నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీకు సమాధానమును, భద్రతను అనుగ్రహించుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి! నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 46:27 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతివారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మీకు తోడుగా ఉన్నానని మీకు వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, భయపడకండి లేదా నిరుత్సాహపడకండి. ఆయన మిమ్మును, మీ కుటుంబమును విడిపించి, మీ జీవితమును తన సమాధానంతో మరియు దైవీకమైన కాపుదలతో నింపి, మిమ్మును రక్షిస్తాడు.
అందుకే బైబిల్ నుండి యోహాను 14:27వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో చూచినట్లయితే, " శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి '' అని చెప్పబడినట్లుగానే, యేసు, తన సమాధానమును మాత్రమే మీకు అనుగ్రహించుచున్నాను, అది లోకము ఇచ్చుచున్న తాత్కాలికమైన సమాధానము కాదు. కానీ ప్రతి భయమును మరియు ఆందోళనను నిమ్మళింపజేయుచున్న ఆయన నిత్యమైన సమాధానమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 147:14వ వచనములో చూచినట్లయితే, తనయందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై యున్నాడు '' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మీ సరిహద్దులలో సమాధానమును స్థిరపరుస్తాడు. మీరు చేయుచున్న ప్రతి పనిలోనూ, మీకు చెందిన ప్రతి కార్యములలోను, ఆయన సమాధానమును మీకు కలుగజేయుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీ జీవితము చుట్టు సమాధానము అను కంచెను నిర్మిస్తాడు. తద్వారా ఆయన మీకు అనుగ్రహించిన ఆశీర్వాదములను ఎవరు కూడా అపహరించలేరు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:6-7 వ వచనములలో చూచినట్లయితే, " దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును '' అని చెప్పబడిన ప్రకారము మీరు చింతించడం మాని, మీ యొక్క ప్రతి విన్నపమును ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసినప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన ఆయన యొక్క సమాధానము మీ హృదయమును మరియు మనస్సునకు కావలి ఉంటుంది. అంతమాత్రమే కాదు, మీ పిల్లలకు ప్రభువు ఉపదేశమును చేస్తాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 54:13వ వచనములో చూచినట్లయితే, నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును'' అని చెప్పబడినట్లుగానే, దేవునిచేత ఉపదేశింపబడతారు. వారికి విశ్రాంతి అధికముగా ఉంటుంది. ప్రభువు ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని నేడు మీ కుటుంబమునకు అనుగ్రహించుచున్నాడు.
నా ప్రియులారా, మన ప్రభువు మీకు సమాధానకర్త మాత్రమే కాదు, మీకు ఆశ్రయముగా కూడా ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 46:1వ వచనములో చూచినట్లయితే, " దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనకు ఆశ్రయమును బలమైన దుర్గముగా ఉన్నాడు; ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. కనుకనే, ఆయన మిమ్మును తన ప్రేమపూర్వక కౌగిలిలోనికి తీసుకొని మిమ్మును హత్తుకొని, పైకి లేవనెత్తి, ఎవరు కూడా మిమ్మును పట్టుకోలేనంతగా సురక్షితమైన స్థానములో ఉంచుతాడు. అందుకే బైబిల్ నుండి సామెతలు 18:10వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును'' అని చెప్పబడినట్లుగానే, యేసు నామమును ఆశ్రయించి, ఆయన దైవీకమైన సంరక్షణను అనుభవించుటకు ఆయన చేతులకు మీ జీవితములను అప్పగించి, 'ప్రభువా, నేను పరుగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చియున్నాను; నన్ను నీ చేతులలో మోయుము'' అని ఆయనను వేడుకున్నట్లయితే, ప్రభువు చిన్న పిల్లలను ప్రేమతో తన చేతులలో మోసినట్లుగానే, ప్రతి సవాలు మరియు కష్టములోనూ ఆయన మిమ్మును తన చేతులలో మోయుచున్నాడు.
అందుకే బైబిల్ నుండి రోమీయులకు 16:20వ వచనములో చూచినట్లయితే, " సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును'' అని చెప్పబడినట్లుగానే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుంటాడు. అంతమాత్రమే కాదు, సమాధానకర్తయైన దేవుడు త్వరలోనే సాతానును మీ పాదముల క్రింద చితుకత్రొక్కిస్తాడు. కనుకనే, మీరు నయపడకండి. ఆలాగుననే, బైబిల్ నుండి సామెతలు 16:7 వ వచనములో చూచినట్లయితే, " ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును'' అని చెప్పబడినట్లుగానే, మన ప్రవర్తన ప్రభువుకు ఇష్టమైనప్పుడు, ఆయన మన శత్రువులను కూడా మనతో సమాధానముగా ఉండునట్లుగా మిత్రులనుగా చేస్తాడు. ఎందుకనగా, ప్రభువు తానే, మన పక్షముగా యుద్ధము చేస్తాడు, మీకు విరోధముగా వచ్చు వారిని చివరికి మీతో సమాధానము కోరుకుంటారు.
