నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు విలువైన నామమున మీకు శుభములు. ఆలాగుననే, మీ అందరిని చూడడము నాకు ఎంతో సంతోషము. దేవుడు ఇప్పుడే మిమ్మును తన వాక్యము ద్వారా ఆశీర్వదించును గాక. ఆలాగుననే, ఈ రోజు ధ్యానము నిమిత్తము బైబిల్ నుండి గలతీయులకు 3:27వ వచనమును ప్రభువు మనకు వాగ్దానముగా ఇచ్చియున్నాడు. ఆ వచనము, "క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు'' అని చెప్పబడియున్నది. ఆలాగుననే, గలతీయులకు 3:28వ వచనములో చూచినట్లయితే, "ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు '' అని చెప్పబడిన ప్రకారము మనలో ఎవరమైనను సరే, మనమందరము యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నామని చెప్పబడియున్నది. ఆలాగుననే, బైబిల్ నుండి రోమీయులకు 6:6వ వచనములో చూచినట్లయితే, " ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువ వేయబడెనని యెరుగుదుము'' అని చెప్పబడిన ఈ వచనములో బాప్తిస్మము తీసుకున్నట్లయితే, ఏమి జరుగుతుంది అని వివరించబడియున్నది. ఆలాగుననే, రోమీయులకు 6:4వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతిపెట్టబడితిమి'' ప్రకారము మనము బాప్తిస్మము వలన ఆయనతో కూడా పాతిపెట్టబడియున్నామని తెలియజేయుచున్నది. ఇంకను, రోమీయులకు 6:11వ వచనములో చూచినట్లయితే, " అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి'' అని చెప్పబడిన ప్రకారము బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఇదే జరుగుతుంది.
కనుకనే, బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనమును చూచినట్లయితే, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఇంకను, " నేను ఒకప్పుడు పాపిగా ఉండేవాడను, అన్ని విధములుగా దుష్కార్యములను చేయువాడను. కానీ, క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన నా స్వంత రక్షకునిగా మారియున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను. ఇప్పుడు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు'' అని స్పష్టముగా పౌలు భక్తుడు తెలియజేసియున్నాడు. అవును, బాప్తిస్మము తీసుకొని, మనము నీటిలోనికి ప్రవేశించి, మునిగి లేచినప్పుడు, మన పాపపు అలవాట్లన్నియు ఆ నీటిలో కొట్టుకొనిపోతాయి. మనము ఆ నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు, మనము నూతన వ్యక్తిగా మారిపోతాము. యేసు రక్తముతో కడగబడి నూతన వ్యక్తిగా మనము మారిపోతాము. ఆలాగుననే, సౌలు, పౌలుగా మరియు దేవుని సేవకునిగా మారియున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుని శక్తితో అతడు నింపబడినప్పుడు, దేవుని సేవకుడుగా మార్చబడ్డాడు. యేసయ్య, బాప్తిస్మము తీసుకొని నీటి నుండి బయటకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందుకొనియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు నీటిలో బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును మీరు పొందుకొనగలరు.
బైబిల్ అనుసారముగా బాప్తిస్మము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈలోక రక్షకుడైన యేసయ్యనే విధేయత చూపించి, బాప్తిస్మము తీసుకున్నప్పుడు, మనము ఎంతటి వారము కదా! కనుకనే, నా ప్రియులారా, అనవసరమైన విషయాలతో వాదించకండి. దేవుని నమ్మి, ఆయన వాక్యమును విశ్వసించండి. యేసు ప్రభువు చేసినట్లుగానే, మీరు కూడా చేయండి. అప్పుడు మీ జీవితము దీవించబడిన జీవితముగా ఉంటుంది. మీరు దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి. ఇది ఒక సిద్ధాంతము కాదు. 'నేను చేసినవి, మీరును చేయవలెను' అని ప్రభువు చెప్పియున్నాడు కదా. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడే, మన జీవితములను ప్రభువునకు సమర్పించుకుందాము. ఆయన మార్గములకు విధేయత చూపించుదాము. దేవుని శక్తిని పొందుకుందాము. మనము ఆయన మహిమార్థమై ప్రకాశిద్దాము. నేటి వాగ్దానము నుండి దేవుడు మీ యొక్క ప్రాచీన స్వభావమును తొలగించి, మిమ్మును నూతనమైన వారినిగా మార్చి, దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, వాక్యము పట్ల విధేయతను బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయములను తాకుము, మేము దేని విషయములో కూడా వాదించకుండా, మేము నీ వాక్యమును విశ్వసించి, నీకు విధేయత చూపించుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క సమృద్ధి దీవెనలు మేము పొందుకొనునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువైన యేసయ్య, నీవు మా కొరకు సిలువపై మరణించి, మేము సమృద్ధిగా జీవమును పొందుకొనుట కొరకు నీవు తిరిగి లేచినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా పాపపు జీవితానికి మేము చనిపోయి, నీ కొరకు జీవించడానికి, మరియు మా జీవితాన్ని నీలో జీవించడానికి మేము ఎంచుకుంటున్నాము. ప్రభువా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మును సంపూర్ణంగా కడిగి పవిత్రపరచుము. దేవా, వాదన లేకుండా, భయం లేకుండా నీ వాక్యమును వెంబడించడానికి సహాయం చేయుము. ప్రభువా, నీవు పరలోకంలో ఉన్న తండ్రికి విధేయుడవైనట్లుగానే, మేము కూడా నీ మార్గాన్ని అనుసరించడానికి మాకు నీ కృపను చూపుము. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి, మా జీవితాన్ని నూతనంగా మరియు నీకు ప్రీతికరంగా మార్చుము. ప్రభువా, మా జీవితం కేవలం నీ యొక్క మహిమ కొరకు ప్రకాశించునట్లుగా, మాలో ఉన్న ప్రాచీన స్వభావమును తొలగించి, నూతన సృష్టిగా మార్చబడునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


