నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 104:4వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "వాయువుల ను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు'' ప్రకారం ఇక్కడ మనము చూచినట్లయితే, పరలోకమంతా తన ఆజ్ఞకు లోబడుచున్నదని మనము చూడగలుగుచున్నాము. ప్రభువు యొక్క మహిమను మనము ధ్యానించడానికి ఇది మనకు ఎంతో దోహదపడుచున్నది. ఇక్కడ ప్రభువు యొక్క చేతి పనిని గురించి మనము ధ్యానించబోవుచున్నాము. ప్రభువు పక్షముగా పనిచేయుచున్నటువంటి ఎంతో శక్తివంతమైన వారు దేవదూతలై ఉంటున్నారు. కనుకనే, మెరుపు వంటి వేగముతో, ప్రభువు పనిలో దేవదూతలు ముందుకు కదులుతుంటారు. దేవదూతలు ఎంతో వేగవంతముగా ఉంటారు. దేవుని యొక్క వర్తమానమును వారు ఎంతో వేగముతో మోసుకొని వెళ్లతారు. బైబిల్ నుండి హెబ్రీయులకు 1:14వ వచనములో చూచినట్లయితే," వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?'' అని అదే వాక్యమును మనకు తెలియజేయుచున్నది. వారు పరిచర్య చేయుచున్నారు కనుకనే, వారిని 'పరిచారక ఆత్మలు' అని పిలువబడుచున్నారు. యేసు ప్రభువు ఈ లోకములో నుండి పరిచర్య చేయుచున్న దినములలో దేవదూతలు ఎప్పుడు పరిచర్య చేయుచుండేవారు. వారందరు ఆయనకు పరిచర్య చేయుటకు సిద్ధముగా ఉండేవారు. బైబిల్ నుండి మత్తయి 26:53వ వచనములో చూచినట్లయితే, "ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?'' ప్రకారం అవును దేవదూతలు పరిచర్య చేయు ఆత్మలుగా కూడా ఉంటున్నారు.

బైబిల్ నుండి లూకా 22:43వ వచనమును చూచినట్లయితే, యేసుక్రీస్తు చెరపట్టడానికంటె ముందుగా ఆయన ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి, "ఆయనను బలపరచెను'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కొంతమంది దేవదూతలు మన కలలో మరియు దర్శనములలో కనబడి, దేవుని వర్తమానమును తెలియజేస్తారు. కొందరైతే, స్వయంగా వారి కళ్లతోనే, దేవదూతలను కూడా చూడగలుగుతారు. దేవదూతలు వారిని కాపాడడము చూస్తారు. అనేక విధాలుగా, దేవదూతలు దేవుని ప్రజలకు పరిచర్య చేస్తుంటారు మరియు దేవదూతలు అతి వేగముగా పనిచేస్తారు. అందుకొరకే, 'వాయువుల వలె దేవదూతలు పరిచారము చేస్తారు' అని సెలవిచ్చుచున్నది. రెండవదిగా దేవుని దూతలు వారికి పరిచారము చేయుచున్నారు. బైబిల్ నుండి హెబ్రీయులకు 12:29వ వచనమును చూచినట్లయితే, " దేవుడు దహించు అగ్నియై యున్నాడు'' అని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని యొక్క శక్తికి ఇది ఒక సూచనగా ఉంటూ ఉన్నది. ప్రభువు తన ప్రజలను అగ్నితో శుద్ధీకరించి, వారి పాపములన్నిటి నుండి కూడా విడుదల కలుగజేస్తాడు. ప్రభువు ఎప్పుడైతే, మనతో నివాసము చేస్తాడో, ఇక పాపము ఎంతమాత్రము కూడా మనలో నివసింపజాలదు. బైబిల్ నుండి ప్రకటన 19:12వ వచనము ప్రకారము "ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి,'' అని చెప్పబడియున్నది. అగ్ని ఎల్లప్పుడు దేవుని సన్నిధానమునకు సంబంధము కలిగియుంటున్నది.

