నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 5:1వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఈ స్వాతంత్య్రము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు...'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, ప్రభువు మీకు ఈ రోజు స్వాతంత్య్రమును ఇచ్చియున్నాడు. మిమ్మును బంధకములలో ఉంచకుండా ఉండడాని కొరకై మరియు మీరు స్వేచ్ఛగా ఉండడాని కొరకై మీకు స్వాతంత్య్రమును ఆయన ఇచ్చియున్నాడు. మీరు స్వేచ్ఛగా ఉండాలనియు మీకు తన యొక్క స్వతంత్రతను అనుగ్రహించియున్నాడు. ఒకవేళ మీరు అపరాధ భావముతోను మరియు భయముతోను బంధీలుగా ఉన్నారేమో? ఒకవేళ మీరు గత పాపములచేత లేక పాత జ్ఞాపకముల చేత పీడింపబడుచున్నారేమో? మీరు యేసయ్యను విశ్వసించిన తర్వాత కూడా పాత జ్ఞాపకాలు మరియు అనుభూతులు అవన్నియు కూడా ఇంకను మిమ్మును బాధపరచుచున్నాయా? వీటన్నిటి నుండి మేము బయటకు రాలేకపోతున్నాను, మేము మారలేకపోవుచున్నాము అని అంటున్నారా? అయితే, ఈ రోజు యేసులో మీకు పూర్ణ స్వాతంత్య్రము కలదు.
ఎంతగానో ప్రాచుర్యము చెందిన ఒక కధ ఉన్నది. అందులో ఒక చిన్న ఏనుగును తీసుకొని ఒక తాడుతో ఒక చెట్టు మొద్దుకు కట్టివేశారు. అది చిన్నదిగా ఉన్నప్పుడు, అనేకసార్లు ఆ తాడును తెంపుకోవడాని కొరకు ఎంతగానో ప్రయత్నించినది. ఆలాగున, అనేకసార్లు ప్రయత్నించి, ప్రయత్నించి, నేను ఆ త్రాడును తెంపుకోలేను అనుకొని, ఇంక చివరికి వదిలివేసినది. కానీ, ఆ చిన్న ఏనుగు ఎదుగుచూ, బలమును పొందుకున్నప్పుడు, ఆ తాడు చేత బంధింపబడి, ఆ ఏనుగు అక్కడనే ఉండిపోయినది. ఏనుగుతో పాటు ఆ తాడు కూడా బలంగా మారినది అని కాదు గానీ, నేను ఇక్కడ నుండి ఇక తప్పించుకోలేను అని నమ్మింది కాబట్టి. అయితే,ఆ ఏనుగు చక్కగా బలంగా ఎదిగినప్పటికిని, ఆ చిన్న తాడు దానిని బంధించి, ఉంచగలదు అని ఏనుగు అనుకున్నది. దాని ఆలోచనలు ప్రవర్తన మీద ప్రభావము చూపించినవి. తద్వారా, అది ఆ బంధకములలో నుండి బయటకు రాలేకపోయినది.
అదేవిధముగా, నా ప్రియులారా, మనము ఎదుగుచు ఉన్నప్పుడు, మన పాత పాపములు, మనము గతములో చేసినటువంటి పాపములు ఇప్పుడు మనలను నియత్రించవచ్చును. ఒకవేళ గతములో వైఫల్యము చెందియుండవచ్చును. ఏదైనా విషయములో బాధపడియుండవచ్చును. లేదా అపరాధభావముగా ఉండి ఉండవచ్చును. అయ్యో! నా జీవితములో ముందు జరిగినది, ఇక మేము ఎప్పటికిని మారలేము, మేము ఇందులో నుండి బయటకు రాలేము అని అనుకుంటుండవచ్చును. అందును బట్టి మనము అదే స్థలములో చిక్కుకొనిపోయి ఉండవచ్చును. అదే భయముతో పీడింపబడుతూఉండవచ్చును. ఒకవేళ మనము ఇక ముందుకు వెళ్లలేము అని భావించవచ్చును. మీరు ఒక తప్పు చేసి, దేవుని క్షమించమని అడిగిన తర్వాత కూడా, ఇంకను అపరాధభావముతో బాధపడుచుండవచ్చును. అయితే, ఈ రోజు ప్రభువు మీకు పరిపూర్ణమైన స్వేచ్ఛను ఇవ్వాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైన విడుదలను ఇవ్వవలెనని మీ పట్ల కోరికను కలిగియున్నాడు. ఆలాగుననే, ఆయనతో పాటు నూతన జీవితమును కూడా మీకు ఇవ్వాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, ధైర్యముగా మీ అడుగును ముందుకు వేసి, సాగండి.
కాబట్టి, నా ప్రియులారా, మనలను మనము మొదటగా అపరాధులనుగా చూసుకోవడము మానివేయాలి. ఎందుకంటే, ప్రభువు మనలను శిక్షించడము లేదు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:1వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు'' అని చెప్పబడినట్లుగానే, కనుకనే, క్రీస్తు యేసునందున్న మీకు ఎటువంటి శిక్షావిధియు లేదు. నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మిమ్మును శిక్షించడము లేదు. అయితే, ఆయనతో పాటు నూతన జీవితమును జీవించునట్లుగా మారాలి అని కోరుకుంటున్నాడు. నీతిగల జీవితమును జీవించాలని కోరుచున్నాడు. అదియు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము. కాబట్టి, ఇదివరకు దేవుడు క్షమించిన విషయములను బట్టి, మిమ్మల్ని మీరు శిక్షించుకొనకుండా, దేవుని కృపను పొందుకొనుటకు ప్రయత్నించండి.
