నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోవేలు 2:25వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడ పురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును'' ప్రకారం నేడు మీరు కోల్పోయిన వాటిని ప్రభువు మీకు మరల ఇస్తాడని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, ఈనాడు వాగ్దానములో చూచినట్లయితే, 'మిడుతల మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మిడుతలను ఏమి తింటాయి అని మనము చూచినట్లయితే, అవి పంటలన్నిటిని తినివేసి, అన్నిటిని నాశనము చేస్తాయి. అవి ప్రతి చెట్టు కొమ్మలను, ఆఖరికి పువ్వులను కూడా తినివేస్తాయి. అవి వేటిని విడిచిపెట్టవు. అవి వెళ్లే దారిలో అన్నిటిని నాశనము చేస్తాయి. కరువు వచ్చుటకు ఈ మిడతలు కూడా ఒక కారణముగా ఉండవచ్చును. అదేవిధముగా, ఒకవేళ మీరు కూడా, 'నా జీవితములో అన్నియు కూడా తినివేయబడుచున్నవి. నాశనమైపోవుచున్నాయి అని అంటున్నారా? ఒక్క సమస్య అయితే, నేను ఏదో ఒక విధంగా పరిష్కరించుకోగలను. కానీ, నా ఆర్థికాలు నాశనమైపోయాయి. నా ఆరోగ్యము నాశనమై పోయినది, నా భవిష్యత్తు, నా వ్యాపారము, నా ఉద్యోగము, అన్నియు పోయినవి, నా కుటుంబములో అసలు సమాధానమే లేదు అని అంటున్నారా? ఇవన్నియు కూడా ఒక్కసారి జరుగుతున్నాయి అని చింతించుచున్నారా? నా యెదుట ఉన్న ప్రతి ద్వారము కూడా మూసివేయబడియున్నవి. మీ జీవితములో మిడుతలు అన్నిటిని తినివేశాయి అని భావించుచు ఈలాగున చెబుతున్నారా? నేను అనుభవించడానికి ఏదియు కూడా లేదు, సమాధానమే నా జీవితములో లేదు అని అంటున్నారా?' అయితే, మీరు దిగులుపడకండి.
కానీ, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కధను ఇంకా ముగింపు చేయలేదు - దేవుడు ఇంకా మీ కొరకు పనిచేయుచున్నాడు. మీరు కోల్పోయినవన్నియు మరల పునరుద్ధీకరిస్తానని ప్రభువు అంటున్నాడు. నా ప్రియులారా, మీరు కోల్పోయిన వాటన్నిటిని కేవలం ఇచ్చివేయకుండా, పునరుద్ధరిస్తాను అని ఎందుకు అంటున్నాడు? ప్రభువు ఏవైన పునరుద్ధరీకరించినట్లయితే, మీరు పోగొట్టుకున్నవాటన్నిటికంటెను ఆయన రెండంతలుగా మీకు మరల ఇస్తాడు. బైబిల్‌లో యోబు జీవితములో మనము అది చూడలేదా? అతడు అన్నిటిని కోల్పోయాడు. తన ఆరోగ్యమును, కుటుంబమును, సంపదను, ఆస్తి అంతటిని కోల్పోయాడు. అతనికంటూ ఏమి మిగలలేదు. అతడు వీధులలో ఒంటరిగా ఉండెను, ఇది నాది అని చెప్పుకోవడానికి ఏమియు లేకుండా ఉండెను. కానీ, ప్రభువును అతడు గట్టిగా పట్టుకొని యుండగా, ప్రభువును ఎప్పుడు అతడు విడిచిపెట్టకుండా ఉన్నందున, "యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను'' అని చెప్పబడినట్లుగానే, నిజముగానే, అతను కోల్పోయిన దానికంటె రెండంతలుగా ప్రభువు అతనికి మరల దయచేశాడు. రెండంతలుగా అతని జీవితమును పునరుద్ధరీకరించాడు. హల్లెలూయా!
