నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. నేడు మీలో ప్రతి ఒక్కరిని ఈ సందేశము చదువుటకు ప్రేమతో మిమ్మును ఆహ్వానించుచున్నాను. అవును, ఈ వచనము ద్వారా మీలో ప్రతి ఒక్కరితోను ప్రభువు మాట్లాడి, మిమ్మును ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 122:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ ప్రాకారములలో మీకు నెమ్మదిని కలుగజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. ఈ లేఖనానుసారముగా, ఈ వాక్యము చదువుచున్న మీలో ప్రతి ఒక్కరు కూడా సమస్త జ్ఞానము నకు మించినటువంటి దేవుని యొక్క గొప్ప సమాధానమును పొందుకొనవలెనని నేను ఆశించుచున్నాను. ఈ సమాధానమును మనకు ఇచ్చుట కొరకే యేసయ్య, ఆ సిలువలో తన ప్రాణమును మన కొరకు అర్పించియున్నాడని నమ్మండి. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 4:25వ వచనములో చూచినట్లయితే, "ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను'' అని చెప్పబడినట్లుగానే, మనలను నీతిమంతులనుగా తీర్చుట కొరకు ఆయన సిలువలో తన్నుతాను అప్పగించబడియున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.
ఇందుకు ఆధారముగా మనము బైబిల్ నుండి యోహాను సువార్త 4వ అధ్యాయములో చూచినట్లయితే, ఒక సమరయ స్త్రీని గురించి మనము చదవగలము. బావి యొద్ద నీళ్లు చేదుకొనుటకు ఆమె వచ్చినప్పుడు, యేసయ్య కూడా అక్కడ కూర్చుని యుండియున్నాడు. ఆమె పాపపు జీవితమును కలిగియున్నటువంటి ఒక స్త్రీ. అయితే, ప్రభువైన యేసు నోట నుండి వాక్యమును ఆమె విన్నప్పుడు, ఆమె తన జీవితమును మార్చుకొని, కడగబడి, నూతన వ్యక్తిగా మార్చబడినది. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 9:23వ వచనములో చూచినట్లయితే, "మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటము...'' అని ఈ విషయమును మనకు వివరించబడినట్లుగానే, దేవుని యొక్క కరుణాపాత్రగా ఆమె మారిపోయినది.
అందుకే బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 5:23వ వచనములో చూచినట్లయితే, "సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచు ను గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడ బడును గాక'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ యొక్క జీవితములను సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుట కొరకు ఆయన సమాధానకర్తగా ఈ లోకమునకు వచ్చియున్నాడు. అవును, ప్రభువు మన జీవితములను ఎట్టి విధముగా మార్చివేస్తాడు? అని బైబిల్ నుండి హెబ్రీయులకు 13:20-21వ వచనములలో చూచినట్లయితే, " గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు, యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్'' అని చెప్పబడినట్లుగానే, సమాధానకర్తయగు దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించి, మిమ్మును తన చిత్త ప్రకారముగా సిద్ధపరచుచున్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే, మీరు ప్రభువు యొద్దకు రండి, సమాధానకర్తయగు దేవుడు ఈ దైవీకమైన సమాధానమును మీకు అనుగ్రహించునట్లుగా మిమ్మును మీరు ఆయన సమర్పించుకొని ప్రార్థించి నట్లయితే, నిశ్చయముగా, మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది మరియు మీ నగరులలో క్షేమముండును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఇటువంటి ప్రశస్తమైన ఆశీర్వాదమును మరియు గొప్ప సమాధానమును నీవు మాకు అనుగ్రహించుచున్నందుకై నీకు వందనములు. యేసయ్యా, అడుగుడి మీకియ్యబడును అని వాగ్దానము చేసినట్లుగానే, మేము నిన్ను అడుగుచున్నాము. తండ్రీ, మమ్మును మరియు మా కుటుంబమును నీ యొక్క దైవీకమైన సమాధానముతో నింపుము. దేవా, మా గృహమును నీ యొక్క దైవీకమైన సమాధానముతో నింపుము. ప్రభువా, ఈ లోకములో ఉన్న చింతలను మరియు ఇబ్బందులన్నిటిని మా నుండి తొలగించుము. దేవా, మమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచి, మా ఆత్మను, ప్రాణమును మరియు శరీరమును నీ యెదుట నిందారహితులముగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, ఈ లోకమునకు సంబంధించిన ప్రతి చింతను, భయమును మరియు ఆందోళనను మా నుండి తొలగించుము. ప్రభువా, మా యొక్క ప్రతి పాపపు మార్గము నుండి మమ్మును పరిశుద్ధపరచి, నీ కరుణకు పాత్రలుగా మమ్మును మార్చుము. దేవా, నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించి, మా జీవితములో ప్రతి మంచి కార్యములోను మమ్మును సంపూర్ణులుగా చేయుము. యేసయ్య, నీ యొక్క శాంతి మా జీవితములలోను మరియు గృహములలో ఏలునట్లుగా చేసి, మమ్మును దీవించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


