన యేసు క్రీస్తే. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:11వ వచనములో చూచినట్లయితే, "వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే'' అని లేఖనము సూచించబడియున్నది. మరియు నా ప్రియులారా, ఆ రాజ భవనము మీరే. మీ జీవితము ద్వారా, ఆయన యొక్క సింహాసనమును స్థాపించి, ఆయన మహిమ ఈ లోకమునకు ప్రత్యక్షపరచు ఒక రాజ భవనమును నిర్మించవలెనని ఆయన ఆశించుచున్నాడు. ఆయన యథార్థమైనవారు మాత్రమే, రాజాధి రాజుకు తగిన రాజభవనమును నిర్మించగలరు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 4:2వ వచనములో చూచినట్లయితే, "మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు కేవలం ప్రతిభావంతులను, ప్రభావం కలిగినవారు లేక లోకము దృష్టిలో విజేతల కొరకు చూచుట లేదు. ఆయనకు యథార్థముగా ఉండే వారి కొరకు ఆయన చూచుచున్నాడు.

నా ప్రియులారా, విశ్వాసము మీద కట్టబడిన పునాది. ప్రభువు, మీ జీవితము యొక్క పునాదిని బలపరిచే మొదటి మార్గము విశ్వాసము. ఈ విశ్వాసము ఎలా వస్తుందనగా, అందుకే బైబిల్ నుండి రోమీయులకు 10:17వ వచనమును చూచినట్లయితే, "కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును'' అని సెలవిచ్చుచున్నది. ఈ లోకములో మనమందరము ఇబ్బందులను మరియు అనిశ్చయమైన కార్యములను ఎదుర్కొనెదము. కానీ, మనలో దేవుని వాక్యము ఉదయించినప్పు డు, ప్రభువు, దేవుని వాక్యము ద్వారా మనతో మాటలాడినప్పుడు, మనలో విశ్వాసము కలుగును. ఆ విశ్వాసమే, ఈ లోకము మీద మనము విజయము సాధించుటకు స్థిరమైన పునాదిగా నిలుచును.

నా ప్రియులారా, శోధనలు మరియు శ్రమలు ద్వారా ప్రభువు మీ జీవితము యొక్క పునాది బలపరచును. మీరు వాటిని ఎదుర్కొనినప్ప్పుడు, ఆయన మిమ్మల్ని శోధింపబడిన అమూల్యమైన మూలరాయి అయిన దేవుని మీద బలముగా స్థిరపరచును. అందుకే బైబిల్ నుండి యెషయా 28:16వ వచనములో చూచినట్లయితే, "సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది'' అని సెలవిచ్చుచున్నది. బంగారము, అగ్నిలో శుద్ధీకరించబడును. వెండి తీవ్రమైన వేడిలో శుద్ధీకరించబడును. అదేవిధంగా, మీ జీవితములో శోధన అను అగ్నిని దాటవలసిన సమయము మీకు ఎదురగును. ప్రియులారా, తరచూ ఇటువంటి శోధనల ద్వారానే దేవుడు మిమ్మును ఉన్నతమైన స్థానమునకు సిద్ధపరచును. బైబిల్‌లో భక్తులైన యోబు, అబ్రాహాము, యోసేపు, దానియేలు అను వీరందరూ కూడా శోధనను అనుభవించారు, ఆ పరిస్థితులన్నిటిలోను, ప్రభువు వారికి తోడుగా నుండెను. ఆయన వారిని ఘనంగా బయటకు తీసుకొనివచ్చెను. ముందున్న స్థితికంటె ఎంతో ఉన్నతమైన స్థానములలో ప్రభువు వారిని హెచ్చించెను. ఆయన వారిని రాజులు మరియు అధికారుల యెదుట ఉంచి, వారి జీవితముల ద్వారా ఆయన మహిమను ప్రత్యక్షపరిచెను. నా స్నేహితులారా, ప్రభువు మీ విషయములో కూడ అదేవిధంగా చేయును. శోధింపబడిన రాయిగా ఆయన మిమ్మును మార్చినప్పుడు, ప్రభువు మిమ్మును అమూల్యమైన రాయిగా కూడ మలచుచున్నాడు. ఇతరుల యెదుట ఆయన మిమ్మల్ని ఘనపరచును మరియు ఆయన మహిమ బయల్పరచబడునట్లుగా, మీ జీవితమును రాజభవనముగా కట్టును. కాబట్టి, శోధనలు మీ విశ్వాసమును కదిలించడానికి అనుమతించవద్దు. అవి మిమ్మల్ని యేసుపై మరింత స్థిరంగా నిలబెట్టనివ్వండి.