నా ప్రియులారా, మీ యొక్క ప్రోత్సాహర్థము కొరకై నేను మీతో ఈ విషయమును పంచుకోవాలని కోరుచున్నాను. సాధారణముగా కూడికల అనంతరముగా మేము వ్యక్తిగతంగా ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటాము. ప్రజలు వరుసలో నిలుచుని ప్రార్థన కొరకు కనిపెడుతూ ఉంటున్నప్పుడు, అపవాది చేత పీడింపబడుచున్నటువంటి ఒక స్త్రీ, మంట, మంట అని బిగ్గరగా అరుస్తూ కేకలు వేయుటకు ప్రారంభించినది. నాకు సమీపముగా ఆమె వచ్చుచున్న కొలది, ఆమె ఇంకా అధికముగా అరవడము మొదలు పెట్టడము జరిగింది. నేను ఆమె మీద చేతులుంచినప్పుడు వెంటనే, ఆమెలో ఉన్న దుష్ట శక్తులు ఆమెను విడిచి వెళ్లిపోయినవి. ప్రభువు దురాత్మలను కూడా అగ్ని వలె దహించివేస్తాడు. ప్రభువు తన పరిచారకులను అగ్ని జ్వాలలుగా చేయుచున్నాడు. ప్రతి దైవజనుడు కూడా దేవుని సన్నిధితో నింపబడి ఉండాలి. నా ప్రియులారా, ఈ రోజు కూడా దేవుని యొక్క అగ్ని మరియు ఆయన శక్తి మీ అందరి మీదికి దిగివచిచ్చునట్లుగా చేస్తాడు. దేవుడు అగ్నిజ్వాలల వలె మిమ్మును వాడుకొనును గాక. రానున్న దినములలో మిమ్మును అధికముగా తన ఆత్మచేత నింపి, బహుగా వాడుకొంటాడని నేను నమ్ముచున్నాను. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును నీ యొక్క అగ్ని అభిషేకముతో నింపుము. దేవా, మాలో ఉన్న ప్రతి పాపమును మరియు ప్రతి దుష్ట అలవాటును నీ యొక్క సన్నిధితోను మరియు నీ అగ్ని చేత దహించివేయునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి దుష్ట తలంపులు మా హృదయములో నుండి, మా మనస్సులో నుండి నీ అగ్ని చేత బయటకు వచ్చునట్లుగా చేయుము. దేవా, మమ్మును నీ యొక్క అగ్ని చేత మరియు మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మచేత నింపి, మమ్మును పరిశుద్దులనుగా చేయుము. ప్రభువా, దేవదూతలు పరిచర్య చేయుట మేము చూచునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము నీకు సమీపముగా ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నీవు పరలోక సైన్యములను ఆజ్ఞాపించి, నీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి నీ దేవదూతలను వాయువులుగా పంపినందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ప్రభువా, మమ్మును నీ చేతులకు అప్పగించుచున్నాము, కనుకనే, నీ యొక్క అగ్ని జ్వాలగా చేసి, నీ సన్నిధితో మమ్మును పరిశుద్ధపరచుము. యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు దేవదూతలు ఆయనకు సేవ చేసినట్లుగానే, వారు మమ్మును ఆవరించి, మా బలహీన సమయాలలో మమ్మును బలపరచుము. దయచేసి ప్రభువా, మాలోని ప్రతి పాపాన్ని, భయాన్ని, చీకటిని నీ పవిత్ర అగ్నితో దహించివేయుము, మరియు మా జీవితాన్ని నీ మహిమతో ప్రకాశింపజేయుము. దేవా, ప్రతిరోజూ నీ బలంతో నడవడానికి మరియు నీ వెలుగును ఇతరులకు తీసుకువెళ్లడానికి మాకు సహాయం చేయుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచుఆన్నాము తండ్రీ, ఆమేన్.