నా యొక్క ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మును విశాలమైన స్థలమునకు తోడుకొని రావలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ, మీరు అన్ని వైపుల నుండి అణచివేయబడు చున్నారేమో? దుష్ట ప్రజలు మిమ్మును అణిచివేయుచున్నారేమో? పాపము మిమ్మును అణిచివేయుచున్నదేమో? ఇంకను మీ జీవిత సమస్యలు మీకు అణిచివేతను కలిగించుచున్నాయామో? మోసము మిమ్మును అణిచివేతకు గురిచేయుచున్నవేమో? అయితే, యేసు ప్రభువు మీకు నేడు విడుదలను అనుగ్రహించబోవుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీరు విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చెదరు. ఎందుకనగా, ఆయన మీ యందు ఆనందించుచున్నాడు. ఇంకను ఆయన మిమ్మును గూర్చి గానము చేయుచు, మీ పట్ల ఆనందించుచున్నాడు. ఆలాగుననే, ఆయన మీకు భద్రత అనుగ్రహించుచున్నాడు. ఆయన మిమ్మును విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చును. నేడు ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:19వ వచనము మీ కొరకు కనుగొనబడినది. ఆ వచనము, "విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను'' అని చెప్పబడిన ప్రకారము నేడు ఆయన మిమ్మును తప్పించుటకు ఇష్టపడుచున్నాడు. కనుకనే, ఇప్పుడు ఆయన మనలను ఎటువంటి విశాల స్థలమునకు తోడుకొని వస్తాడు? అని మనము కీర్తనలు 118:5వ వచనములో చూచినట్లయితే, " ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను '' అని కీర్తనాకారుడు ఈలాగున తెలియజేసియున్నాడు, " నా కఠినమైన అణచివేత, శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని, అపజయముల ద్వారా మరియు నష్టముల ద్వారా అణిచివేయబడడము. నా ఆత్మలో అవేదన, బాధ ద్వారా కఠినముగా అణచివేతకు గురికావడము. దుష్ట ప్రజల మోసముల ద్వారా అణచివేతకు గురికావడము. రెండు నాలుకల ద్వారా అణచివేతకు గురికావడము. ఆలాగుననే, ఒత్తిడిని కలుగజేయు ఆత్మల ప్రభావము ద్వారా అటువంటి సమయములో నేను దేవునికి మొఱ్ఱపెట్టితిని, ఆయన నన్ను విశాల స్థలమునకు తోడుకొని వచ్చెను. ఇంకను ఆయన నన్ను కాపాడి, విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చెను' అని చెప్పెను. అవునండి, దేవుడు మీకు కూడా ఆలాగుననే జరిగిస్తాడు.

రెండవదిగా, బైబిల్ నుండి కీర్తనలు 31:8వ వచనములో చూచినట్లయితే, "నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి'' ప్రకారముగా శత్రువుల చేతికిని నన్ను అప్పగించలేదని కీర్తనాకారుడు చెప్పియున్నాడు. అవును, ప్రజలు అసూయపరులుగా ఉన్నారు. కొందరు మనలను వాడుకుని, మన నుండి సర్వస్వాన్ని పిండేసి, ఆ తర్వాత, పారిపోవడానికి ప్రయత్నించవచ్చును. వారు మనతో ఉన్నప్పటికిని, ప్రజలు ఏ మాత్రము మనయందు నమ్మిక యుంచరు. దేవుడు మనకు అనుగ్రహించియున్న కృపలకు కూడా ప్రజలకు ఏ మాత్రము నమ్మికను కలిగి ఉండరు. కానీ, దేవుడు మనలను శత్రువుల చేతిలో నుండి విడిపించును. విశాల స్థలమునకు తోడుకొని వచ్చును. దేవుడు మీకు ఆలాగున జరిగించును. మీ శత్రువుల కన్నుల యెదుటనే, ఆయన తైలముతో మిమ్మును అభిషేకిస్తాడు. ఆయన మీ తలను తైలముతో అభిషేకిస్తాడు. అవును, నా ప్రియులారా, మీ శత్రువుల యెదుట ఆయన మీ నిమిత్తము గొప్ప విందును సంసిద్ధము చేస్తాడు. అప్పుడు మీరు చెబుతారు, 'ఇప్పుడు మా చుట్టు అంతయు శాంతియుతముగా ఉన్నది.' ఆలాగుననే, జీవిత కాలమంతయు మా తండ్రిగారు తన శత్రువులతో పోరాడుతూ ఉండవలసి ఉండవచ్చినది అని చెప్పాడు. కానీ, దేవుడు అన్ని దిక్కుల నుండి నాకు శాంతిని అనుగ్రహించియున్నాడు. నాకు శత్రువులే లేరు. నేను విశాలమైన స్థలమందు ఉండియున్నాను. గనుకనే, ఆయన గొప్ప రాజ్యమును నిర్మాణము చేసియున్నాడు' అని చెప్పాడు. నా ప్రియులారా, నేడు మీకును ఆలాగున దేవుడు జరిగించబోవుచున్నాడు. మీరు సమాధానముతో కట్టబడుదురు. అవును, మీరు చేయునదంతయు కూడా వర్థిల్లుతను పొందుకుంటుంది. ఆయన మీ శత్రువుల నుండి మీకు విడుదలను అనుగ్రహించుచున్నాడు.

