నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానము బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును'' అని సెలవిచ్చిన ప్రకారము ఈ లోకమంతయు దుష్టత్వముతో నిండియున్నది. మన చుట్టు ఉన్నఎంతో మంది కూడా దుష్టత్వమును కలిగి ఉంటారు. అయినను, మనము ప్రభువు చేత దీవించబడినప్పుడు, వారు మనలను చూచి అసూయపడి, మనకు కీడు చేయాలని తలంచుచు ఉంటారు. మన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు వీరందరు కూడా దైవజనులై ఉండియున్నారు. కానీ, వారందరు దేవుని ఎంతో జాగ్రత్తగా వెదకేవారు. అయితే, వారి వారి జీవితాలలో వారు అనేక కీడులను మరియు దుష్టత్వమును ఎదుర్కొన్నారు. యోసేపు తన స్వంత అన్నదమ్ముల వలననే అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ, వారు అతని జీవితమును నశింపజేయాలని అనుకున్నారు. యోసేపు తన తండ్రితో పాటు దేవుని జాగ్రత్త వెంబడించాడు గనుకనే, వారు యోసేపు జీవితమును నశింపజేయాలని తలంచారు. అయితే, దేవుడు ఏ విధంగా అతనిని కాపాడాడో, బైబిల్ గ్రంథములో మీరు చదవండి. ఎందుకనగా, యోసేపు దేవుని మార్గములను ఎంతో జాగ్రత్తగా వెంబడించాడు. కనుకనే, అతడు సమస్త దుష్టత్వము మరియు కీడు నుండి కాపాడి, ఉన్నత స్థానమునకు హెచ్చించబడ్డాడు.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, దేవుని మీరు గట్టిగా పట్టుకొని హత్తుకొనండి. ఒకవేళ మీ స్వంత గృహములో ఉన్నవారే మిమ్మును కష్టపెడుతుండవచ్చును. వారు మీ జీవితాలను నశింపజేయాలని అనుకోవచ్చును. అయితే, మీరు చింతించకండి. ప్రభువు వైపు చూడండి. యోసేపు దేవుని వైపు చూశాడు. అతడు ఎల్లప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలను మాత్రమే చేయాలనుకునేవాడు. కనుకనే, తనకు విరోధముగా వచ్చిన దుష్టత్వమును జయించాడు. నా ప్రియులారా, అదేవిధముగా మీరు కూడా చేయండి. దేవునికి ఇష్టమైన కార్యాలను మాత్రమే చేయండి, దేవుని వాక్యమును చదవండి, ఎల్లప్పుడు ప్రార్థన చేయుచూ, ఆయన మార్గములను వెంబడించినప్పుడు ప్రభువు మీతో ఉంటాడు. ఆయన మీ జీవితాలను స్థిరపరుస్తాడు. మిమ్మును వెంబడించే దుష్టత్వము నుండి ఆయన మిమ్మును కాపాడి సంరక్షిస్తాడు.
మా స్వంత జీవితములోను మరియు పరిచర్యలోను అనేకమైన కీడులను మేము ఎదుర్కొనేవారము. మేము సమస్యలను ఎదుర్కొనే ప్రతిసారి, మేము దేవుని వైపు చూస్తూ, ఆయన పాదములను గట్టిగా పట్టుకొనే అలవాటును ప్రభువు మాకు నేర్పించియున్నాడు. ప్రార్థన, ప్రార్థన మూలముగా మాత్రమే ప్రభువును ఎంతో సమీపముగా కలిగియుండేవారము. అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, నేటి నుండి మీరు కూడా చేసినప్పుడు, ప్రభువు మిమ్మును ఎన్నడును క్రిందకు పడద్రోయడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నిశ్చయముగా, మీకు విరోధముగా ఎటువంటి దుష్టత్వము వచ్చినను సరే, దేవుడు దాని నుండి మిమ్మును విడిపించి, మీ సమస్యల నుండి మీరు ఇప్పుడే విడుదల పొందుకొనునట్లుగా మీకు కృపను అనుగ్రహిస్తాడు. కనుకనే, మీరు ఈ లోకములో ఉన్న దుష్టత్వమును చూచి భయపడకండి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీ కుమారుని ద్వారా నీవు మాకు కలుగజేసిన రక్షణకై నీకు వందనములు. దేవా, మేము దుష్టుల ద్వారా చుట్టుకొనబడియున్నప్పుడు మేము నిన్ను గట్టిగా పట్టుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు మాత్రమే మా నిరీక్షణయై యున్నావు. యేసయ్యా, నీవు మాత్రమే మా రక్షణ మరియు సంతోషమై యున్నావు. ప్రభువా, నీవు మా వైపు చూడుము, దుష్టత్వముతో నిండుకొనియున్న మమ్మును దృష్టించి, మా దుష్టత్వము నుండి కాపాడుము. తండ్రీ, మేము నీ మీద మా పూర్తి నమ్మకాన్ని ఉంచునట్లుగాను మరియు నీ దైవీక రక్షణ కొరకు మేము నీ పాదాలను అంటిపెట్టుకుని ఉండునట్లుగాను చేయుము. ప్రభువా, మా ఏకైక నిరీక్షణ, బలం మరియు ఆనందం నీవు మాత్రమే. ప్రభువా, దయచేసి మా కొరకు సమస్తమును సంపూర్ణం చేయుము. దేవా, ఇప్పుడు కూడా మా వైపు చూడుము. ప్రభువా, మేము నీ బిడ్డలము కాబట్టి ఎల్లప్పుడు మేము నీతో ఉండునట్లుగాను, నీవు మాతో ఉండే అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, దయచేసి మా మార్గములన్నిటిలోను మమ్మును నడిపించుము మరియు నీ మహిమైశ్వర్యము చొప్పున మమ్మును సంపూర్ణముగా ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


