నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 3:24వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తముకాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఏమి చేసినను, మీరు పూర్ణ హృదయముతో చేయండి. మీ చేతి పనులను ఆశీర్వదించవలెననియు, ఆయన మీ పట్ల కలిగియున్న ఉద్దేశమును నెరవేర్చడంలో మీకు సహాయపడవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. బహుశా! మీరు ఎన్నో సంవత్సరములుగా కష్టపడి పనిచేయుచూ, మీ సమయమును, శక్తిని, ఉత్సాహమును వ్యయపరచినప్పటికిని, ఒకవేళ మీరు ఎదురు చూస్తున్న ప్రతిఫలమును చూడలేక మరియు పొందలేకపోయి ఉండవచ్చును. అయితే, నిరాశ చెందకండి. ప్రభువు మీ ప్రయత్నములన్నిటిని చూచుచున్నాడని మరువకండి. ఎందుకంటే, ఆయన మీ హృదయమును ఎరిగియున్నాడు. కనుకనే, ఆయన తగిన కాలములో మీ యథార్థమైన సేవకు తగిన ప్రతిఫలమును మీకు అనుగ్రహించి, మీరు ఆయన ఆశీర్వాదములను పొందుకునే కృపను మీకు అనుగ్రహిస్తాడు.

కాబట్టి, నా ప్రియులారా, మీరు ఏ పనిని చేసినను సరే, అది మనుష్యుల మెప్పు కొరకు కాకుండా ప్రభువు కొరకు చేయండి. మీరు మీ కుటుంబమును పరామర్శించుచున్నను సరే, లేక మీరు వ్యాపారమును నిర్వహించుచున్నను సరే, మీ బాధ్యతలను నెరవేర్చుచున్నను లేదా పరిచర్యలో సేవ చేయుచున్నను సరే, మీరు ప్రతి పనిని పూర్ణ హృదయంతో చేయండి. మీరు వెచ్చించే సమయం, మీకున్న శక్తి మరియు సామర్థ్యములు దేవుని మహిమ కొరకు మాత్రమేనని గుర్తుంచుకోండి. నా ప్రియులారా, మీరు ఆయన కొరకు చేయుచున్నప్పుడు, అత్యంత చిన్న పని కూడా అర్థవంతమైనదిగా మారుతుంది. మీ కుటుంబంలో, పనిలో మరియు నిర్ణయాలలో దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వండి. అందుకే యేసు ఇలాగున అంటున్నాడు, " కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును'' అని మీరు దేవునికి మొదటి స్థానమును ఇచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని మరియు మీకు అవసరమైనవాటన్నిటిని మీకు సమకూరుస్తాడని ఆయన యందు నమ్మకమును కలిగియుండండి.

నేను ఒక సంఘటన మీతో చెప్పాలని కోరుచున్నాను. ఒకసారి, వృద్ధుడును మరియు సేవలో అనుభవజ్ఞుడైన ఒక పాస్టర్ మరియు పరిచర్యలోనికి నూతనముగా వచ్చిన ఒక యువకుడు కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. ఆ వృద్ధ పాస్టర్ తన చుట్టూ ఉన్నవారితో నవ్వుతూ, కబుర్లు చెబుతూ సంభాషణలను వింటూ, ఆనందించుచూ, వారు సమయమును గడుపుచుండెను. ఇంతలో, ఆ యౌవనస్థుడైన పరిచారకుడు పక్కనే కూర్చుని, ఒక నోట్‌బుక్‌లో రాస్తూ, పదేపదే బైబిల్‌ను చూసుకుంటున్నాడు. కొంతసేపు అతనిని గమనించిన వృద్ధ పాస్టర్, 'ఏమి చేయుచున్నావు నాయనా?' అని అడిగాడు. దానికి ఆ యువ పరిచారకుడు, 'రేపు ఆదివారం కదా, నేను ప్రసంగించవలెను' అని జవాబిచ్చాడు. ' నేను ప్రార్థనలో ప్రభువును వెదకుతూ దేవుని వాక్యమును సిద్ధపరచు కుంటున్నాను. నేను ఆయన వాక్యమును ప్రకటించి, ప్రజలకు ఆయన జీవమును అందించవలెను కదా?' అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ పాస్టర్ నవ్వి ఇలా అన్నాడు, 'నీవు ఎంతగానో సిద్ధము చేయుచున్నావు! నీవు వ్రాయుచున్న ప్రతి మాటను సాతాను గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి, నీవు ప్రసంగించేటప్పుడు ఏమి చెప్పబోవుచున్నావని అపవాదికి ముందుగానే తెలిసిపోతుంది. కనుకనే, నన్ను చూడండి! నేను సంతోషంగా ఉన్నాను. నేను మాట్లాడటానికి లేచినప్పుడు, నేను ఏమి చెప్పబోతున్నానో సాక్ష్యాత్తు ఆ దేవునికి కూడా తెలియదు!'' అని చెప్పాడు.

