నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మిమ్మును పలకరించుట నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 51:12వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, " నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము'' ప్రకారం మీరు కోల్పోయిన రక్షణానందమును మీకు మరల పుట్టిస్తానని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, అనేకసార్లు రక్షణానందమును కోల్పోయినట్టుగా మనకు అనిపించవచ్చును. అది పాపము వలన, లేక యేసు ప్రభువును మోసపరచుట వలన, మన జీవితాలలో ఆయనను మరచిపోవడము వలనను ఉండవచ్చును. అందువలన, దేవునికి దూరముగా ఉన్నాము అన్నట్టుగా అనిపించవచ్చును. ఆరంభములో ఎంతగానో ప్రభువు కొరకు పనిచేయాలనే తపన, అగ్నిని కలిగియుండవచ్చును. అయితే, సమస్యలు ఎదురైనప్పుడు, పాపము మనలోనికి ప్రవేశించినప్పుడు, ఆ రక్షణానందమును కోల్పోయినవారముగా ఉండవచ్చును. శోధనలు ఎదురైనప్పుడు మన సమాధానమునంతటిని కోల్పోయి ఉండవచ్చును. బైబిల్‌లో భక్తుడైన పేతురు జీవితములో అదే జరిగినది. ప్రభువైన యేసుతో శిష్యుడుగా పని చేయుచున్నప్పుడు, అన్ని చేయాలనే గొప్ప తపన అతడు కలిగియుండెను. అయితే, అతని విశ్వాసము పరీక్షించబడిన కష్టసమయములో ప్రజల యెదుట మూడుసార్లు యేసుక్రీస్తు అతడు తృణీకరించాడు. ఆయన తనకు తెలియదని బొంకెను. ఆ తరువాత ఏమి జరిగింది? పేతురు తన పాపమును తెలుసుకున్నాడు. అతడు చేసినదంతయు మరియు తన తప్పును గుర్తించాడు. తద్వారా, అతడు ఏడుస్తూ విలపించాడు. యేసయ్య ఎప్పటికైనను నన్ను క్షమిస్తాడా? అని తన మనస్సులో అనుకొని ఉండవచ్చును. ఆ ఆలోచన అతని ఆత్మను కృంగజేసియుండవచ్చును. అయితే, పేతురు తను చేసిన తప్పును తెలుసుకొని ఆయనకు మొఱ్ఱపెట్టాడు.
అయితే, నా ప్రియులారా, దేవుడు కనికరముగలవాడు. కనుకనే, యేసు క్రీస్తు మరణమును గెలిచి, తిరిగి లేచిన తర్వాత, యేసయ్యా, పేతురును చూచి ఇలా అడిగాడు, " పేతురూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా?'' అని ప్రశ్నించినప్పుడు, 'అవును, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను' అని పేతురు జవాబిచ్చాడు. అదే ప్రశ్నను మూడుసార్లు అడిగియున్నాడు. అదే ప్రశ్నను ఎందుకు అడిగాడంటే, పేతురు మూడుసార్లు తనను తృణీకరించుటను బట్టియే. అయితే, 'యేసయ్య, తనను క్షమించాడు ' అని తెలుసుకొన్నాడు. తన పాపమును ఇక ఎన్నటికి జ్ఞాపకముంచుకొనలేదని తెలుసుకున్నాడు. బైబిల్‌గ్రంథములో మనము అదే చదువుచున్నాము. బైబిల్ నుండి హెబ్రీయులకు 8:12వ వచనములో చూచినట్లయితే, "నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు'' ప్రకారం ప్రియ స్నేహితులారా, మీ హృదయమంతటితో నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు, ప్రభువు మరల మీకు రక్షణానందమును కలుగజేస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును హత్తుకుంటాడు. మీకు సమాధానమును ఇస్తాడు. ఇంకను సమ్మతిగల మనస్సును మీకు ఇస్తాడు. పేతురు ప్రభువుతో సమాధానపడిన తర్వాత, ఎంతో శక్తివంతమైన పరిచర్యను చేశాడు. అతడు వీధులలో నడుస్తున్నప్పుడు, తన నీడ ప్రజలను స్వస్థపరచియున్నది. రోగగ్ర స్థుల మీద పడిన పేతురు నీడ, వారిని స్వస్థపరచినది. హల్లెలూయా!
అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మీరు కూడా నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు, మన ప్రభువైన యేసు మీ పాపములను ఇకను జ్ఞాపకమును చేసుకొనడు. మీరు కోల్పోయిన రక్షణానందమును మీకు మరల ఇస్తాడు. ఆలాగుననే, సమ్మతిగల మనస్సును మీకు కలుగజేస్తాడు. అది ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి, ఈ రోజు ఈ వాగ్దానమును పొందుకుందామా? మీరు కోల్పోయిన రక్షణానందమును పొందుకుందామా? ఆలాగైతే, మీరు మీ జీవితాలను పేతురు వలె దేవునికి అప్పగించినట్లయితే, ఆయన మీకు వదులుకోని, చివరి వరకు నమ్మకంగా ఉండే ఇష్టపూర్వకమైన ఆత్మను ఇస్తాడు. నేడు, ప్రభువు మీ ఆనందాన్ని పునరుద్ధరించాలని, మీ ఆత్మను పునరుద్ధరించాలని మరియు ఆనందంతో ఆయనను సేవించడానికి మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు. అపరాధ భావనలో లేదా సిగ్గులో ఉండకండి. యేసు వద్దకు తిరిగి రండి, ఆయన మీకు శాంతి, ఆనందం మరియు బలంతో నిండిన నూతన ప్రారంభాన్ని ఇస్తాడు. ప్రభువు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రభువా, రక్షణానందముతో మమ్మును నింపుచున్నందుకై నీకు వందనాలు. ఈ రోజు మా పాపములను ఒప్పుకొని, పశ్చాత్తాపడుచున్నందుకై నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచుము. యేసయ్యా, మా పాపాన్ని క్షమించి మమ్మును పునరుద్ధరించినందుకు నీకు వందనాలు. దేవా, ప్రతిరోజూ నిన్ను నమ్మకంగా సేవించడానికి మాకు సమ్మతిగల మనస్సును దయచేయుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి అపరాధ భారాన్ని తొలగించి దానిని సమాధానమును మరియు ఆనందంతో భర్తీ చేయుము. యేసయ్యా, మా పాపములను హిమము వలె తెల్లగా మార్చుము. ఇకను మా పాపములను జ్ఞాపకము చేసుకొనవని మేము ఎరిగియున్నాము. దేవా, మేము కూడా మా పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనుకుండా ఉండు కృపను మాకు దయచేయుము. ప్రభువా, మా గత పాపములను ఇక ఎన్నటికిని జ్ఞాకపము చేసుకొనకుండా, మరియు ఇకను మేము పాపము చేయకుండా మాకు నూతన జీవితమును, నూతన ఆలోచనలను మాకు అనుగ్రహించుము. దేవా, ఎల్లప్పుడు నీ సేవ చేయగల సమ్మతిగల మనస్సును మాకు దయచేయుము. ప్రభువా, ఈ రోజు నీ రక్షణానందమును మాకు కలుగజేసి, ఇంతకుముందుకంటె, అధికముగా నీయొక్క రక్షణానందమును మాలో నిత్యము నిలిచి ఉండునట్లుగా ప్రతిరోజు నీ సన్నిధిలో మేము సంతోషించునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.