రెండవదిగా, ప్రభువు మీకు స్వాతంత్య్రమును మరియు స్వేచ్ఛను ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ భయమును కాదండి. అందుకే బైబిల్ నుండి 2 తిమోతికి 1:7వ వచనములో చూచినట్లయితే, "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికి తనముగల ఆత్మ నియ్యలేదు'' అని చెప్పబడినట్లుగానే, మనకు భయముగల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి, మీ యొక్క నిర్ణయముల పైన మీ యొక్క భయము మరియు ప్రభావమును చూపెట్టకూడదండి. నా ప్రియులారా, మీ యొక్క బాధ మరియు మీ యొక్క చింత, మీ యొక్క నిర్ణయముల మీద ప్రభావమును చూపెట్టవద్దు. అయితే, మీ యొక్క ప్రతి పనిని కూడా నిర్మలమైన మనస్సుతో చేయండి. ఇంకను దేవుడు మీ మీద కుమ్మరించుచున్న ప్రేమతో మీరు ప్రతి పనిని చేయండి. నిశ్చయముగా, మీరు స్వతంత్రను పొందుకుంటారు.
మూడవదిగా, ప్రభువు మీకు ఇచ్చినటువంటి స్వాతంత్య్రములో ముందుకు నడవండి. అందుకే బైబిల్ నుండి యోహాను 8:36వ వచనములో చూచినట్లయితే, "కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు'' అని చెప్పబడినట్లుగానే, ఒకవేళ మీరు అనేక బంధకాలలో బంధింపబడియుండవచ్చును. అయితే, ఈ వాక్యము ప్రకారము కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రులనుగా చేయుచున్నాడు. కాబట్టి, మీరు ఈ రోజు స్వస్థతను పొందుకొనుటకై మీరు నడుస్తుండగా మరియు విడుదలను పొందుకొనుటకై, స్వేచ్ఛను, ఇంకను స్వాతంత్య్రమును పొందుట కొరకు మీరు దేవుని యందు విశ్వసించండి. మీరు ఒంటరిగా లేరు అని మీరు నిశ్చయముగా తెలుసుకోవాలి. ఈ ప్రయాణములో ప్రభువు మిమ్మును అనుదినము నడిపించాలి అని అనుకుంటుండవచ్చును. కనుకనే, యేసులో ఉన్నటువంటి ఆ స్వాతంత్య్రమును మీరు అనుభవిస్తారు. శోధనలు మీ మార్గములో మీకు ఎదురవుచుండవచ్చును. వేర్వేరు ఆకర్షణలు మీ మార్గములు మీకు ఎదురవుతూ ఉండవచ్చును. ఇంకను ప్రతికూలతను తెలియజేసే స్వరాలు మీకు వినిపిస్తూ ఉండవచ్చును. అయితే, దేవుని వాక్యములో మీరు విన్నటువంటి మరియు చదివినటువంటి సత్యమును ఎప్పుడు మరచిపోకండి. ప్రభువు మిమ్మును స్వాతంత్రులనుగా చేసియున్నాడు అని ఎల్లప్పుడు విశ్వసించండి. నా ప్రియులారా, ఈ రోజు నుండి ఆ స్వతంత్రలో నడవండి. ఇప్పుడే ప్రభువు యొద్ద నుండి ఆ స్వాతంత్య్రమును పొందుకుందాము. నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, ఈ ఉదయకాలమున నీవు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్వాతంత్య్రమును బట్టి నీకు వందనములు. అవును, ప్రభువా, నీవు మమ్మును స్వతంత్రులనుగా చేసినందున మేము నిజముగా స్వతంత్రులముగా మారియున్నాము. దేవా, మేము స్వతంత్రులముగా ఉండునట్లుగా నీవు నీ యొక్క స్వాతంత్య్రమును మాకిచ్చినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము భయము చేత బంధింపబడియున్న దినములను సమాప్తము చేసి, మేము భయముచేత ఇక బంధింపబడకుండా, నీవిచ్చిన స్వతంత్రతను మేము అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుము. అపరాధ భావముచేత, బాధ మరియు చింత చేత, ఇంకను వేదన చేత మేము బంధించబడకుండా, నీ యొక్క పరిపూర్ణమైన స్వాతంత్య్రమును మాకు దయచేయుము. యేసయ్యా, మా పాపములను మేము ఒప్పుకొని, విడిచిపెట్టుటకును, వాటిని ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనకుండునట్లుగా నీ యొక్క క్షమాపణను మేము పొందుకొనునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మేము నీ ప్రేమను అనుభవించునట్లుగా ప్రతి రోజు నీతో కలిసి స్వాతంత్య్రములో నడవగలిగే కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన భవిష్యత్తులో మేము స్వేచ్ఛగా నడుచుటకును ఇక ఎంతమాత్రము బంధింపబడకుండా ఉండునట్లుగాను, నీవు మా భవిష్యత్తు కొరకు కలిగియున్న అద్భుతమైన ప్రణాళికలో మేము స్వేచ్ఛగాను ధైర్యముగా మా భవిష్యత్తులో అడుగుపెట్టునట్లుగా సహాయము చేయుము. దేవా, మేము నీ యొక్క శక్తితో, ప్రేమతోను, మంచి నడవడికతో, ఇంద్రియనిగ్రహముతో నింపబడునట్లుగా సహాయముచేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