నా ప్రియ స్నేహితులారా, దేవుడు యొక్క ప్రవచనాత్మకమైన వాక్యము ద్వారా బలపరచుచున్నాడు. ప్రభువు తన ఉద్దేశ్యముల కొరకు ప్రజలను సిద్ధపరచుటకు ఆయన యొక్క సేవకుల ద్వారా మాటలాడెను. ప్రభువు తన ఉద్దేశ్యములను నెరవేర్చుటకు ముందుగా, ఆయన తన హృదయమును ప్రజలకు బయల్పరచును. తద్వారా, వారు మెలకువగా ఉండి ప్రార్థించెదరు. ఆయన మన విశ్వాసమును బలపరచుటకును, ముందున్న దాని కొరకు మనలను సిద్ధపరచుటకును మరియు మనలను ఆయనకు దగ్గ్గరగా చేర్చుకొనుటకు ప్రవచనములను బయల్పరచును వారిని పిలవడానికి తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చును గనుక, అది తగిన సమయములో నెరవేరును. కొన్ని సమయములలో ప్రవచనము బయల్పరచబడి, అది నెరవేరుటకు మధ్యలో ఆలస్యము ఏర్పడవచ్చును. ఆ సమయములో ఆయన తన సేవకుని తగ్గించును, ఆయనపై అతను అధికముగా ఆధారపడునట్లు చేయును మరియు ఆయన వాక్యము నెరవేరు వరకు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండునట్లుగా అతనికి బోధించును. కనుకనే, ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును అని బైబిల్ నుండి హబక్కూకు 2:3వ వచనములో చూచినట్లయితే, " ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును '' అన్న వచనము ప్రకారము మీకు ఇవ్వబడిన ప్రవచనము ఆలసయ్యమైనను సరే, అది తప్పక జరుగుతుంది.

కనుకనే, నా ప్రియులారా, ప్రభువు తిరిగి రాకముందే, మిమ్మును మీరు పూర్తిగా ఆయనకు సమర్పించుకొనవలెను. మీ జీవితమును యేసు క్రీస్తు మీద కట్టుకొనుము, ఆయనకు నమ్మకంగా ఉండండి, విశ్వాసంలో ఎదుగుతూ, మీ శ్రమలను సహించుచూ మరియు ఆయన వాక్యము మీద స్థిరంగా నిలబడినప్పుడు ప్రభువు మీ జీవితమును స్థిరపరచి, మీ ద్వారా తన మహిమను బయలుపరుస్తాడు. అందువలన, ఒక వాగ్దానము లేక ప్రవచనము ఆలస్యమైనట్లయితే, మీ హృదయమును కలవరపడనీయ కుడి. ఆయన వాక్యమును హత్తుకొని, ఆయన వాగ్దానముల యందు విశ్వాసముతో, ఆయన కొరకు కనిపెట్టుకొని యుండండి. మీ జీవితమును గూర్చి ఆయన మాటలాడిన ప్రతి మాట నెరవేరును. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా జీవితమును సంపూర్ణముగా నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము మరియు మా జీవితమునకు నీవే స్థిరమైన పునాదిగా ఉండుము. దేవా, మేము శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా మేము నీకు నమ్మకంగా ఉండటానికి, విశ్వాసంలో ఎదగడానికి, మరియు నీ వాక్యమును నమ్ముటకు మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వాగ్దానముల కొరకు ఓపికతో ఎదురు చూడటానికి మరియు వాటి నెరవేర్పు ఆలస్యం అవుతున్నట్లు అనిపించినప్పుడు స్థిరంగా నిలబడటానికి మాకు నేర్పించుము. యేసయ్యా, నీ రాకడ కొరకు మా హృదయమును సిద్ధపరచుము మరియు మా జీవితము ద్వారా నీకు సాక్ష్యమివ్వడానికి మాకు అటువంటి కృపను దయచేయుము. తండ్రీ, నీ మహిమార్థమై నీ బిడ్డలమైన మా జీవితములను కట్టుము. యేసయ్యా, మేము నీ మీద స్థిరపరచబడి, మా హృదయమును రాజులకు రాజుగా నివసించుటకు తగిన స్థలముగా మార్చుము. తండ్రీ, నీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మహిమాన్వితమైన రాకడ వరకు వారు యథార్థముగాను మరియు స్థిరముగాను ఉండుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.