కాబట్టి, నా ప్రియులారా, మీ జీవితములో కూడా ఈ రోజు మీరు కోల్పోయిన వాటిని తిరిగి మీకు ఇవ్వడము మాత్రమే కాదు, దేవుడు రెండంతలుగా మీ జీవితంలో పునరుద్ధరీకరిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు కోల్పోయిన వాటన్నిటికి బదులుగా, మీరు కోల్పోయిన సమాధానము అంతటిని, మీ గౌరవమంతటిని, రెండంతలుగా ప్రభువు తిరిగి మీకు ఇస్తాడు. అయితే, నా ప్రియులారా, మీరు చేయవలసినదేమనగా, ఈ సమయములో ప్రభువు సన్నిధిలో వేచి ఉండండి. ఆయన పాదముల యొద్ద కనిపెట్టుకొని ఉండండి. ప్రభువు అన్నిటిని సరిదిద్దుతాడు అని మీరు యోబు వలె విశ్వసించినప్పుడు ఆయన మిమ్మును లేవనెత్తి, మీకు విజయమును ఇస్తాడని నమ్మండి. మిడుతలు తినివేసిన సంవత్సరములన్నిటిని మీకు తిరిగి ఇస్తాడు అని విశ్వసించండి. అంతమాత్రమే కాదు, మీరు ప్రభువును స్తుతిస్తూ, మనము అద్భుతములను ఈ రోజు పొందుకుందామా? ఆలాగుననే, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీకు రెండంతలుగా మరల దయచేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మ్రాతో మాట్లడినందుకై నీకు వందనాలు. దేవా, నేడు మేము కోల్పోయినవాటన్నిటి తిరిగి ఇస్తానని వాగ్దానము చేసినట్లుగానే, నేడు మేము కోల్పోయినవాటన్నిటి రెండంతలుగా మరల మాకు దయచేయుము. ప్రభువా, మేము కోల్పోయిన ఆరోగ్యము కంటే మరల మాకు మంచి ఆరోగ్యమును దయచేయుము. దేవా, మేము ఊహించినదానికంటె అత్యధికముగా మాకు అనుగ్రహించుము. తండ్రి, మా వ్యాపారములోను, ఉద్యోగములోను మంచి అభివృద్ధిని మాకు దయచేయుము. దేవా, మా చదువులలో మేము ప్రకాశించునట్లుగాను, మా జీవితములో ఉన్నతముగా పైకి లేవనెత్తబడునట్లుగా, కుటుంబముగా మేము కోల్పోయిన వాటన్నిటిని రెండంతలుగా ఆశీర్వాదములను పొందుకొని సంతోషించునట్లుగా మా జీవితమును పునరుద్ధరీకరించుము. ప్రభువా, మేము నష్టాల ద్వారా వెళుచున్నప్పటికిని, మాకు సహాయం ఎక్కడ నుండి వస్తుందో అక్కడ నుండి మేము నిన్ను చూడాలని ఎంచుకున్నాము. దేవా, నీవు మాకిచ్చిన నీ వాగ్దానాన్ని మేము యోబు వలె గట్టిగా పట్టుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు పునరుద్ధరించే దేవుడవు కనుకనే, నేడు మేము కోల్పోయిన దానిని మరల ఇవ్వడము మాత్రమే కాదు, రెండంతలుగా మాకు తిరిగి ఇస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు యోబును సమస్తమును కోల్పోయిన స్థితి నుండి పైకి లేవనెత్తినట్లుగానే, మమ్మును కూడా పైకి లేవనెత్తుతావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నేడు మేము కోల్పోయిన వాటన్నిటి మధ్యలో కూడా మా విశ్వాసాన్ని బలపరచుము మరియు నిన్ను ఎన్నటికిని విడిచిపెట్టకుండా మాకు సహాయం చేయుము. దేవా, ఈ రోజు నీ పునరుద్ధరణ, నీ స్వస్థత మరియు నీ అద్భుతాన్ని మేము పొందుకొనునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.