నా ప్రియమైనవారలారా, దేవుని పనిని ఎన్నడూ అజాగ్రత్తగా చేపట్టకూడదని లేదా కేవలం మన శక్తి సామర్థ్యముల మీద మాత్రమే ఆధారపడకూడదని ఈ సంఘటన మనకు గుర్తు చేయుచున్నది. కనుకనే, నా ప్రియులారా, ప్రభువును పూర్ణ హృదయముతో సేవించువారు ఆయన నడిపింపును కోరుకుంటారు మరియు ఆయన జ్ఞానము మీద ఆధారపడతారు. వారి కోరిక తమ సొంత ఉద్దేశములను నెరవేర్చడము కాదు, ఆయన ఉద్దేశములను నెరవేర్చుటకు మాత్రమే ఉంటుంది. కాబట్టి, మనము బాధ్యతలన్నిటిని ప్రార్థనా పూర్వకంగా, విశ్వాసంతో నిర్వర్తిస్తూ, ఎల్లప్పుడూ ఆయనను ఘనపరచడానికి ప్రయత్నించుదాము. బైబిల్‌లోని నోవహును చూడండి. భూమి మీద దుష్టత్వం పెరిగినప్పుడు, రాబోయే జలప్రళయము నుండి తన కుటుంబమును మరియు జీవరాశులను కాపాడటానికి ఒక ఓడను నిర్మించమని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. ఆ ఓడను ఎలాగున నిర్మించవలెనని కొలతలను తెలియజేశాడు. ఆ ఓడ నిర్మాణం గురించి ప్రభువు అతనికి నిర్దిష్టమైన సూచనలు ఇచ్చి, జంతువులను మరియు పక్షులను దానిలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. నోవహు దేవుని ఆజ్ఞలను తృణీకరించలేదు. ఆలాగని, తన సొంత ఆలోచనలను అనుసరించలేదు. ప్రభువు అతనికి ఆజ్ఞాపించినట్లుగానే, అతడు ప్రతిదీ ఖచ్చితంగా చేసి ముగించాడు. చివరికి, ఆ ఓడ సిద్ధమైనప్పుడు, నోవహు తన కుటుంబంతో అందులోనికి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ప్రభువు జంతువులను, పక్షులను అతని వద్దకు తీసుకొనివచ్చాడు. నోవహు తన సొంత బలంతో ప్రతిచోటా వెదకి, ప్రతి జీవిని సేకరించవలసిన అవసరము అతనికి రాలేదు. అతని సామర్థ్యమునకు మించిన దానిని దేవుడు నెరవేర్చాడు.

