నా ప్రశస్తమైన సహోదరీ, సహోదరులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 62:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించినవారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును'' ప్రకారం మీరు దేవుని చేత విమోచించబడినవారనియు, పరిశుద్ధప్రజలుగా ఉండాలనియు ప్రభువు మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. ఒకవేళ నేడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు నుండి దూరముగా ఉండి యున్నారేమో? అనవసరమైన, అపరిశుద్ధమైనవి మీ జీవితములో మీరు కలిగి జీవించుచున్నారేమో? అయితే, నా ప్రియ స్నేహితులారా, 1 కొరింథీయులకు 1:9వ వచనములో చూచినట్లయితే, " మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు'' ప్రకారం మనము నిత్యము దేవునితో సహవాసమును కలిగియుండాలి.
నా ప్రియులారా, నేడు మీరు మీ హృదయమంతటితో దేవుని వెదకినట్లయితే, ఏమి జరుగుతుంది? అని బైబిల్‌లో 1 థెస్సలొనీకయులకు 2:11,12వ వచనములలో మనము చూచినట్లయితే, "తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని యెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును'' ప్రకారం మనము దేవుని పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలెను. అందుకే 2 తిమోతికి 1:9,10వ వచనములలో చూచినట్లయితే, "మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాది కాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను'' ప్రకారం పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచియున్నాడు. నా ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి అపవిత్రమైన విషయాలన్నిటి నుండి రక్షించుట కొరకు మన ప్రభువైన యేసు సిలువలో తన ప్రాణమును మన నిమిత్తము పెట్టి, రక్తమును చిందించియున్నాడు. ఈ లోకమంతయు చెడు విషయాలతో నింపబడియున్నది. కానీ, ప్రియ స్నేహితులారా, మీరు వెలుగు సంబంధులు కావలెననగా, యేసుక్రీస్తు వైపు చూడండి, ఆయన ఈ లోకమునకు వెలుగై యున్నాడు.
నా ప్రియులారా, నేడు మీరు ఆయన ముఖము వైపు దృష్టిని పెట్టినప్పుడు మరియు మీరు ఆయన సన్నిధిని వెదకినప్పుడు, మీరు ప్రకాశించునట్లుగా ప్రభువు మిమ్మును తన వెలుగుతో నింపుతాడు. మీ జీవితములో ఉన్న అంధకారమంతయు మీ నుండి వెళ్లిపోతుంది. ఇంకను మీ త్రాగుడు అలవాటు మరియు మీ దుర్‌వ్యసనములన్నియు, మీ అపవిత్రమైన కార్యములు మిమ్మును విడిచి దూరంగా పారిపోవును. ఒకవేళ మీ కుటుంబ జీవితములో సమాధానము లేనట్లయితే, నిశ్చయముగా ప్రభువే, తన సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ప్రభువు ఈ దీవెనలన్నియు మీకు ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. మీరు ఇక ఎన్నటికిని మరువబడరు మరియు విసర్జింపబడరు. కనుకనే, నేటి నుండి ఆయనను గట్టిగా హత్తుకొనండి, 'ప్రభువా, నీవే మా నిరీక్షణను, మా ఆనందము నీవే, ఎల్లప్పుడు నీ సన్నిధానమునకు రాగల శక్తిని మాకు దయచేయుము' అని మొఱ్ఱపెట్టినప్పుడు, ప్రభువు నిశ్చయముగా, మీకు వెలుగును అనుగ్రహిస్తాడు. ఆలాగుననే, ప్రభువు సన్నిధానమును మీరు వెదకినప్పుడు ఆయన తన ఆశీర్వాదములను మీకు అనుగ్రహించి, తన సన్నిధితో మిమ్మును కప్పుతాడు. కాబట్టి, ప్రియ స్నేహితులారా, పరిశుద్ధమైన తండ్రి హస్తముల నుండి ఈ దీవెనలన్నిటిని పొందుకొనుటకు మిమ్మును మీరు ఆయనకు హస్తములకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనుకనే, నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును క్రీస్తులో పరిశుద్ధునిగా మరియు విమోచించబడినవానిగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము నీకు దూరంగా ఉన్నట్లు అనిపించినప్పటికిని, నీ శాశ్వతమైన ప్రేమ ద్వారా మమ్మును నీకు సమీపముగా చేర్చుకొనుము. దేవా, మా జీవితములో అపవిత్రమైన వాటి నుండి మమ్మును దూరపరచి, మమ్మును నీకు సమీపస్థులనుగా చేర్చుకొనుము. ప్రభువా, మా ప్రతి అవాంఛిత అలవాటును విడనాడి, దానిని నీ యొక్క సమాధానముతో నింపుము. దేవా, మా కుటుంబాన్ని, మా మనస్సును మరియు నీతో మా నడకను పునరుద్ధరించు ము. ప్రభువా, ప్రతిరోజు నీ పరిశుద్ధమైన పిలుపునకు తగినట్లుగా మమ్మును నడిపించుము. ప్రభువా, మేము పడిపోయినప్పుడు కూడా మమ్మును ఎప్పుడూ విడిచిపెట్టకుండా, నీ త్రోవలో మమ్మును నడుపుము. యేసయ్యా, నీ మహిమంతయు మా మీదికి దిగివచ్చి, మా హృదయాలను తాకునట్లుగాను, నీ సన్నిధానముతో మమ్మును నింపుము. యేసయ్యా, నీ రక్తము ద్వారా మమ్మును పరిశుద్ధపరచుము, మా జీవితములో ఉన్న అంధకారమంతటిని తొలగించి, నీ సన్నిధితో మేము దీవించబడి, మేము నీ యొక్క వెలుగును పొందుకొనునట్లుగాను మాకు నూతన జీవితమును దయచేయుము. దేవా, మమ్మును పిలిచిన పిలుపును బట్టి, నీవు ఎన్నటికిని మమ్మును విడువకుండా, ఎడబాయకుండా, మా పాపముల నుండి మమ్మును విమోచించుమని సమస్త మహిమను నీకే చెల్లించుచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.