నా ప్రియమైన స్నేహితులారా, దేవుని హృదయం మనలను భద్రంగా కాపాడుచూ, ఆయన మహిమాన్విత సన్నిధి యెదుట మనలను నిలబెట్టాలని మన పట్ల వాంఛ కలిగియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యూదా 1:24వ వచనములో ఇలా చెప్పబడియున్నది, "తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు...'' అని వ్రాయబడియున్న ప్రకారము ఈ లోకం మనలను తడబాటుకు గురిచేయుచున్న శోధనలు మరియు పరిస్థితులతో నిండి ఉంటుంది, అయినప్పటికీ యేసు మన అడుగులను కాపాడుతాడు. బైబిల్ నుండి యెషయా 52:7 వ వచనములో చూచినట్లయితే, "సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మన పాదాలను సుందరముగా మారుస్తాడనియు, యేసు తన శిష్యులు తొట్రిల్లకుండ ఉండటానికి వారి పాదాలను ఎలా కడిగాడో చూపించుచున్నది. మరియు బైబిల్ నుండి యోహాను 13:1వ వచనములో చూచినట్లయితే, "తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను'' ప్రకారము అపవాది మాట విన్న యూదా తప్ప, సమస్తమును విడిచిపెట్టి ఆయనను అనుసరించిన వారు కూడా రక్షించబడ్డారు. నేడు, నా ప్రియులారా, మనం కూడా యేసు పట్ల ప్రేమతో మన హృదయాలను మరియు పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి, తద్వారా మనం ఎల్లప్పుడూ ఆయన మహిమగల సన్నిధిలో నిలిచి ఉండగలము.
నా ప్రియులారా, మన హృదయాలను అభ్యంతరపరిచే ప్రభావముల నుండి కూడా మనలను మనం కాపాడుకోవాలి. బైబిల్ నుండి సామెతలు 4:23వ వచనములో చూచినట్లయితే, "నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము'' ప్రకారము మన హృదయాలలోనికి ప్రవహించుచున్న సమస్తము మనలను పాపంలోనికి నడిపిస్తుందని హెచ్చరించుచున్నది. బైబిల్ నుండి మత్తయి 15:19వ వచనములో చూచినట్లయితే, " దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును '' అని చెప్పబడినట్లుగానే, దుష్ట ఆలోచనలు, హత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం మరియు అపనిందలను అడ్డంకులుగా జాబితా చేయుచున్నది. ఆలాగుననే, మన చర్యలు కూడా ఇతరులను తడబాటుకు గురిచేయగలవు. ఇంకను లూకా 17:1-2వ వచనములలో చూచినట్లయితే, ఆయన తన శిష్యులతో ఇట్లనెను, "అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు'' ప్రకారము ముఖ్యంగా తల్లిదండ్రులలో జరిగే అన్యాయపు ప్రవర్తన పిల్లలను భక్తిహీనతకు దారితీస్తుందని ఈ వచనములు బోధించుచున్నవి. కనుకనే, ఇతరులు పడిపోకుండా అడ్డుకోవడానికి నీతివంతమైన సంబంధాలు, విధేయత మరియు దైవీకమైన స్వభాముగలిగి ఉండుట చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 51:12వ వచనములో, " నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము'' ప్రకారము దావీదువలె, మనం ఇలాగున ప్రార్థించాలి: "ప్రభువా, నాకు రక్షణానందము తిరిగి దయచేయుము; నన్ను ఆదుకొని నన్ను పడిపోకుండునట్లు కాపాడుము'' అని ప్రార్థించినప్పుడు, సమ్మతిగల మనస్సు మనకు కలుగజేసి, ఆయన మనలను దృఢపరచును.
చివరగా, ఇతరుల పట్ల మన మాటలు మరియు ప్రవర్తన పవిత్రంగా మరియు వినయంగా ఉండాలి. "కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి'' (రోమీయులకు 14:13)వ వచనములో చెప్పబడినట్లుగానే, ఇతరులను తీర్పు తీర్చడం లేదా వారిని గురించి తప్పుగా మాట్లాడటం అభ్యంతరానికి కారణమవుతుందని హెచ్చరించుచున్నది. యేసును అనుసరించడానికి పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యం; అది లేకుండా, మనం తడబడతాము. కానీ దానితో, మనం స్థిరంగా నిలబడియుంటాము. అందుకే బైబిల్ నుండి యోహాను 1:14వ వచనములో చూచినట్లయితే, " ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి'' అని ఈ వచనము మనకు గుర్తుచేయుచున్నది, పరిశుద్ధతలో మనం ఆయన మహిమాన్వితమైన సన్నిధిలో నివసిస్తాము, కృప మరియు సత్యంతో నిండి ఉంటాము, అంతమాత్రమే కాదు, మనము జీవముగల దేవుని ఆలయంగా మార్చబడతాము. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మనం అందరిని ప్రేమించుదాము, వారి కొరకు ప్రార్థించుదాము మరియు అందరిపట్ల సమాధానముతో నడుచుకుందాము. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 12:14వ వచనములో, "అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు'' ప్రకారము మనము అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగియున్నప్పుడు, మనము తప్పకుండా దేవుని చూడగలము. ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు దేవుడు మనలను తొట్రిల్లకుండా కాపాడి, తన మహిమాన్వితమైన సన్నిధిలో సంపూర్ణంగా నిలబెట్టును గాక; తన ఆత్మతోను మహిమతోను మనలను నిలబెట్టి నిలకడగా ఉంచును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, తొట్రిల్లకుండా మమ్మును కాపాడుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా యొక్క ప్రతి శోధన నుండి మా పాదాలను మరియు హృదయాన్ని భద్రంగా కాపాడుము. దేవా, మా జీవితంలో రక్షణ ఆనందాన్ని మరల పునరుద్ధరించుము. మరియు సమ్మతిగల మనస్సును మాకు కలుగజేసి, ఇతరులకు దీవెనకరముగా మమ్మును మార్చుము. ప్రభువా, మా దుర్నీతి నుండి మమ్మును విడిపించి, మేము అందరితో పవిత్రంగాను మరియు సమాధానముతో నడుచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా కుటుంబాన్ని రక్షించుము మరియు మా సంబంధాలను నడిపించుము. ప్రభువా, మేము ఇతరులను తీర్పు తీర్చకుండా లేదా బాధించకుండా మా హృదయాన్ని మరియు మా నోటిని కాపాడుము. యేసయా, మమ్మును నీ నీతికి ఉదాహరణగా మార్చి, నీ మహిమాన్విత సన్నిధిలో మేము నిత్యము నివసించుటకు మమ్మును నడిపించుము. దేవా, మా జీవితాన్ని నీ కృప, సత్యము మరియు మహిమతో నింపుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