అదే మనము బైబిల్‌లో పాతనిబంధన గ్రంథములో చూచినట్లయితే, ఇస్సాకు జీవితంలో ఇది చక్కగా వివరించబడుట మనము చూడగలము. ఇస్సాకు తన తండ్రి తవ్విన బావులన్నిటిని మరియు అతను తవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు పూడ్చివేశారు. అయినప్పటికిని, ఇస్సాకు ఎన్నడు కూడా వారితో వాదించలేదు, పోరాడలేదు. అందుకు బదులుగా, ఇస్సాకు సహనముతో నూతన బావులను త్రవ్వడం కొనసాగించాడు. చివరకు అబీమెలెకు ఇస్సాకు వద్దకు వచ్చి, అతనికి తోడుగా దేవుని హస్తము ఉన్నదని గుర్తించాడు; ప్రభువు అతనికి తోడుగా ఉన్నందువలననే ఇస్సాకు విత్తినదంతయు నూరంతల పంటను ఇచ్చినదనియు, అతడు త్రవ్విన బావులన్నియు నీళ్లు ఇచ్చాయని తెలియజేసియున్నాడు. దేవుని కటాక్షము అతని మీద ఉన్నదని గుర్తించి, అతనితో సమాధాన ఒప్పందము చేయవలెనని అబీమెలెకు కోరుకున్నాడు. దేవుని కటాక్షముము మీద ఉన్నదని గుర్తించి, సమాధానము ఒడంబడిక చేసుకోవలెనని అతను ఇస్సాకును కోరుకున్నాడు. అదే ఆశీర్వాదము మీకు కూడా వర్తించుచున్నది. మీరు ప్రభువు నామమును ధరించియున్నారు. కాబట్టి, ఆయన మిమ్మును నిత్యమును సమృద్ధిగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నా ప్రియులారా, ఒత్తిడిచేత మధ్యలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విస్తరించియున్నారో, అలాగే మీరు కూడా ఎలాంటి వ్యతిరేకత ఉన్నప్పటికిని వర్థిల్లుతారు. కాబట్టి, ధైర్యంగా ఉండండి. బైబిల్ నుండి కీర్తనలు 23:5వ వచనములో చూచినట్లయితే, నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది '' అని చెప్పబడినట్లుగానే, నేడు మీరు ఇస్సాకు వలె దేవునితో సహవాసము కలిగియున్నప్పుడు, ప్రభువు మీ శత్రువుల మధ్యలో కూడా మీ కొరకు ఒక భోజనపు బల్లను సిద్ధపరచి, మీ గిన్నె నిండి పొర్లునట్లుగా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును వర్థిల్లింపజేసి, మిమ్మును కాపాడి సంరక్షిస్తాడు. మరియు మీకు నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన ఆశ్రయంలో, మీరు వర్ధిల్లుతారు మరియు ఆయన సమృద్ధియైన సమాధానమును మీరు అనుభవించునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క శాంతిని మాకు అనుగ్రహించి, మాకు బలమైన ఆశ్రయముగా ఉంటావని మా పట్ల వాగ్దానము చేసినందుకై నీకు వందనములు. యేసయ్యా, మాలో ఉన్న భయము లేదా ఆందోళన లేకుండా నిన్ను విశ్వసించి, నీ ప్రేమ ద్వారా నీ సన్నిధిలో సురక్షితంగా విశ్రమించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క దివ్యమైన శాంతితో మమ్మును మరియు మా కుటుంబమును ఆవరించునట్లుగాను, మా యొక్క ప్రతి ప్రమాదం నుండి మమ్మును కాపాడుము. ప్రభువా, నీ యొక్క శక్తివంతమైన రెక్కల క్రింద మేము సురక్షితంగా ఉండునట్లుగా మాకు నీ యొక్క కృపను అనుగ్రహించి, మా హృదయములలోను, మా గృహములలోను మరియు మా జీవితములోని ప్రతి రంగంలో నీ శాంతి మా మీద అధికారము చేయునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ జ్ఞానంతో మా పిల్లలకు బోధించి, వారిని ఆశీర్వదించి, నీ యొక్క మార్గములలో వారిని నడిపించుము. ప్రభువా, మా పక్షమున ప్రతి యుద్ధంలో పోరాడుము. దేవా, మా జీవితములో వివాదము ఉన్నచోట సక్యతను కలుగజేసి, మా శత్రువు యొక్క ప్రతి కార్యముల మీద మాకు జయమును అనుగ్రహించుము. యేసయ్యా, మా మీద రాజ్యము చేయు సాతానును చీఘ్రముగా మా పాదముల చితుకత్రొక్కించుము. దేవా, నీ దయ కనికరము, రక్షణ మరియు సమృద్ధియైన ఆశీర్వాదములు నిత్యము మాతో ఉండునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత నీకే చెల్లించుచు యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


