నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనకు విజయము అనుగ్రహించు దేవుని మనము కలిగియున్నాము. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన వాగ్దానములను మనము స్వీకరించినప్పుడు మనకు విజయము వస్తుంది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:16వ వచనమును మనము స్వీకరిద్దాము. ఆ వచనము, "సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక'' అని చెప్పబడిన ప్రకారం మనము స్వయంగా సమాధానమును పొందుకుంటాము. ఇది ఈ లోకము ఇచ్చునటువంటి సమాధానము వంటిది కాదు. మంచి ఫలితాలు వచ్చినప్పుడు, లేక ఏదైనా పోటీలలోను గెలిచినప్పుడు, ఏదైన సమస్య గడిచిపోయినప్పుడు, ఈ లోకములో మీకు గొప్ప సమాధానము ఉండునట్లుగా అనిపిస్తుంది. అయితే, అది ఎంతకాలము నిలిచి ఉంటుందని చూచినట్లయితే, తదుపరి సమస్య మరియు తదుపరి ఒత్తిడి మీ జీవితములో ప్రవేశించగానే, మీ హృదయము మరల ఘోషిస్తుంది మరియు దుఃఖముతో విలపిస్తుంది. కానీ, బైబిల్‌లో ఫిలిప్పీయులకు 4వ అధ్యాయములో మనము చూచినట్లయితే, దేవుడు అనుగ్రహించు సమాధానము ఎల్లప్పుడు మీ హృదయమును కావలి కాయుచు ఉంటుంది. అంతమాత్రమే కాదు, ఆయన మీ హృదయానికి సైనికుని వలె ఉంటాడు. మీ హృదయాన్ని భద్రపరచుచున్న అనుభూతిని మీరు కలిగియుంటారు.

నా ప్రియులారా, ఈ గొప్ప సమాధానము మనం యేసులోనే చూడగలము. యేసును మరియు శిష్యులును వారందరు కలిసి దోనెలో ప్రయాణించుచున్నప్పుడు వారు తుఫానును ఎదుర్కొన్న సమయములో కూడా యేసు ఏమి చేయుచున్నాడు? అని చూచినట్లయితే, ఆయన సమాధానముతో నిద్రపోవుచుండెను. ఒక తుఫాను కుడియెడమల ఆ దోనెను కొడుతూ ఉన్నప్పటికిని, ఆయన సమాధానముతో నిద్రపోవుచుండెను. శిష్యులందరు లేచి ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన లేచి మీరందరు ఎందుకు భయపడుచున్నారు? అని వారిని అడిగాడు? ప్రభువులో ఏమాత్రమును భయము లేదు. ఆయన మీలో ఉన్నప్పుడు మీకు కూడా ఇదే అనుభూతి కలుగుతుంది. ఇంటర్య్వూలో, మీ ఉద్యోగములో మీ ఎదురుగా తిరస్కారము వచ్చినప్పుడు మీ హృదయము గాయపరచబడియున్నప్పుడు, మీ మూత్రపిండములు పాడైపోయాయి అని చెప్పినప్పుడు, మీ శరీరములో అన్ని అయవములు పాడైపోయాయి అని చెప్పినప్పుడు, ప్రజలు మిమ్మును బెదిరించుచున్న సందర్భములలో కూడా, మీ హృదయము ఇంకను నేనెందుకు భయపడవలెను అని చెబుతుంటుంది. ఆలాగున దేవుని సమాధానము మీ హృదయమును భద్రపరుస్తుంది. అదియుగాక, 'ప్రభువు వీటన్నిటి మధ్యలో నుండి నన్ను బయటకు తీసుకొని వస్తాడు, ఆయన వీటన్నిటి నుండి నేను బయటపడు మార్గమును నాకు అనుగ్రహిస్తాడు' అని మీరు చెప్పునట్లుగా చేస్తాడు. దేవుడు అటువంటి నిత్యమైన సమాధానమును నేడు మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి.

భయంకరమైన మధ్యపానపు అలవాటుతో ఉద్యోగమును కోల్పోయిన ఒక వ్యక్తి ఉండెను. అతడు తన జీవితమును అంతము చేసుకోవాలని అనుకున్నాడు. అతడు మేము నిర్వహించుచున్న మా కూటములకు పాల్గొన్నాడు. అతడు ప్రవేశించి, మా సభలలో పాల్గొని మా తల్లిగారు వాక్యమును బోధించుచుండగా, ఆ వాక్యమును ఆలకించినప్పుడు, ఆమె 'దేవుడు మరల మీ జీవితాన్ని నిర్మాణము చేస్తాడు ' అని చెప్పారు. అతడు ఆ మాట వినగానే, అతని హృదయము గొప్ప సమాధానముతో నింపబడినది. అతనిలో ఉన్న తన హృదయాలోచనలు సంపూర్తిగా మార్చబడ్డాయి. మా తల్లిగారు చెప్పినట్లుగానే, అతని జీవితము సంపూర్తిగా మార్చబడినది. అతనిలో ఉన్న మధ్యపానపు ఆశ అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయినది. గొప్ప సమాధానము అతని హృదయములోనికి వచ్చినది. దేవుడు అతనికి మరల తన ఉద్యోగము వచ్చునట్లుగా చేశాడు. అవును, నా ప్రియమైన స్నేహితులారా, అటువంటి గొప్ప సమాధానమును ఇప్పుడే మనము ఆయన యొద్ద అడిగి పొందుకుందాము. కనుకనే, సమాధానకర్తయగు దేవుని సన్నిధిలో మీ హృదయములను ఆయనకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీకు అటువంటి గొప్ప సమాధానమును అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించు సమాధానము, మీ హృదయములకు మరియు మీ తలంపులకు కావలి యుంటుంది. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సమాధానమునకు కర్తయగు మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రేమగల ప్రభువా, మా జీవితంలోని ప్రతి తుఫానును నిమ్మళింపజేయుచున్నందుకై నీకు వందనాలు. దేవా, ఈ లోకములో ఇవ్వలేని లేదా తీసివేయలేని నీ నిత్య సమాధానముతో మా హృదయాన్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మాకు ఇబ్బందులు తలెత్తినప్పుడు, మాకు వ్యతిరేకముగా తిరస్కరణలు వచ్చినప్పుడు లేదా భయం మమ్మును ముంచెత్తడానికి ప్రయత్నించినప్పుడు కూడా, మా బలానికి ఆధారంగా నీలో విశ్రాంతి తీసుకోవడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ యొక్క దైవీకమైన సమాధానమును ప్రతిరోజు మాకు కెడముగాను, మాకు ఆదరణగాను మరియు మా నమ్మకంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా హృదయాన్ని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము, ఈరోజు నుండి నీ సన్నిధితో మమ్మును నింపి, నీ జీవముగల వాక్యం ద్వారా మమ్మును విజయంలోనికి నడిపించుము. దేవా, నీ యొక్క పరలోకపు సమాధానము మా మీద కుమ్మరించుము. ఎందుకంటే, నీవే సమాధానకర్తవై యున్నావు, మా హృదయము విచారముతోను మరియు భయముతోను ఉన్నది, కనుకనే నేడు నీవు మా హృదయములోనికి వచ్చి, ఈ లోకములో ఇవ్వలేని నీ యొక్క సమాధానమును మా హృదయమునకు మరియు తలంపులకు కావలి ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ,ఆమేన్.