నా ప్రియులారా, ఇది మనకు ఎంత అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది కదా! ప్రభువు మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు, మనము మన వంతు పనిని నమ్మకముగా చేసి, దాని ప్రతిఫలమును ఆయనకే అప్పగించవలెను. మీరు మీ కుటుంబంలోను, వ్యాపారంలోను, కార్యాలయంలోను లేదా పరిచర్యలోను కష్టపడి పనిచేయుచూ, ఒకవేళ మీరు ఎదురు చూచిన ప్రతిఫలము చూడలేక పోవుచుండవచ్చును? అయితే, మీరు నిరుత్సాహపడకండి. ప్రతి ఉదయం ప్రభువును వెదకండి, ఆయన వాక్యమును ధ్యానించండి మరియు ఆయన నడిపింపును వెంబడించండి. అంతమాత్రమే కాదు, ఆయన మీకు అప్పగించిన పనిని శ్రద్ధతో, నిజాయితీతో సంపూర్ణముగా చేయండి. ఆయన తగిన కాలములో, ఆయన ఉద్దేశమును నెరవేర్చడానికి మీకు అవసరమైన సరైన వ్యక్తులను, అవకాశములను, వనరులను మరియు సహాయమును ఆయన అందించగలడు. ప్రభువు నోవహు వద్దకు సృష్టించిన వాటన్నిటిని తీసుకువచ్చినట్లుగానే, మీకు అవసరమైన వాటిని కూడా ఆయన అందించగలడు. అయితే, మీరు ఊహించినట్లుగానే, సమస్తమును జరుగుతుందని ఎదురుచూడకుండా, ఆయన సమయమును మరియు జ్ఞానమును విశ్వసించండి. ఆయన వాక్యమునకు విధేయత చూపడం మరియు ప్రతిఫలమును ఆయన చేతులకు విడిచిపెట్టడము మన బాధ్యత. బైబిల్ ప్రకారం ప్రభువు నోవహును జ్ఞాపకము చేసుకొని, జలప్రళయము సమయములో అతనిని మరియు అతని కుటుంబమును ఓడలో ఉంచి, వారిని కాపాడాడు. అదేవిధంగా, బైబిల్ నుండి కీర్తనలు 115:12-14 వ వచనములలో మనము చూచినట్లయితే, "యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థుల నాశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులుగలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మనలను జ్ఞాపకముంచుకొనియున్నాడు మరియు మనలను మరియు మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. జలప్రళయం తరువాత, దేవుడు నోవహును, అతని కుమారులను ఆశీర్వదించి, వారు ఫలించి, వృద్ధి చెందాలని ఆజ్ఞాపించాడు. వారి సంతానము వృద్ధి చెంది భూమండలమంతటా వ్యాపించారు.

కాబట్టి, నా ప్రియులారా, ధైర్యంగా ఉండండి! నేడు మీరు చేయుచున్న మీ యొక్క ప్రయత్నములన్నియు మీరు ఎదురు చూచిన ప్రతిఫలములు ఇంకా ఇవ్వలేదని నిరాశపడకండి. మీరు చేయుచున్న ప్రతి పనిలోనూ ప్రభువుకే ప్రథమ స్థానము ఇవ్వవలెను. ఇంకను ఆయనను పూర్ణ హృదయంతో సేవించవలెను. నోవహు వలె, మీకు అప్పగించిన బాధ్యతలను మీరు పూర్ణ హృదయముతో నెరవేర్చండి మరియు మీకు అవసరమైన వాటిని దేవుడు సమకూరుస్తాడని నమ్మండి. ఆయన మీ చేతుల పనిని ఆశీర్వదించి, మీ కుటుంబమును బలపరచి, మీ నిర్ణయములకు మార్గనిర్దేశం చేసి, తన ఉద్దేశములను నెరవేర్చడంలో మీకు సహాయం చేయును గాక. ఆయన మీ విశ్వాసనీయమైన సేవను ఘనపరచి, తన ఆశీర్వాదములను అనుభవించు కృపను మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, నీ మహిమ కొరకు ప్రతి పనిని పూర్ణహృదయంతో చేయడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ యందు భయభక్తులతో, భక్తిశ్రద్ధలతో, మరియు విశ్వాసంతో నీ చిత్తమును నోవహు వలె నెరవేర్చడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుము మరియు మా కుటుంబములోను, పరిచర్యలోను, మరియు వ్యాపారంలోను నిన్ను నమ్మకముగా సేవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు నోవహును జ్ఞాపకం చేసుకున్నట్లుగానే, మమ్మును మరియు మా పిల్లలను జ్ఞాపకం చేసుకొని, ఆశీర్వదించుము. దేవా, మా కొరకు నియమించబడిన ప్రతి ఆశీర్వాదం, వనరులు, మంచి అవకాశము మరియు కృపను నీవు నిర్ణయించిన తగిన సమయములో మా కొరకు వచ్చునట్లుగా చేయుము. దేవా, మా యొక్క శారీరక, ఆధ్యాత్మిక, మరియు ఆర్థిక అవసరతలన్నిటిని తీర్చుము, ప్రభువా, మా యొక్క బలమును పునరుద్ధరించుము మరియు మాకు ఘనతను, సమాధానమును దయచేయుము. దేవా, మేము మొదట నీ రాజ్యమును, నీతిని వెదకడానికి మరియు నీ వాక్యము ప్రకారముగా జీవించడానికి మాకు సహాయం చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.