నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 28:20వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, "నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును...'' అని చెప్పబడినట్లుగానే, నమ్మకమైనవారుగా మనము ఉండవలెనని మన ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మనము నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. నా ప్రియ స్నేహితులారా, మీరు నమ్మకమైన వ్యక్తులుగా ఉన్నారా? అని మీ జీవితమును ఒకసారి పరీక్షించుకొనండి. ఆలాగుననే, మీరు దేవుని వెంబడించుటలో ఆయనకు నమ్మకముగా ఉన్నారా? మీరు దేవుని ప్రేమించుటలో నమ్మకస్థులుగా ఉన్నారా? దేవుని యెదుట మంచి కార్యములు చేయుటలో మీరు నమ్మకస్థులుగా ఉన్నారా? మీరు నమ్మకస్థులుగా ఉన్నట్లయితే, దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవిస్తాడు. ఇంకను మీరు నమ్మకస్థులుగా ఉన్నప్పుడు, మీరు ప్రభువు చేత అత్యంత అధికముగా హెచ్చింపబడతారు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 1:9వ వచనములో చూచినట్లయితే, " మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు'' అని చెప్పబడినట్లుగానే, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి. ఇంకను బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:3వ వచనములో చూచినట్లయితే, "అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును'' అని చెప్పబడినట్లుగానే, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎటువంటి స్థితిలోనైనను మిమ్మును కాపాడుతాడు.

చూడండి బైబిల్ గ్రంథములో దావీదును గూర్చి మనము చదివినట్లయితే, దావీదు దేవునితో అన్యోన్యసహవాసమును కలిగియున్న వ్యక్తిగా ఉండుట మనము చూడగలుగుచున్నాము. అతడు ఒక గొఱ్ఱెల కాపరి మాత్రమే. కానీ, అతడు ప్రభువును ఎంతగానో ప్రేమించి, తన స్నేహితునిగా కనుగొన్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, " యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని చెప్పబడినట్లుగానే, దావీదుకు కాపరిగా ఉన్నట్లుగానే, నేడు దేవుడు మనకు కూడా కాపరిగా ఉన్నాడు. అవును, బైబిల్ నుండి కీర్తనలు 23వ అధ్యాయమంతయు చదివినట్లయితే, ఆ అధ్యాయములో, ప్రతి వాక్యము ఎంతో అద్భుతముగా ఉంటుంది. హల్లెలూయా! అవును, నా ప్రియులారా, ప్రభువును మీరు కాపరిగా కలిగియున్నట్లయితే, సమృద్ధియైన దీవెనలను మీరు పొందుకుంటారు. హల్లెలూయా! దావీదు తన జీవిత కాలమంతయు కూడా దేవుని సన్నిధానములో ఉండియున్నాడు. కానీ, అతడు అనేక సమస్యలను మరియు శోధనలను ఎదుర్కొన వలసి వచ్చినది. హల్లెలూయా! నేను దేవుని సన్నిధానముతో నింపబడి, అనేకసార్లు హల్లెలూయా! అని చెబుతున్నాను. కనుకనే, నా ప్రియులారా, ప్రభువు నేడు మీతో కూడా ఉన్నట్లయితే, మీరు కూడా అదే ఆనందముతో నింపబడతారు.

నా ప్రియులారా, అదేవిధముగా, దావీదు కూడా దీవించబడ్డాడు. దావీదు ఒక గొఱ్ఱెల కాపరి. అతడు ఒక గొప్ప రాజుగా మారియున్నాడు. అదేవిధముగా, నా స్నేహితులారా, మీరు కూడా దీవించబడతారు. నమ్మకస్థులుగా ప్రభువును వెంబడించండి. హల్లెలూయా! అప్పుడు ప్రభువు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించి, ఇతరుల యెదుట ఘనపరుస్తాడు. దావీదును స్థిరపరచిన అదే నమ్మకమైన దేవుడు నేడు మిమ్మును కూడా స్థాపించి, ప్రతి దుష్టత్వము నుండి మిమ్మును కాపాడి, తన సమృద్ధియైన ఆశీర్వాదములతో మీ జీవితమును నింపుతాడు. రండి, ఇప్పుడు మనము కలిసి ప్రార్థించుదాము. నా ప్రియులారా, నేడు మీ నమ్మకత్వమును చూచి, ప్రభువు వచ్చి మిమ్మును ఘనపరచి, నేటి వాగ్దానము నుండి మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమును బట్టి నీకు వందనములు. దేవా, నీవు మా యొక్క జీవితములను దృష్టిని ఉంచుము. ప్రభువా, మేము నీయందు నమ్మకస్థులముగా ఉండుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్య, నీ గొప్ప సన్నిధానమును బట్టి, మమ్మును ఉన్నత శిఖరములకు లేవనెత్తుము. దేవా, మాకు కావలసిన అవసరతలన్నిటిని క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో తీర్చుము. ప్రభువా, మేము నీ శక్తితో నింపబడి, సమృద్ధిగా దీవించబడునట్లుగాను మరియు నీ యొక్క మహిమార్థమై ప్రకాశించునట్లుగా మమ్మును వాడుకొనుము. దేవా, నీ మహిమార్థమై మేము నీకు నమ్మకముగా జీవించునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మా పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించడానికి మరియు నిన్ను ప్రేమించుటలోను, నీకు విధేయత చూపుటలో నిలిచియుండటానికి దయచేసి మాకు నేర్పుము. ప్రభువా, నీవు మాకు కాపరిగా ఉండి, మా యొక్క ప్రతి పోరాటం, శోధన మరియు భయం నుండి మమ్మును విడిపించుము. దేవా, నీవు దావీదును సమృద్ధిగా ఆశీర్వదించినట్లుగానే, నీ కృప మా జీవితము మీద కూడా నిలిచి యుండున ట్లుగా చేయుము. ప్రభువా, నీ యందు సంపూర్ణముగా నమ్మకముంచడానికి మరియు అనుదినము నీతో సన్నిహితంగా నడవడానికి మాకు నేర్పించుము. దేవా, మా జీవితం నీ యొక్క మెండైన దీవెనలతో నింపి, నీ నామమునకు మహిమను కలుగజేయునట్లుగా కృపను దయచేయుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.