నా ప్రియులారా, మీ జీవితములో కఠినమైన అణిచివేతకు గురియైన స్థితి నుండి ఆయన మీకు విడుదలను అనుగ్రహించుచున్నాడు. ఆర్థికముగా మీరు కఠినమైన అణచివేతకు గురిచేయబడుచున్నారా? జీవితములో విజయమును కొరకు మరియు మీరు పరిచర్య చేయుచున్నప్పుడు అద్భుత కార్యములు జరుగక కఠినముగా అణిచివేయబడుచున్నారా? మరియు మీ కుటుంబములో ఉన్న సమస్యలను బట్టి, మీరు కఠినముగా అణచివేతకు గురియగుచున్నారా? ప్రభువు మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన సిలువలో, సిలువ శిక్షకు గురియై యున్నాడు. ఆయన అన్ని వైపుల కూడా బంధింపబడియున్నాడు. అయినప్పటికిని, ఆయన మరణమును జయించియున్నాడు. ఆయన, ' తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నా ఆత్మ కఠినముగా అణిచివేయబడినది, కానీ, తండ్రీ, దానిని నీ చేతికి అప్పగించుచున్నాను' అని పలికెను. అయితే, దేవుని ఆత్మ వచ్చి, ఆయనకు పునరుత్థానమును అనుగ్రహించాడు. తద్వారా, ఆయన తిరిగి లేచియున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మీరు కూడా తిరిగి పైకి లేచెదరు. అందుకే బైబిల్‌లో కీర్తనలు 34:19వ వచనములో చూచినట్లయితే, "నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు ప్రభువును ప్రేమించియున్నారు గనుకనే, ప్రభువు మిమ్మును కాపాడి మీకు విడుదలను అనుగ్రహించును. ఆయన మిమ్మును అత్యున్నతమైన స్థలములలో ఉంచును. ఆయన మిమ్మును ఘనపరచును. ఆలాగుననే, బైబిల్‌లో కీర్తనలు 91:14-15వ వచనములో చూచినట్లయితే, " అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను '' అని చెప్పబడిన ప్రకారము ఆయన మిమ్మును ఘనపరచి, మిమ్మును ఆశీర్వదించును గాక. దేవుడు ఇట్టి ఆశీర్వాదమును నేడు మీకు అనుగ్రహించును గాక. మరల కొలొస్సయులకు 1:13వ వచనములో చూచినట్లయితే, "ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను '' అని చెప్పబడిన ప్రకారముగా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసియున్నాడు. ఆలాగుననే, 2 తిమోతికి 4:18వ వచనములో చూచినట్లయితే, "ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్'' అని చెప్పబడినట్లుగానే, మనలను దుష్టప్రజల దాడుల నుండి కూడా తప్పించు దేవుడై యున్నాడు. నా ప్రియులారా, నేడు దేవుడు మీకు భద్రతను అనుగ్రహించుచున్నాడు. ఇప్పుడు ఆయన మిమ్మును విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చుచున్నాడు. కేవలము విశ్వసించండి, ఆ ఆశీర్వాదముల వైపు నడిచి వెళ్లండి. దేవుడు ఐశ్వర్యవంతముగా మిమ్మును నేటి వాగ్దానము నుండి ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఇప్పుడే, మాకు విడుదలను అనుగ్రహించి, ఇప్పుడే మమ్మును కాపాడుము. దేవా, మా యొక్క ప్రతి విధమైన అణిచివేత మరియు దుష్ట శక్తులకు గురిచేయుచూ, మమ్మును పిండేసి, నాశనము చేయు కఠినమైన అణిచివేత గురిచేయుచున్న ప్రతి విధమైనదానిని నీవు సిలువలో నాశనము చేసిన శక్తి ద్వారా నీవు మాకు విడుదలను అనుగ్రహించుము. ప్రభువైన యేసయ్యా, ఇప్పుడే మా ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి, మమ్మును విడిపించి, మాకు భద్రతనిమ్ము. దేవా, మా దుఃఖమంతయు తొలగిపోయి, ప్రతి విధమైన సంతోషము, ఆశీర్వాదము మా యొద్దకు వచ్చునట్లుగాను మేము గొప్ప ఔన్నత్యముతో జీవించునట్లుగాను మాకు కృపనిమ్ము. ప్రభువా, మేము సకల ఆశీర్వాదములను పొందుకొని, విశాలమైన స్థలమునకు తోడుకొని పోవునట్లుగాను, మా అవసరము మరియు అత్యధికమైన ఒత్తిడి సమయంలో మేము నీ సన్నిధికి వచ్చునట్లుగాను, మేము ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాన్ని, మేము మోయుచున్న ప్రతి భారాన్ని నీవు చూచి, నీవు మమ్మును తప్పించి, విశాలమైన స్థలంలోనికి నడిపించుము. దేవా, మా శత్రువుల నుండి ఎదుర్కొంటున్న ప్రతి అణచివేత నుండి మమ్మును విడిపించి, నీ యొక్క పరిపూర్ణమైన శాంతి మరియు విడుదలతో మా జీవితాన్ని కప్పుము. ప్రభువా, దయచేసి నీయందు విశ్వాసముంచి, నీ వాగ్దానములయందు నమ్మకముతో నడుచుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ శక్తిచేత ప్రతి మూయబడియున్న ద్వారములు తెరవబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ ఆశీర్వాదమును పొంది, నీ సమృద్ధిలోనికి అడుగుపెట్టునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.