నా ప్రియమైన స్నేహితులారా, మనం సంవత్సరాంతమునకు వచ్చియున్నాము. మన జీవితములో ఈ సంవత్సరమంతయు దేవుడు చేసిన మేలులన్నిటిని జ్ఞాపకము చేసుకుని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇదే సరైన సమయం. ఈ సమయములో కూడా నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 6:9వ వచనం ప్రకారం దేవుడు మీకు తన ఆశీర్వాదాలను వాగ్దానం చేయాలని కోరుచున్నాడు: "మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము'' అని చెప్పబడిన ప్రకారము మీరు మేలు చేయుట యందు విసుకక ఉండవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ మీరు ఎంతో మేలు చేసినప్పటికిని, మీకు తగిన ప్రతిఫలము మరియు అందుకు తగిన ఆశీర్వాదములను పొందుకొనకపోయినట్లయితే, నిరాశ చెందకండి. నా ప్రియ స్నేహితులారా, ఇందువలన మీరు ఉన్నత స్థితికి చేరుకోలేదు అని చింతించకండి. కానీ, దేవుడు మీ యొక్క నమ్మకత్వమును చూచుచున్నాడు మరియు ఆయన మీరు చేసిన మేలులన్నిటిని జ్ఞాపకము చేసుకొని, తగిన కాలమందు మీకు ప్రతిఫలమును తప్పకుండా అనుగ్రహించును.
ఒక హోటల్‌లో గదులను శుభ్రపరిచే పనిని చేయుచున్న ఒక మహిళ ఉండేది. ఆమె గదులను శుభ్రం చేసేది, కానీ ఆమె తన పనిని అంత నిజాయితీగా మరియు సంపూర్తిగా చేసేది. కాబట్టి ప్రతి విషయం మెరిసేలా, పూర్తిగా శుభ్రంగా ఉండేది. ఇంకను మంచం పరుపుల మూలలు కూడా చక్కగా సర్ది ఉన్నాయి, బాత్రూమ్‌లు శుభ్రంగా మరియు సువాసనతో నిండి ఉన్నాయి మరియు నేలలు దుమ్ము, ధూళి లేకుండా ఎంతో శుభ్రంగా ఉన్నాయి. ఇతరుల కోసం గదిని అందంగా తయారు చేయడంలో ఆమె ఆనందం పొందేది. కానీ కృతజ్ఞత చూపుటకు బదులుగా, ప్రజలు ఆమెను ఎగతాళి చేశారు. ఆమె సహోద్యోగులు ఆమెను చూసి నవ్వుతూ, నువ్వెందుకు ఇంత నిజాయితీగా ఉంటున్నావు? ఎందుకు అంత పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు? నిన్నెవరు చూడబోవుచున్నారు? అని అన్నారు. అయినప్పటికిని, ఆమె సంవత్సరాల తరబడి తన పనిని ఎంతగానో నమ్మకత్వముతో కొనసాగించినది.
చాలా సంవత్సరాలు గడిచాయి, ఒక రోజు సూపర్వైజర్ ఉద్యోగం వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు ఉన్నతాధికారి, సూపర్వైజర్‌గా మనం ఎవరిని నియమించాలి? అని అడగడం ప్రారంభించాడు. తన పనిని ఎంతో పరిపూర్ణంగా చేయుచున్న ఈ మహిళను గురించి వారు విన్నారు. ఆమెను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి, మిగతా వారందరికి పైగా సూపర్‌వైజర్‌గా ఆమెను నియమించారు. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మిమ్మును ఎవ్వరూ గుర్తించకపోయినను సరే, మంచి కార్యములు చేయడం ఆపవద్దు. దేవుడు మీరు చేయుచున్న సమస్త మంచి కార్యములను చూస్తున్నాడు. కనుకనే, మీరు రహ్యముగా చేసిన ప్రతి మంచి పనికి ఆయన సరైన సమయంలో మీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు నిరీక్షణ విడిచిపెట్టకుండా, మీరు మేలు చేయుట యందు విసుకక యుండినట్లయితే, మీరు అలయక మేలు చేసినట్లయితే, నిశ్చయముగా తగినకాలమందు మీరు పంట కోయుదురు. ఆలాగుననే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ సంవత్సరమంతయు మాతో నడిచినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మేము అలసిపోయినట్లుగా లేదా గుర్తించబడలేదని తలంచినప్పుడంతయు నీవు మా ప్రతి కదలికను గమనిస్తున్నావనియు దయచేసి మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నిరుత్సాహపడకుండా మరియు మేలు చేయుట యందు అలయక ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మనుష్యుల నుండి మంచిపేరు రాకపోయినప్పటికిని కూడా మా హృదయమును బలపరచుము. దేవా, ఎవరు చూడకపోయినను సరే, అంతము వరకు మేము నమ్మకంగా ఉండటానికి మాకు నేర్పించుము. ప్రభువా, తగిన సమయములో తగిన ప్రతిఫలమును పొందుకొనుట యందు విసుకక ఉండునట్లుగాను, మేము నీ యందు నమ్మకము కలిగియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీ వాగ్దానం ప్రకారం అలయక మేలు చేయుచూ, తగిన కాలమందు పంట కోయుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈ రోజు నీవు అనుగ్రహించు ఆశీర్వాదములన్నిటిని మేము విశ్వాసంతో పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


