నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు. నేను మిమ్మును అందరిని పలకరించడం నాకెంతో సంతోషముగా ఉన్నది. మీకందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 30:9వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను...నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును '' ప్రకారము మీ చేతి పనులన్నిటి విషయములోను...మీకు మేలు కలుగునట్లు మిమ్మును వర్ధిల్లజేయును. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి సామెతలు 10:22వ వచనమును చూచినట్లయితే, "యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' ప్రకారము దేవుడు మీకు ఇచ్చు ఆశీర్వాదము ఎన్నటికిని నరుల కష్టముచేత ఎక్కువ కాదు. ఈ ఆశీర్వాదములన్నిటిని ఎప్పుడు మీరు పొందుకుంటారు? అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 30:8 వ వచనములో చూచినట్లయితే, " నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుందువు'' ప్రకారము దేవుని ఆజ్ఞలన్నిటిని గైకొని, వాటిని అనుసరించినప్పుడు, దేవుని యొక్క సమృద్ధియైన దీవెనలన్నియు మీ మీదికి వచ్చును. అవును, ఆయన అడుగుజాడలను మనము వెంబడించినప్పుడు ఆ యాశీర్వాదములను మనము పొందుకొనగలము.

నా ప్రియులారా, మనలో ప్రతిఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సరియైన మాదిరియై ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 10:30వ వచనములో చూచినట్లయితే, యేసు ప్రభువు, " నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.'' అదేవిధముగా, యేసుక్రీస్తు తన తండ్రి యొక్క మాటలన్నిటిని గైకొని, ఆలాగున చేయుచు, ఎంతో జాగ్రత్తగా తండ్రిని వెదకెను అని ఆ వచనములో చెప్పబడుట మనము చూడగలము. తన తండ్రి చెప్పిన కార్యములన్నిటిని చేయుచూ, తండ్రిని ఎంతో జాగ్రత్తగా యేసయ్య వెదకియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని చిత్తమును మనము నెరవేర్చాలి. మొట్టమొదటగా, మనము అన్నివేళలలో ప్రభువుకు ఇష్టకరముగా జీవించాలి. అందుకొరకు మన హృదయమంతటితో ఆయనను మనము వెదకుచుండవలెను.

నా భర్తగారైన డా.డి.జి.యస్ దినకరన్‌గారు స్టేట్ బ్యాంకులో పనిచేసెను. ఆ సమయములో ఆయనగారు ఎంతో కష్టపడి పనిచేస్తుండేవారు. అయితే, ప్రతిరోజు ఉదయముననే, ఆరుగంటలకు లేచి, మేమందరము కలిసి ఒక ఆరగంట సమయమైనను కుటుంబ ప్రార్థనను చేసుకొనేవారము. ఆలాగుననే, ఆరున్నర గంటల తర్వాత మరియు ఎనిమిదిన్నర గంటల వరకు ఆయన ఒక్కరే బైబిల్‌ను తీసుకొని దేవునితో సమయమును గడిపేవారు. ఆవిధంగా, దేవుని ఎంతో జాగ్రత్తగా వెదికేవారు. కనుకనే, దేవుడు ఆయన యొక్క బ్యాంకు పనులన్నిటిలో ఎంతో దీవించాడు. అంతమాత్రమే కాదు, ఉన్నత శిఖరములకు ఆయనను లేవనెత్తాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని వాక్యమును చదువుచూ, ఆయన మార్గములను జాగ్రత్తగా వెంబడించాలి మరియు దేవునికి ఇష్టమైనటువంటి కార్యములను ఎల్లప్పుడు చేయుచు ఉండాలి. అప్పుడు దేవుడు మీ చేతి పనులన్నిటిని వర్థిల్లింపజేస్తాడు. సహోదరులు దినకరన్‌గారి యొక్క తన బ్యాంకు పనులన్నిటిలో దేవుని యొక్క దీవెనలు పొందుకొనిన రీతిగానే, మనమందరము కూడా దీవించబడాలని ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేయుదము. కనుకనే, మీ హృదయమంతటితో ఆయనను మీరు వెదకుచూ, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే, ఆలాగున చేసినప్పుడు, దేవుని యొక్క వర్థిల్లత మీ మీదికి వచ్చును. నేటి వాగ్దానము నుండి దేవుడు ఈ నూతన సంవత్సరమంతయు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, మేము చేయు పనులన్నిటిని నీవు సఫలపరుస్తావనియు, దానితో కూడా ఏ దుఃఖాన్ని చేర్చవని నీ ప్రేమపూర్వక వాగ్దానమునకై నీకు మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము నడవాలని నీవు కోరుకున్న నీ యొక్క మార్గములలో నడుచుటకు మాకు నేర్పించుము. దేవా, నీ వాక్యమును చదువుచు, నీ సన్నిధిలో సమయమును గడుపుటకు మాకు నీ కృపను దయచేయుము. అంతమాత్రమే కాదు, మేము కుటుంబముగా కలిసి, నీ సన్నిధిలో సమయమును గడుపుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ స్వరాన్ని పాటించడం మరియు నీ మార్గాలను అనుసరించడం మాకు నేర్పుము. దేవా, పూర్ణ హృదయంతో నిన్ను శ్రద్ధగా వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా ప్రతి ఆలోచన మరియు క్రియలలో మా జీవితం నిన్ను సంతోషపెట్టునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీవు నీ వాక్యంలో వాగ్దానం చేసినట్లుగానే, మా చేతుల పనిని ఆశీర్వదించుము. ప్రభువా, నీ మహిమ కొరకు మమ్మును లేవనెత్తుము. దేవా, మేము మా జీవితమును సంపూర్ణంగా నీ యొక్క ప్రేమపూర్వక హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, ఈ నూతన సంవత్సరమంతయు మా వ్యక్తిగత మరియు కుటుంబ జీవితములో వర్థిల్లతను మేము చూచుటకు నీ కృపను మాకు అనుగ్రహించుమని మన ప్రభువున ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.