నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచు, ప్రేమతో మిమ్మును ఆహ్వానించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 119:114 వ వచనము తీసుకొనబడినది. బైబిల్ గ్రంథము ఉన్నవారు నాతో పాటు కూడ చదవవలసినదిగా కోరుచున్నాను. ఆ వచనము, "నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యము మీద ఆశపెట్టుకొనియున్నాను'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని వాక్యమును క్రమము తప్పకుండా చదవాలి. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితములో ఇటువంటి అనుభవమును మీరు కలిగియున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుటలో మీరు ఎంత సమయమును వెచ్చించుచున్నారు? చూడండి, బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 14:23వ వచనములో చూచినట్లయితే, "యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము'' అన్న వచనము ప్రకారము మీరు దేవుని ప్రేమించి, ఆయన మాటను గైకొనినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ యొద్దకు వచ్చి నివాసము చేయుదురు. నా ప్రియులారా, మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు ఏమి జరుగుతుంది? అని మనము చూచినట్లయితే, తండ్రియైన దేవుడు మీ యొద్దకు దిగివచ్చి, మీతో కూడా నివసిస్తాడు. అంతమాత్రమే కాదు, యేసయ్య కూడా మీతో ఉంటాడు.

అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, మార్త సహోదరియైన మరియను గురించి మనము చదువుతాము. బైబిల్ నుండి లూకా సువార్త 10:42వ వచనములో యేసు ప్రభువు మరియను గురించి ఈవిధముగా చెప్పుట మనము చూడగలము, "మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.'' ఆలాగుననే, మరియ ఏమి చేసినది అని మనము చూచినట్లయితే, యేసయ్య యొద్ద నుండి వెలువడుచున్న దేవుని వాక్యమును ఆమె ఎల్లప్పుడు ఆలకించుచుండెను. అందుకనే, ఆమె ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనగలిగినది. అదేవిధముగా, నా ప్రశస్తమైన సహోదరీ, సహోదరులారా, దేవుని వాక్యమును ఎంత అధికముగా వీలైతే, అంత అధికముగా చదవాలి. ఆ విధముగా, మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు, ప్రభువు తానే మీ యొద్దకు వచ్చి, మీతో నివసిస్తాడు. తద్వా రా, దేవుని యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములన్నిటిని మీరు పొందుకుంటా రు. మీ జీవితములను పరీక్షించుకొనండి. మీ యొక్క స్వంత బైబిల్ గ్రంథ ము మీకు ఉన్నదా? మీరు దేవుని వాక్యమును ఈ విధంగా చదివినప్పుడు, ప్రభువు స్వయంగా మీతో ఉంటాడు. మీరు ఆయన సన్నిధిని అనుభవించి, ఆయన సమృద్ధియైన ఆశీర్వాదములను పొందుకుంటారు. కాబట్టి, దేవుని వాక్యమును మీ యొక్క అనుదిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకొనవలెను.

మా తల్లిగారు తన బిడ్డలైన మా పట్ల ఒక విషయమును జరిగించేవారు. తనకు బిడ్డలు కలిగినప్పుడు, వారు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, వారి కోసము ఒక బైబిల్ గ్రంథమును కొని, వారికి బహుమానముగా ఇచ్చేవారు. అంతమాత్రమే కాదు, పిల్లలందరిని కూడా బైబిల్ గ్రంథమును చదువునట్లుగా ప్రోత్సహించి, వారికి అర్థమగునట్లుగా చేయించేవారు. అందుకే తన బిడ్డలమైన మేము నలుగురము కూడా, సమృద్ధిగా దీవించబడియున్నాము.

నా ప్రియులారా, దేవుని వాక్యమును చదవడములో ఎంత సమయమును వెచ్చించుచున్నారో ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకొనవలెను. అప్పుడు మీరు కూడా అదే రీతిగా ఆశీర్వదింపబడతారు. మనము చదవవలసినంతగా దేవుని వాక్యమును చదువుచున్నామో లేదో అని ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుందాము. అప్పుడు దేవుని వాగ్దానము చొప్పున నిశ్చయముగా, మిమ్మును కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము కూడా ప్రతిరోజు బైబిల్‌ను చదివే అలవాటును పెంపొందించుకుందా ము. కేవలము బైబిల్‌ను కలిగి ఉండటమే కాకుండా, దానిని చదివి, అర్థం చేసుకుని, ఆ వాక్యమును ధ్యానించి, మరియవలె దాని ప్రకారం జీవించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ వాక్యమును ప్రతిరోజు చదువుచూ, అర్థము చేసుకొనగలిగే, దీవించబడు కృపను మాకందరికి అనుగ్రహించుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మేము ఆశీర్వదింపబడునట్లుగా చేయుము. దేవా, మేము ప్రతి రోజు నీ వాక్యమును చదివి, దాని అర్థమును గ్రహించి, దాని ప్రకారం జీవించడానికి మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ వాక్యమే మాకు ఆశ్రయస్థానముగాను, కేడెముగాను ఉండునట్లుగా చేయుము. యేసయ్య, మరియ నీ పాదముల చెంత కూర్చొని నీ వాక్యాన్ని విని ఉత్తతమమైన దానిని ఎన్నుకొనునట్లుగాను, మేము ప్రతిరోజు ఉత్తమమైన దానిని ఎన్నుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, వాక్యం ద్వారా మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుము. దేవా, పై చెప్పబడిన తల్లి తన నలుగురు పిల్లలకు బైబిలు చదవడం, అర్థం చేసుకోవడం నేర్పించినట్లుగానే, తల్లిదండ్రులుగా ఉన్న మేము మా పిల్లలను నీ వాక్యంలో నడిపించునట్లుగాను, ఉత్తమమైన దానిని ఎన్నుకొనునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మా కుటుంబం మరియవలె నీ సన్నిధిని, నడిపింపును, రక్షణను మరియు సమృద్ధియైన ఆశీర్వాదములను అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.